Admin

కిలారు రాజేష్ ఉదంతంతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ ఇంటలిజెన్స్ చీఫ్ పి ఎస్ ఆర్ ఆంజనేయులు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తున్నారో మరోసారి బట్టబయలైంది.  నారా లోకేష్ కి కిలారు రాజేష్ సన్నిహితుడు. టిడిపిలో ఆయనకి పదవి ఉంది.  సిఐడి ప్రశ్నించే సందర్భంలో ఆంజనేయులు తనను పిలిపించుకొని, బెదిరించారని రాజేష్ తాజాగా ఆరోపించారు.

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడితో సహా ప్రతిపక్ష నేతలపై పెడుతున్న కేసుల వెనక ఆంజనేయులు పాత్ర చాలా కీలకమైనదని పలువురు రిటైరైన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు చెబుతున్నారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా, అవినీతి జరిగిందని రుజువులు లేకుండా చంద్రబాబు నాయుడి మీద కేసులు పెట్టడం సాధ్యంకాదని చాలామంది పోలీసు అధికారులు చేతులెత్తేసిన నేపధ్యంలో, కేసులు బనాయించడం అంత కష్టమేమీ కాదని ఆయనే చొరవ తీసుకొని, జగన్ హృదయాన్ని దోచుకున్నాడని చెబుతున్నారు.

చట్టాలు, నిబంధనలు, సాంప్రదాయాలు, పద్ధతులు లాంటి చాదస్తం లేకుండా, ఒక మాఫియా సామ్రాజ్యాన్ని నడిపినట్టు, అనుకున్న ఏ కార్యక్రమం అయినా పూర్తికావడం ముఖ్యం అనుకునే జగన్ కి ఈయన లాంటి అధికారి దొరకడంతో ఇక వేటాడటం మొదలైంది.

స్కిల్ డెవలప్మెంట్ కేసులోనూ, ఇతర కేసుల్లోనూ సీనియర్ అధికారులని కూడా పరోక్షంగా, ప్రత్యక్షంగా బెదిరించి, చంద్రబాబుకి వ్యతిరేకంగా సాక్ష్యాలని సేకరించడంలో ఈయనే ప్రధాన పాత్ర వహించాడన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇప్పుడు తాజాగా, స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో తనను ఏపిసిఐడి పిలిచినప్పుడు, ఇంటలిజెన్స్ ఐజిని కలిపించారని, ఆయన తనను చంద్రబాబు మీద సాక్ష్యాలు ఇవ్వాలని బెదిరించారని కిలారు రాజేష్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఏపి హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. ఆ తర్వాత హైదరాబాద్ లో తన ఇంటి పైన కొంతమంది నిఘా పెట్టడం, తన కారుని వెంబడించడం లాంటి ఘటనలు కూడా జరిగాయని ఆయన కోర్టుకి తెలిపారు. 

సిఐడి దర్యాప్తు చేస్తున్న కేసుకి, ఇంటలిజెన్స్ విభాగానికి ఏమాత్రం సంబంధం లేదు. అయినా, బహుశా ఆంజనేయులు గారు చొరవ తీసుకొని మరీ రాజేష్ ని పిలిపించుకొని బెదిరించారని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు ప్రభుత్వానికి కాకుండా, పూర్తిగా జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని తాజా ఉదంతం మరోసారి స్పష్టం చేస్తోంది.