కందుల రమేష్ 

“విశాఖను వరించిన పెట్టుబడులు” అని ప్రముఖ జర్నలిస్టు ఏబికె ప్రసాద్ సాక్షిలో ఒక వ్యాసం రాశారు.

కమ్యూనిస్టు భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న నిఖార్సైన విశ్రాంత పాత్రికేయుడిగా అయనకి పేరుప్రఖ్యాతులున్నాయి. అందువల్ల ఈ శీర్షిక నన్ను ఆకర్షించింది.

ఎందుకంటే ఏబికె చెప్పే సిద్ధాంతాలు వేరు. పరిశ్రమలు – ఆయన పరిభాషలో ఉత్పత్తి సాధనాలు – ప్రభుత్వం చేతిలోనే ఉండాలి. ప్రైవేటు పెట్టుబడుల్ని నిషేధించాలి. పెట్టుబడిదారీ వ్యవస్థని తరిమికొట్టాలి.

ఈ వాదంలోని మంచిచెడుల్ని గురించి ఇప్పుడు మాట్లాడబోవటం లేదు. కాని పెట్టుబడిదారీ విధానం మీద ఒంటికాలిమీద లేచే ఈయన, ప్రవేటురంగ పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి భారీగా విశాఖకి పట్టుకొచ్చారని మెచ్చుకోలుగా రాయటంలోని వైరుధ్యం ఆశ్చర్యపరిచింది.

తాను జీవితాంతం వల్లించిన పెట్టుబడిదారీ వ్యతిరేక సిద్ధాంతాల్ని ఏబికె త్యజించారా అనే అనుమానం వచ్చింది. కాని అది కూడా నిజం కాదు. ఎందుకంటే ఒకవైపు విశాఖకి పెట్టుబడుల్ని తీసుకొచ్చాడని జగన్ ని ఆకాశానికెత్తేస్తూనే మరోవైపు పెట్టుబడిదారీ వ్యవస్థ మీద పాత పడికట్టు పదజాలాన్ని విస్తృతంగానే ఉపయోగించారు.

ఏబికె వ్యాసం ఎప్పటిలాగే కొటేషన్లతో ప్రారంభమైంది. పెట్టుబడిదారి వ్యవస్థ వైఫల్యం గురించి, నానాటికి పెరిగిపోతున్న సామాజిక అసమానతల గురించి అంతర్జాతీయ ట్రేడ్‌ యూనియన్‌ సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఏమన్నాడో, ప్రపంచ ఆర్థిక, సహకారాభివృద్ధి సమాఖ్య ఏమని వ్యాఖ్యానించిందో ఉటంకిస్తూ వ్యాసం మొదలైంది. ఈ ఉటంకింపుల్లో కొత్త విషయం ఏమీ లేదు. అయితే ఏదో మేధోమధనం చేస్తున్న భ్రమ కల్పించేందుకు సామాన్య పాఠకులకి పరిచితం కాని పేర్లతో వ్యాసాన్ని ప్రారంభించడం ఏబికె ట్రేడ్ మార్కు. దీన్ని ఇంగ్లీషులో నేమ్ డ్రాపింగ్ అంటారు.

ఇంతకీ పెట్టుబడిదారీ వ్యవస్థ విఫలమైందని, అసమానతలు పెరిగిపోతున్నాయని చెబుతున్న ఏబికె మళ్లీ విశాఖలో పెట్టుబడుల ఆకర్షణ అద్భుతంగా జరిగిందని ఎందుకు చంకలు గుద్దుకుంటున్నారన్న ప్రశ్నకి నాకు సమాధానం దొరకలేదు.

వ్యాసంలో ఇంకా ముందుకు వెళితే, దావోస్ లో ఏటా జరిగే పెట్టుబడిదారుల సదస్సు సంపన్నుల కోసమే ఉందని ఆయన వక్కాణించారు. జగన్ పోయినేడాది దావోస్ వెళ్లొచ్చారు. అయితే ఏబికె ప్రకారం, జగన్ (మార్క్సిస్టు అవగాహనతో?) అక్కడి చర్చలని పరిశీలించి, (వాటిని తోసిరాజని), “ఒక కొత్త దృక్పధంతో రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం పథక రచన చేశారు”. ఏంటీ పథక రచన? ఆయనే చెప్పారు: “విశాఖ కేంద్రాన్ని ప్రపంచ పెట్టుబడులకు కేంద్రస్థానంగా ఎందుకు మార్చకూడదన్న ఆలోచనతో జగన్‌ ముందుకు సాగిన ఫలితమే – గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023”.

బోడిగుండుకి, మోకాలుకి ముడిపెట్టినట్టు దావోస్ కి, విశాఖకి ఏబికె లంకె పెట్టారు. దావోస్ సదస్సు సంపన్నుల కోసమే ఉంది, అందుకని జగన్ ఒక కొత్త పథక రచన చేశారు. ఏంటా పథకం? విశాఖని ప్రపంచ పెట్టుబడులకు కేంద్రస్థానంగా మార్చడం! దావోస్ పెట్టుబడిదారులకి, విశాఖ పెట్టుబడిదారులకి తేడా ఏంటి? అక్కడా ఇక్కడా కనిపించింది అదే అదానీలు, అంబానీలు. విశాఖ కేంద్రంగా ఇటువంటి సదస్సు ఏర్పాటు చేయటం చరిత్రలో ఇది మొదటిసారి కాదు. గత ప్రభుత్వంలో అక్కడ ఇప్పటికే మూడు సార్లు సదస్సులు జరిగాయి. ఏబికె ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెబుతున్నారు?

