Admin

ప్రభుత్వంలో కొంతమంది ఉన్నతాధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఏపి సిఐడి వారు గతంలో స్టేట్ మెంట్లు తీసుకున్నారు. వాటి ఆధారంగా కేసుల మీద కేసులు బనాయించారు.  అవి కోర్టుల్లో ఎంతవరకూ నిలబడతాయనేది సందేహమే. ఈలోగా చంద్రబాబు నాయుడితో దగ్గర సంబంధాలు ఉన్న ఆయన సహాయకులని బెదిరించో, భయపెట్టో వ్యతిరేక సాక్ష్యాలని రాబట్టి, మాజీ ముఖ్యమంత్రిని గట్టిగా ఇరికించాలన్న పెద్దల ఆదేశంతో సిఐడి గట్టిగా ప్రయత్నిస్తోంది.

ఇందులో భాగంగా నారా లోకేష్ కి సన్నిహతుడైన కిలారు రాజేష్ మీద జగన్ ప్రభుత్వం కన్నేసింది.  స్కిల్ డెవలప్మ్ంట్ కేసులో ఆయన్ని ప్రశ్నించాలంటూ పిలిచింది. అరెస్టు చేస్తారనే అనుమానంతో హైకోర్టులో రాజేష్ ముందస్తు బెయిల్ కి దరఖాస్తు చేశారు. అయితే ఆయన్ని తాము సాక్షిగా మాత్రమే పిలుస్తున్నామని కోర్టుకి సిఐడి చెప్పింది.

41ఏ నోటీసు ఇచ్చి,  సాక్షి పేరుతో ఆయన్ని పిలిచి, ప్రశ్నించింది. కాని అందులో వాళ్లకి ఆశించిన సమాచారం ఏమీ లభించలేదు. ఏదోవిధంగా చంద్రబాబుకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వాలని ఆయన మీద ఒత్తిడి పెంచుతూ వచ్చారు. వైసిపి సోషల్ మీడియాలో కూడా ఆయన ప్రశ్నిస్తే, మొత్తం గుట్టు రట్టవుతుందని ప్రచారం చేయించారు. రాజేష్ ని ప్రశ్నించడంతో మొత్తం డొంకంతా కదలుతుందని సాక్షిలో కథనాలు అల్లారు. అయినా ప్రయోజనం కనిపించలేదు. 

ఇక చివరికి బెదిరింపులకి దిగారు. భయోత్పాతం సృష్టించే పనిలో భాగంగా తాజాగా హైదరాబాద్ లో ఆయన ఇంటి వద్ద పడిగాపులు కాయటం, ఆయన కారుని వెంబడించడం చేశారు. ఆ వెంటనే ఆయన ఆందోళనతో ఆయన స్థానిక పోలీసులకి సమాచారం అందించడం తెలిసిందే. తనని వెంబడించిన కారు, మోటార్ సైకిళ్లని రాజేష్ ఫొటోలు కూడా తీశారు. వాటిని పోలీసులకి అందజేశారు. ‘మా బాస్ చెప్పినట్టు చేయి, అప్పుడు నీకు సమస్యలు ఉండవు’, అని తనని బెదిరించనట్టు కూడా రాజేష్ ఫిర్యాదు చేశారు.

వాళ్లంతా ఆంధ్రా పోలీసులని తెలంగాణ పోలీసులు దర్యాప్తు అనంతరం చెప్పారు. ఏపిలో కౌంటర్ ఇంటలిజెన్స్ యూనిట్లో పనిచేస్తారని కూడా గుర్తించారు. హైదరాబాద్ పోలీసులు దీనిమీద కేసులు కూడా నమోదు చేశారు. దీన్నిబట్టి, తమ రాజకీయ ఉద్దేశాలు నెరవేర్చుకోవటానికి జగన్ అండ్ కో ఏ స్థాయిలో చట్టాల్ని ఉల్లంఘిస్తూ, పొరుగు రాష్ట్రానికి పంపించి కూడా ఆంధ్రా పోలీసులని వినియోగించుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి హైదరాబాద్ పోలీసులు ఈ విషయంలో పక్షపాత రహితంగానే వ్యవహరించారు. అయితే, కెసిఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే, ఇటువంటి కేసుల్లో సహాయనిరాకరణ ఉంటుందని గత అనుభవాలు చెబుతున్నాయి.

గతంలో రఘురామ కృష్ణంరాజు విషయంలో గాని, మరెంతో మందిని సోషల్ మీడియా పోస్టుల పేరుతో గాని ఆంధ్రా పోలీసులు అర్థరాత్రులు ఎత్తుకుపోయినా, హైదరాబాద్ పోలీసులు అభ్యంతరం పెట్టకపోగా వారికి సహకరించారు. కెసిఆర్ – జగన్ బంధం అందరికీ తెలుసు కాబట్టి, హైదరాబాద్ పోలీసులు ఇటువంటి విషయాల్లో ఇలాగే వ్యవహరిస్తారని అందరికీ తెలిసిపోయింది.

కాబట్టి ఇప్పుడు రాజేష్ కి దొరికింది తాత్కాలిక ఉపశమనం మాత్రమే అనుకోవాలి. రేపు ఎన్నికల ఫలితాలని బట్టి ఆంధ్రా పోలీసులు హైదరాబాద్ లో ఇలాంటి కేసుల్లో ఎలా వ్యవహరిస్తారు అనేది ఆధారపడి ఉంటుంది. మొత్తంగా చూస్తే చంద్రబాబు మీద ఏ రకమైన ఆధారాలు లేకుండా కేసులు పెట్టిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు ఏదోవిధంగా ఆధారాలు సంపాదించాలని ఏపి సిఐడి మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోందని, ఇందుకోసం బలప్రయోగం చేయటానికి కూడా వెనకాడదని వెల్లడవుతోంది.

హైకోర్టులో కిలారు తాజా పిటిషన్

స్కిల్ కేసులో కిలారు రాజేష్ ఏపి హైకోర్టులో పిటిషన్‍ వేశారు. తాను తప్పించుకొని తిరుగుతున్నట్టు ఇచ్చిన లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) నోటీసుల్లో తనను నిందితుడిగా చూపించిన విషయాన్ని కోర్టు దృష్టికి  రాజేష్ తరపు లాయర్ ఆదినారాయణరావు తీసుకొచ్చారు. ఆ తర్వాత  మళ్లీ 161, 91కింద నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. తాము పొరపాటున ఎల్‍ఓసీ ఇచ్చామని సీఐడీ తరపు న్యాయవాది కోర్టుకి చెప్పారు. హైదరాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తులు రాజేష్‍ని వెంబడించిన విషయాన్ని న్యాయవాది ఆదినారాయణరావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  తాము రాజేశ్ ను నిందితుడిగా పేర్కొనలేదని చెప్పిన సీఐడీ న్యాయవాది, కౌంటర్ దాఖలుకు సమయం కోరారు.  ఈనెల 17కు కేసు విచారణను హైకోర్టు వాయిదా వేసింది.