కందుల రమేష్

ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఒకవైపు ఇవాళో రేపో విశాఖపట్నానికి రాజధానిని తరలిస్తున్నామని ప్రతిరోజూ ప్రకటించే జగన్ ప్రభుత్వం ఈ దశలో మళ్లీ ఇటువంటి పిటిషన్ ని దాఖలు చేయడాన్ని బట్టి అధికార పార్టీకి దిక్కుతోచటం లేదనేది పరిశీలకుల భావన. 

ఇటువంటి పిటిషన్ ని సుప్రీం కోర్టులో దాఖలు చేయటం ఒకరకంగా హాస్యాస్పదం. ఎందుకంటే ఇటువంటి కమిటిల సిఫార్సులు (?) సలహాపూర్వకమే గాని, ప్రభుత్వం తప్పనిసరిగా పాటించాల్సిన విధివిధానాలు కావు. నిజానికి శివరామకృష్ణ కమిటి రిపోర్టు మాండేటరి కాదు. మాండేటరి అంటే చట్టపరంగా రిపోర్టుని అమలు చేయాల్సి ఉండటం. అలా మాండేటరి గనుక అయివుంటే, అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడే కేంద్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టేది.

1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు జస్టిస్ వాంఛూ కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన కొత్త రాష్ట్రానికి గుంటూరు రాజధానిగా ఉంటే బాగుంటుంది అని సిఫార్సు చేశాడు. ఆ సిఫార్సుని అప్పటి ప్రకాశం ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆనాడు కర్నూలుని రాజధానిగా చేసిన విషయం తెలిసిందే.

కేంద్రం మొన్ననే పార్లమెంటులో కూడా శివరామకృష్ణన్ కమిటి రిపోర్టు గురించి ప్రస్తావించింది. ఏపి విభజన చట్టం సెక్షన్ 5,6 ప్రకారం, రాజధాని ప్రత్యామ్యాయాల గురించి అధ్యయనం చేయటానికి కేంద్రం శివరామకృష్ణన్ కమిటిని ఏర్పాటు చేసిందని, ఆ కమిటి రిపోర్టు ఇచ్చిందని, తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిందని చెప్పింది.

ఇందులో ఎక్కడా శివరామ కమిటి సిఫార్సులకి విరుద్ధంగా అమరావతి ఎంపిక జరిగిందని కేంద్రం చెప్పలేదు. దానికి కారణం ఏంటంటే, కమిటి పని సిఫార్సు చేయటం వరకే పరిమితం. ఆ సిఫార్సులని ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాలని లేకపోవటమే. 

ఇక సుప్రీం కోర్టు శివరామకృష్ణన్ కమిటి రిపోర్టుని తూచా తప్పకుండా అమలు చేయాలన్న జగన్ ప్రభుత్వ పిటిషన్ ను ఆమోదించే అవకాశం ఉందా? 

ఎంతమాత్రం లేదు. 

ఎందుకంటే, కమిటీల రిపోర్టులకి recommendatory పవరే గాని, అవి enforceable కాదు. రాష్ట్ర అసెంబ్లీలో అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తూ చేసిన తీర్మానానికి constitutional sanctity ఉంది. శివరామ కమిటి రిపోర్టుకి అటువంటి sanctity ఉండదు. అందువల్ల, జగన్ ప్రభుత్వం కోరినట్టు, శివరామకృష్ణన్ కమిటి రిపోర్టుని అమలు చేయాలన్న పిటిషన్ ని సుప్రీం కోర్టు ఆమోదించే అవకాశం లేదనేది నా వ్యక్తిగత అభిప్రాయం.

