Admin

ఎన్నికల వేళ కొత్త విషయాలు బయటకి వస్తున్నాయి. చంద్రబాబు నాయుడి మీద ఓటుకి నోటు కేసుని మళ్లీ రీఓపెన్ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోరాడట. అయితే కెసిఆర్ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదట. ఏబిఎన్ ఇంటర్య్యూలో మంత్రి కెటి రామారావు చెప్పిన మాటలివి. అంటే తాను కేసులు మీద కేసులు పెట్డడమే కాకుండా, తెలంగాణ ప్రభుత్వం చేత కూడా కేసు పెట్టించాలని జగన్ ప్రయత్నించాడన్న మాట.

తెలంగాణలో ఈ నెల 30 న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల్లో తెలుగుదేశం సానుభూతిపరులు ఓట్లని ఆకర్షించడం కోసం కెటిఆర్ ఈ విషయాన్ని వెల్లడించారనుకోవాలి. జగన్ అడిగినా కూడా తాను చేయలేదని తన మంచితనాన్ని బయటపెట్టుకోవటానికి బిఆరెస్ ఈ రహస్యాన్ని బయటపెట్టి ఉంటుందని అనుకోవచ్చు.

అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఒకవేళ నిజంగానే కేసు పెట్టాలనుకున్నా, అది సాధ్యమేనా అనేది ప్రశ్న. ఎందుకంటే ఓటుకు నోటు కేసులో అటు ఏసిబి, ఇటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కూడా చార్జిషీట్లు దాఖలు చేశాయి. చంద్రబాబు మీద ఈ కేసులో ఎటువంటి ఆధారం లేకపోవడం చేత, వీరిద్దరూ కూడా ఆయన పేరుని నిందితుల్లో చేర్చలేదు. కాని వైసిపి ప్రచారం కారణంగా ఈ కేసులో చంద్రబాబు పేరు ఉన్నదనే తప్పుడు అభిప్రాయం చాలామందిలో ఉంది. ఈ కేసులో తొలినుంచి ఆయన పేరు లేకపోవడం చేత దాదాపు ఏడేళ్ల తర్వాత కొత్తగా చంద్రబాబు పేరుని చేర్చడం సాధ్యమయ్యే పనికాదు.

చంద్రబాబు అరెస్టు తదనంతర పరిణామాల్లో తాను మరింత సున్నితంగా వ్యవహరించి ఉండవల్సిందేమో అన్న మాటను కూడా రాధాకృష్ణకి ఇచ్చిన ఇంటర్య్యూలో కెటిఆర్ వాడారు. నిజానికి కెటిఆర్ ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు అరెస్టు అనంతరం ఆయనకి మద్దతుగా హైదరాబాద్ లో  ప్రదర్శనలు జరగడాన్ని కెటిఆర్ వ్యతిరేకించారు. తెలంగాణ పోలీసు యత్రాంగాన్ని కూడా ఈ మేరకు ఆదేశించారు. అయితే ఎన్నికల దగ్గర పడే కొద్దీ జగన్ కోసం ఇంత త్యాగం చేయాల్సిన అవసరం ఉందా అనే భావన బిఆరెస్ లో వచ్చింది. అందుకే ముందు ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఆ పార్టీ పెద్ద నాయకులు కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించారు.

అయితే ఇంగ్లీషులో సామెతె లాగా ఇది too little, too late. తెలంగాణలో జగన్ సానుభూతిపరులు బిఆరెస్ కి ఓటు వేయటం ఎంత ఖాయమో, టిడిపి సానుభూతి పరులు బిఆరెసేతర పార్టీల వైపు చూడటం అంత ఖాయం. నిజానికి హైదరాబాద్ లో ఉంటున్న ఆంధ్రవారిలో మెజారిటి మొగ్గు మొదటి నుంచి బిఆరెస్ వైపే ఉన్నది. అయితే తమ అహంకారంలో, జగన్ తో ఉన్న సంబంధాల కారణంగా కెటిఆర్ వంటి వారు వీరిని దూరం చేసుకున్నారు. 

ఇప్పుడు ఎంత తగ్గి మాట్లాడినా, దాని ప్రయోజనం అంతగా ఉండకపోవచ్చు. నిజానికి ఇప్పటికే తెలంగాణలో బిఆరెస్ కే అధికారం చేజిక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకవేళ గెలిచినా, తక్కువ సీట్లు రావటానికి ఉన్న కారణాల్లో ఆంధ్ర ఓటర్లు వ్యతిరేకత కూడా ఒకటి కావచ్చు.