క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై సత్వర విచారణ జరగటానికి వీలుగా ఆయా హైకోర్టుల్లో స్పెషల్ బెంచీలు ఏర్పాటు చేయాలని తాజాగా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఎంపీ, ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల విచారణను ఇవి పర్యవేక్షించాలని తెలిపింది.

ఈ అంశం ఇప్పటికి పలుమార్లు సుప్రీం కోర్టులో విచారణకి రావటం, దానిమీద త్వరగా విచారణలు జరగాలని ఉన్నత న్యాయస్థానం కింది కోర్టులకి ఆదేశించడం ఇప్పటికి చాలాసార్లు చూశాం. అయినా వ్యవస్థలో ఎటువంటి మార్పురాకపోవటం కూడా గమనిస్తూనే ఉన్నాం. హైదరాబాద్ సిబిఐ కోర్టులో దాదాపు 11 ఏళ్ల నుంచి జగన్ మోహన్ రెడ్డి కేసులు తాబేలు నడక నడవటం అందరికి తెలుసు. 

జగన్ మోహన్ రెడ్డి మీద 11 సిబిఐ కేసులు, 8 ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కేసులు ప్రస్తుతం కోర్టులో ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా బిజెపికే చెందిన అశ్విని ఉపాధ్యాయ్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని బెంచి ఈ ఆదేశం ఇచ్చింది. ఆయా హైకోర్టుల్లో ఇందుకోసమే ఒక స్పెషల్ బెంచిని ఏర్పాటు చేసి, కేసుల విచారణ సక్రమంగా జరుగుతుందో లేదో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే ఇటువంటి కేసుల్లో వాయిదాలకి ఒప్పుకోవాలని కూడా ఆదేశించింది.

ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లాగానే దేశంలో ప్రజాప్రతినిధుల మీద దాదాపు 5,000 కేసులు ఉన్నాయట. వీరందరి కేసుల్లో పురోగతి గురించి ఆయా హైకోర్టు వెబ్ సైట్లలో ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ట్యాబ్ తయారు చేసి, తాజా వివరాలని పొందుపరచాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.

అయితే, ఇలాంటి ఆదేశాలు ఎన్ని వచ్చినా, క్షేత్రస్థాయిలో వీటి ప్రభావం కనిపించడం లేదనటానికి జగన్ మోహన్ రెడ్డి కేసులే పెద్ద ఉదాహరణ. గతంలో జస్టిస్ ఎన్ వి రమణ కూడా ఇటువంటి ఆదేశాలే ఇచ్చారు. ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల మీద ప్రతి వారం విచారణ జరపాలని అప్పుడు సుప్రీం కోర్టు చెప్పింది. అయినా, జగన్ కేసుల్లో ఎలాంటి పురోగతి లేదు.

గమ్మత్తేంటంటే, జగన్ కేసులు ముందుకు సాగడం లేదని, 2024 ఎన్నికల లోపు విచారణ ముగించాలని కోరుతూ జనసేనకి చెందిన హరిరామ జోగయ్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే, దాన్ని అడ్మిట్ చేసుకోవటానికి కూడా కోర్టు వారు చాలా సమయం తీసుకున్నారు. ఎట్టకేలకి అడ్మిట్ చేసుకొని, జగన్ కి నోటీసులు ఇచ్చారు.

ఇప్పుడు కొత్తగా సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రభావం ఏమాత్రం ఉంటుందో చూడాలి.