I persevered and continued to read.

కొద్దిమంది సంపన్నులు ప్రజాబాహుళ్యం మీద నియంతృత్వం వహించే ‘పెట్టుబడిదారీ’ ప్రమాదం ఇవాళ పొంచి ఉందట. జగన్ తన నవరత్నాలతో దీన్ని ఎదుర్కొంటున్నాడట. అందుకనే విశాఖకి పెట్టుబడులు వచ్చినా రాష్ట్రానికి ఏం ప్రమాదం లేదట. ఈ మూడు అంశాల మధ్య పొంతన లేదనేది పక్కనబెట్టండి. ఒకవైపు పెట్టుబడుల్ని ఆకర్షించి ‘తన వయసుకి మించిన గౌరవాన్ని’ పొందుతూ, మరోవైపు నవరత్నాల్ని ప్రవేశపెట్టి పెట్టుబడిదారీ వ్యవస్థ నడ్డివిరిచిన ఘనత జగన్ దేనని ఏబికె మురిసిపోయారు. కమ్యూనిస్టు సిద్ధాంతానికి ఏబికె చెప్పిన ఈ కొత్త భాష్యాన్ని చదివి కార్ల్ మార్క్స్, ఫ్రెడ్రిక్ ఏంగెల్స్, మావో జెడాంగ్ లు తమ శవపేటికల్లో మరింత కృశించిపోయి ఉంటారు.

చంద్రబాబు నాయుడో, నరేంద్ర మోడియో, మరొకరో పెట్టుబడులు తీసుకొస్తే అదేమో సంపన్నుల నియంతృత్వానికి దారితీస్తుందట. కాని జగన్ ద్వారా ప్రపంచవ్యాపితంగా పెట్టుబడులు రావటం మాత్రం రాష్ట్రానికి మేలు చేస్తుందట. ఇది shallowness of the highest order.

గాలిమరల మీద కత్తిదూస్తున్నట్టు పెట్టుబడిదారీ విధానం మీద అరిగిపోయిన పదాలతో ఏబికె విమర్శలు చేస్తారు. మరోవైపు దేశంలోనే అతిపెద్ద క్రోనీ క్యాపిటలిస్టుల్లో ఒకడు, రాజకీయాల్ని ఒక క్రిమినల్ ఎంటర్ ప్రైజ్ గా మార్చిన జగన్మోహన్ రెడ్డిని కీర్తిస్తారు. ఏబికె చేసిన ఈ విన్యాసం mind-boggling.

‘పెట్టుబడిదారీ వ్యవస్థ, సంపన్నులు, పేదలు’ లాంటి పదాల ప్రయోగం తర్వాత ఏబికె అసలు విషయానికొచ్చారు. ‘అతుకుల బొంత’ తెలుగుదేశం, ‘గాలివాటు’ పవన్‌ కల్యాణ్‌ ల మధ్య రహస్య సమావేశాల్ని బిజెపి ఆపలేకపోయిందట. అయినా వీళ్లద్దరూ జగన్ ప్రగతి మార్గాన్ని అడ్డుకోలేకపోయారట. అంతటితో ఆయన భజన ఆగలేదు. దేశంలోని రాజకీయ పార్టీలకూ, ముఖ్యమంత్రులకూ తండ్రి రాజశేఖరరెడ్డి తర్వాత అంత ఆదర్శంగా నిలిచినవాడట జగన్‌!

అంటే, దేశంలో రాజకీయ పార్టీలకి, ముఖ్యమంత్రులకి రాజశేఖరరెడ్డి తొలి ఆదర్శం అని ఏబికె నమ్ముతున్నారన్నమాట. ఆ రెడ్డి గారి తర్వాత మళ్లీ ఈ రెడ్డిగారు మాత్రమే దేశానికి ఆదర్శం అని కూడ ఏబికె విశ్వసిస్తున్నారన్న మాట. This is shockingly beyond partisanship.

ఆయన సిద్ధాంతాలే కాదు, వ్యక్తీకరణ కూడా అంతే గందరగోళం.

ఏబికె అన్ని రాతల్లాగానే ఈ వ్యాసంలో కూడా intellectual pretentiousness మెండుగా కనిపిస్తుంది. ఇంత అనుభవశాలికి సరళంగా రాయటం కూడా రాదా అనే అనుమానం వస్తుంది ఈ వ్యాసం చూస్తే. ఈ వాక్య నిర్మాణం చూడండి ఎంత muddled గా ఉందో.

“జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు 62 శాతం పదవులు ఇచ్చి దేశ చరిత్రలో నూతన ఒరవడిని సుస్థిరపరిచి దేశ చరిత్రలోనే మొదటి స్థానంలో జగన్‌ నిలబడటానికి ‘దమ్ము’ అందించినవీ, అధికారానికి రావడానికి ముందే సుదీర్ఘమైన పాదయాత్ర ద్వారా గడించిన ప్రజాస్పర్శతో ప్రకటించినవీ అనుల్లంఘనీయమైన ‘నవరత్నాల’ని మరచిపోరాదు.”

ఇటువంటి రాతలు చూసినప్పుడు ఎడిటర్ల పేరుతో ఈయన లాంటి వాళ్లు గతంలో సంపాదించిన ఘనకీర్తి undeserving అని తెలిసిపోదా? Isn’t it time to expose the emperor’s clothes?