మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ ఎందుకు ఒక్కసారిగా కిరణ్ కుమార్ రెడ్డి మీద విరుచుకుపడ్డారు? దీనివెనక చాలా వ్యవహారం ఉందని అభిఙ్న వర్గాలు చెబుతున్నాయి. డొక్కాకు కిరణ్ కు మధ్య చాలాకాలంగా దూరం ఉంది. తనకు తగిన గుర్తింపు, పదవి ఇవ్వలేదని, కిరణ్ ది అహంకారపూరిత వైఖరి అని డొక్కా గతంలో చాలాసార్లు తన సన్నిహితులతో వాపోయేవారు. అయితే, తాజా పరిణామాలకు ఇది ప్రధాన కారణం కాదు.
డొక్కా గుంటూరు జిల్లాలో ఎంపి రాయపాటి సాంబశివరావుకు సన్నిహితుడు. రాజకీయంగా ఆయన వర్గీయుడు. తాజాగా రాయపాటి వైఎస్సార్ సిపి లో చేరేందుకు సిద్దపడుతున్నారని, ఆయన బాటలో నడిచేందుకు డొక్కా కూడా రెడీ అవుతున్నారని సమాచారం. జగన్ కు బెయిల్ రానిపక్షంలో, కొత్త పార్టీని పెట్టాలనే ఆలోచన గురించి రాయపాటి ఇటీవల మాట్లాడారు. అయితే, జగన్ బయటకు రావడంతో, కొత్త పార్టీకి అవకాశం లేదని అంచనాకు వచ్చారని సమాచారం. ఈ నేపధ్యంలోనే డొక్కా మాటలను అర్థం చేసుకోవాలని అంటున్నారు.
డొక్కా సమైక్యాంధ్ర ఉద్యమంలో మొదటి నుంచి దూరంగా ఉన్నారు. సమైక్యాంధ్రను కోరుతున్నామని, అధిష్టానాన్ని అడుగుతున్నామని చెబుతున్నారే గాని, ఆయన స్వయంగా ఈ అంశం మీద ఎటువంటి చొరవ, పట్టుదల చూపలేదు. ఇప్పుడు, ఆయన మీడియా సమావేశం కూడా, సమైక్యాంధ్ర మీద కాకుండా, కిరణ్ వైఖరి మీదే ఎక్కువగా సాగింది.
మరో విశేషమేమిటంటే, ఎవరూ అడగకుండానే జగన్ గురించి డొక్కా మాట్లాడారు. వైఎస్సార్ కొడుకుగా జగన్ అంటే అభిమానమన్నారు. జగన్ బిజెపి కి దూరంగా ఉంటే మంచిదని సలహా ఇచ్చారు. ఆయన బిజెపికి దగ్గరయితే, విజయమ్మ, షర్మిల కూడా ఒప్పుకోరని అన్నారు. ఇవన్నీ, ఆయన ఆలోచనలు ఎటు మొగ్గుతున్నాయో తెలుపుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.