ఇక, మూడో పాయింట్. అసలు శివరామకృష్ణన్ కమిటి ఏం చెప్పిందని దాన్ని అమలు చేస్తారు? ఎందుకంటే, కమిటి రిపోర్టులో రాజధానికి సంబంధించి ఎటువంటి ప్రత్యామ్నాయాలని ఇవ్వలేదు. Capital functionsని రాష్ట్రవ్యాప్తంగా  distribute చేస్తే బాగుంటుంది అని అన్నారు. ఉదాహరణకి, ఆయన పరిశ్రమల శాఖ, ఐటి శాఖలను వైజాగ్‌లో, వ్యవసాయ శాఖను ప్రకాశం జిల్లాలో, విద్యాశాఖను అనంతపురంలో, ఆరోగ్య శాఖ, నీటి పారుదల శాఖలను నెల్లూరులో, సంక్షేమ శాఖను కడపలో, ఇంకా హోం శాఖ, ఆర్ధిక శాఖ, మున్సిపల్‌ శాఖ మొదలైనవాటిని వేర్వేరు జిల్లాల్లో పెట్టాలని చెప్పాడు. హైకోర్టు విశాఖలో ఉంటే బాగుంటుంది అని చెప్పాడు. సిఎం జగన్ ప్రతిపాదనలు వీటికి భిన్నంగా ఉన్నాయి. హైకోర్టును ఆయన కర్నూల్లో పెడుతున్నానని చెప్పాడు.

అలాగే, సెక్రటేరియట్ ని కృష్ణా జిల్లాలో ముసునూరు ప్రాంతంలో పెట్టవచ్చని శివరామకృష్ణన్  సిఫార్సు చేశాడు. జగన్ ప్రతిపాదన అది కాదు. అసలు, శివరామమూడు రాజధానుల గురించి మాట్లాడలేదు. మరి, వైసిపి ప్రభుత్వం మూడురాజధానుల ప్రతిపాదనను వదిలేసుకుంటుందా?

విచిత్రమేంటంటే, శివరామకృష్ణన్‌ కమిటీ స్వయంగా తయారుచేసిన చేసిన సూటబిలిటీ ఇండెక్స్‌ ప్రకారం, ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాల కంటే రాజధానిగా విజయవాడ-గుంటూరు ప్రాంతమే అనువైనది. డిస్ట్రిక్ట్‌ అండ్‌ కాపిటల్‌ జోన్‌ సూటబిలిటీ ఇండెక్స్‌ పేరుతో, రాజధాని ప్రాంతాన్ని గుర్తించడానికి శివరామకృష్ణన్‌ కమిటీ ఐదు గీటురాళ్లను ఎంచుకుంది. అవి ప్రకృతి వైపరీత్యాలు, రవాణా సౌకర్యం, నీటి వసతి, ప్రాంతీయ అభివృద్ధి మరియు భూమి లభ్యత. కమిటీ స్వయంగా తయారు చేసిన టేబుల్‌ ప్రకారం, ఈ ఐదు ప్రమాణాల్లోను విజయవాడ, గుంటూరు ప్రాంతమే అనువుగా తేలింది. విజయవాడకు మిగతా అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా పాయింట్లు వస్తే, విశాఖపట్నం రెండవ స్థానంలోను, గుంటూరు మూడవ స్థానంలోను ఉన్నాయి. 

మరి సుప్రీం కోర్టు ఒకవేళ శివరామకృష్ణన్ కమిటి రిపోర్టుని యథాతథంగా అమలుచేయాలని నిజంగానే ఆదేశిస్తే, ఆ ప్రకారం జగన్ ప్రభుత్వం చేయగలదా? 

వీటన్నిటిని బట్టి అర్థమయ్యేదేంటంటే, తానే వేసుకున్న రాజధాని చిక్కుముడిని విప్పలేక, బర్రె తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు, శివరామకృష్ణన్ రిపోర్టు పేరుతోనైనా రాజధాని విషయంలో ఏమన్నా రిలీఫ్ దొరుకుతుందా అనే దింపుడు కళ్లెం ఆశతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పిటిషన్ వేసిందని అనుకోవాలి.