ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అబద్ధాలకి అంతే ఉండదు. భోగాపురం ఎయిర్ పోర్టు కోసం గత ప్రభుత్వం ఏం చేయలేదని, తానే అన్నీ చేస్తున్నానని ఇవాళ జరిగిన రెండో శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన చెప్పారు.

ఈ ఎయిర్ పోర్టుని 2015లోనే ప్రతిపాదించిందీ, కేంద్ర ప్రభుత్వం అనుమతిని సాధించిందీ, భూసేకరణని దాదాపుగా పూర్తి చేసిందీ, నిర్మాణం కోసం జిఎంఆర్ ఎయిర్ పోర్టు ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్పెషల్ పర్పస్ వెహికల్ ని ఏర్పాటు చేసిందీ గత ప్రభుత్వమే.
అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 2019 ఫిబ్రవరి 14న శంకుస్థాపన చేశారు.

ఆనాడు జగన్ ఏమన్నాడో తెలుసా?

వైజాగ్ విమానాశ్రయం ఉండగా, మరో ఎయిర్ పోర్టు ఎందుకు అని ప్రశ్నించాడు. వైజాగ్ ఎయిర్ పోర్టు మన అవసరాలకి సరిపోతుందని, భోగాపురంలో తలపెట్టిన ఎయిర్ పోర్టు వృధా అని అన్నాడు.

 వైజాగ్ ఎయిర్ పోర్టుని పెద్దది చేస్తున్నామని విమానయాన శాఖ ప్రకటించిందని, భోగాపురంలో చంద్రబాబు ఎయిర్ పోర్టు ఆ పార్టీ నాయకులు డబ్బు వెనకేసుకోవడం కోసమేనని ఆరోపించాడు.

భోగాపురం ఎయిర్ పోర్టు కోసం చంద్రబాబు 2,700 ఎకరాలు సేకరిస్తున్నాడని, తాము అధికారంలోకి రాగానే దీన్ని క్యాన్సిల్ చేసి, భూములు తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించాడు.

భోగాపురం విమానాశ్రయం కోసం జరుగుతున్న భూసేకరణని ఆపేయడానికి తాము కోర్టుకి వెళుతున్నామని, దీన్ని ముందుకు సాగనీయం అని చెప్పాడు.

దేశంలోని మిగతా ఎయిర్ పోర్టులు 700 నుంచి 900 ఎకరాల విస్తీర్ణంలోనే ఉన్నాయని, చంద్రబాబుకి 2,700 ఎకరాలు కావల్సి వచ్చిందని ఆరోపించాడు.

భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించటానికి ఎయిర్ పోర్టు అధారిటి ఆఫ్ ఇండియా టెండర్లలో పాల్గొన్నా, దానికి ఇవ్వకుండా, జిఎంఆర్ కంపెనీకి చంద్రబాబు ఇచ్చాడని, లంచాల కోసమే ఈ పనిచేశాడని ఆరోపించాడు.

ఈ కబుర్లన్నీ చెప్పి, అధికారంలోకి వచ్చాక, నాలుగేళ్ల పాటు ఈ ప్రాజెక్టుని ముందుకు వెళ్లనీయకుండా పేచీలు పెట్టి, జిఎంఆర్ తో బేరాలు కుదిరిన తర్వాత జగన్ ఇవాళ మళ్లీ శంకుస్థాపన చేశారు.

అప్పుడు వద్దన్న భోగాపురంలో విమానాశ్రయం ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చిందో ఇంతవరకు చెప్పలేదు.

అప్పుడు సరిపోతుందన్న విశాఖ ఎయిర్ పోర్టు గురించిన ఊసు ఇప్పుడు లేదు.

ఆనాడు భూసేకరణ వద్దని, అధికారంలోకి రాగానే రైతులకి తిరిగి ఇచ్చేస్తామని చెప్పిన మాటలు జగన్ కి గుర్తు లేవు.

2,700 ఎకరాలు అవసరం లేదని ఆనాడు వాదించి, ఇప్పుడు 2,200 ఎకరాలు జిఎంఆర్ కి ఇచ్చి, మిగతా 500 ఎకరాలు వెనక్కి తీసుకొని తమవాళ్ల కోసం రిజర్వులో పెట్టుకున్నారు.

ఎయిర్ పోర్టు అధారిటి కి టెండర్ ఇవ్వాలని ఆనాడు చెప్పి, ఇవాళ సర్దుబాట్లు చేసుకున్న తర్వాత మళ్లీ అదే జిఎంఆర్ కి ఎందుకి ఇచ్చారో ఆయన చెప్పలేదు, అడిగిన మీడియా వాళ్లూ లేరు.

“ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చడానికి మా ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తుందనటానికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఒక నిదర్శనం,” అని ఏ మాత్రం బిడియం లేకుండా ఇవాళ ఈ ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారు.