Admin

రేపటి నుంచి రాష్ట్రంలో కులగణన ప్రారంభం కాబోతోంది. బీహార్ లో ఇటీవల కులగణన పూర్తయింది. ఆ వెంటనే బిసీలకి జనాభాకి తగినట్టుగా రిజర్వేషన్లను పెంచుతున్నట్టు కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితిష్ కుమార్ ప్రకటించారు.  ఇదంతా రాబోయే ఎన్నికల కోసమే నితిష్ చేపట్టారనే అభిప్రాయం బలంగా ఉంది.

ఇప్పుడు ఏపిలో కూడా కులగణన పేరుతో బిసీలు ఓట్లని ఆకర్షించడానికి జగన్ మోహన్ రెడ్డి ఈ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం నుంచి ఆంధ్రప్రదేశ్ లో  ‘సమగ్ర కులగణన’ ని జగన్ ప్రభుత్వం చేపడుతోంది. దీనికి సంబంధించి నవంబరు మూడో తేదీనే కేబినెట్‌ సమావేశంలో మంత్రిమండలి కులగణనకు ఆమోదం తెలియజేసింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల నిరుపేదలకు సామాజిక, సాధికారతా సురక్షను కల్పించడమే లక్ష్యంగా సమగ్ర కుల గణన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతోంది. 

రాష్ట్రంలో దాదాపు 139 బీసీ కులాల జనాభా, సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఈ కులగణన ద్వారా వెల్లడవుతాయి. ఈనెల 15వ తేదీ (బుధవారం)న రాష్ట్రంలో తొలుత 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పైలెట్‌ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని చేపట్టి, నిర్వహణ, విధాన పరమైన అంశాలను క్రోడీకరించి రాష్ట్రమంతటా ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేస్తామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఆయా ప్రాంతాల కులాల స్థితిగతులు, వారు క్షేత్రస్థాయిలో అనుభవిస్తున్న సామాజిక అంశాలపై కులసంఘాల ప్రతినిధుల సూచనల్ని స్వీకరిస్తారు.

రాష్ట్రంలో వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు అన్ని వర్గాల్లోని పేదలకు విద్య, సంక్షేమం, నివాసం వంటి అంశాల్లో ప్రాధాన్యత కల్పించే దిశగా తమ ప్రభుత్వం కుల గణన ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని మంత్రి చెప్పారు. ఇప్పటికే బీహార్‌ రాష్ట్రంలో జరిగిన కుల గణన కార్యక్రమాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక అధికారుల బృందాన్ని పంపి అక్కడ పరిస్థితులపై సేకరించిన ఒక నివేదికను పరిగణనలోకి తీసుకున్నట్టు మంత్రి చెప్పారు. 

కుల గణన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 5 చోట్ల ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తారు. ఈ నెల 17వ తేదీన రాజమహేంద్రవరం, కర్నూలులో, 20వ తేదీన విశాఖపట్నం, విజయవాడలో, 24వ తేదీన తిరుపతిలో ఈ సదస్సులు జరుగుతాయి.

 ప్రస్తుతం చేపట్టిన కుల గణన సమాచారంతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతో పాటు ఉన్నత వర్గాల్లోని పేదరికం అనుభవిస్తున్న కులాలకు కూడా సంక్షేమ ఫలాలను అందించేందుకు వీలుకానుందని మంత్రి చెబుతున్నారు. 

ఈసారి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలన్న పట్టుదలతో ఏ ఒక్క అవకాశాన్ని వదలని జగన్ రెడ్డికి కులగణన పై చాలా ఆశలున్నాయి. కులగణన పేరుతో బిసిలకి, ఎస్సీ ఎస్టీలకి బీహార్లో లాగానే భారీగా రిజర్వేషన్లని భారీగా పెంచి, తన ఓటు బ్యాంకుని సుస్థిరం చేసుకోవటానికి ఆయన సన్నద్ధమవుతున్నాడు. అందుకే ఇంత తక్కువ సమయంలోనే కులగణన మీద ఒక నిర్ణయానికి వచ్చి, ప్రభుత్వపరంగా వెంటవెంటనే నిర్ణయాలు తీసుకున్నాడు. ఈ ఎన్నికలలోపే కులగణన పూర్తిచేసి, రిజర్వేషన్ల పెంపుదలను కూడా జగన్ రెడ్డి చేపట్టే అవకాశం ఉంది.