ఇటీవల తన ప్రసంగంలో అక్కినేని నాగేశ్వరరావు గురించి చేసిన ప్రస్తావన  వివాదాస్పదం కావడంపై బాలకృష్ణ సత్యసాయి జిల్లా హిందూపురంలో స్పందించారు.

వీరసింహారెడ్డి సక్సెస్ మీట్‌లో యాదృచ్ఛికంగా అన్న మాటలే తప్ప నాగేశ్వరరావు గారిని కించపరిచే విధంగా తానేం మాట్లాడలేదని ఆయన తెలిపారు. ఏఎన్నార్ గారిని బాబాయ్ అని పిలుస్తానని చెప్పారు. ఎన్టీఆర్ నుంచి క్రమశిక్షణ, ఏఎన్నార్ నుంచి పొగడ్తలకు పొంగిపోకూడదనే విషయాన్ని నేర్చుకున్నట్లు వివరించారు. అక్కినేని నాగేశ్వరరావు తన పిల్లల కంటే తననే ఎక్కువగా ప్రేమించేవారని బాలకృష్ణ అన్నారు. 

చదవండి అనవసరపు వివాదంలోకి మరోసారి బాలకృష్ణ

ఇండస్ట్రీకి  నాన్నగారు, అక్కినేని నాగేశ్వరరావు గారు రెండు కళ్లలాంటివారని బాలయ్య  చెప్పారు. కొన్ని ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తనకు సంబంధం లేదన్నారు. నాన్న ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగిందన్నారు. ‘బాబాయిపై ప్రేమ గుండెల్లో ఉంటుంది.. బయట ఏం జరిగినా నేను పట్టించుకోనని,’ అని స్పష్టం చేశారు.

కాగా, బాలకృష్ణ మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని ఎస్వీ రంగారావు మనవళ్లు కూడా ఒక ప్రకటన చేశారు. ఈ అంశాన్ని అనవసరంగా రాద్ధాంతం చేయొద్దని కోరారు.