చంద్రబాబు కేసుల్లో వాయిదాలు, సెలవులు, ‘నా బిఫోర్ మీ’ లతో ఆయన క్వాష్, బెయిల్ పిటిషన్లు ఎన్నటికి తేలవు అని తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. అయినా కోర్టుల్లో వ్యవహారశైలి అణుమాత్రం కూడా మారలేదు. తాజాగా, చంద్రబాబు బెయిల్ పిటిషన్ ని ఏపి హైకోర్టు మళ్లీ వాయిదా వేసింది. నవంబరు 10 కి న్యాయమూర్తి టి మల్లిఖార్జునరావు వాయిదా వేశారు. 

కారణం న్యాయస్థానం కాదు, ఏపి సిఐడి న్యాయవాదులు. తమ వాదన వినిపించాల్సిన అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకరరెడ్డి రావటానికి వీలుపడలేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద కోర్టుకి విన్నవించారు. అందుకని కేసుని నవంబరు 22వ తేదీ వరకు వాయిదా వేయాలని అభ్యర్థించారు. అదృష్టవశాత్తూ న్యాయమూర్తి అందుకు ఒప్పుకోకుండా, 15 వ తేదీకి వాదనలు వినిపించాల్సిందేనని చెప్పారు.

ఏది ఏమైనా ఏదో ఒక వంకతో చంద్రబాబు నాయుడికి బెయిల్ రాకుండా చేయాలన్న జగన్ ప్రభుత్వం యత్నం ఇప్పటిదాకా సఫలమవుతూనే ఉంది. ఇందుకు మొత్తం ప్రభుత్వ యత్రాంగం కూడా సహకరిస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో న్యాయస్థానాలు కూడా జగన్ కోర్కెకి అనుగుణంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది.

నిజానికి ఈ పాటికి చంద్రబాబుకి హైకోర్టులో బెయిల్ వచ్చేసి ఉండేది. అనేక అడ్డంకులు, వాయిదాలు, పండగ సెలవులు, వెకేషన్ బెంచి న్యాయమూర్తి ‘నాట్ బిఫోర్ మి’ తర్వాత ఎట్టకేలకి విచారణ ప్రారంభమైంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. కాని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మాత్రం తమకు సమయం కావాలని కోరారు. ఫలితంగా మధ్యంతర బెయిల్ ఇచ్చి, ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ని నవంబరు 10 కి న్యాయమూర్తి వాయిదా వేశారు.

పొన్నవోలు తన వాదనలు పూర్తిచేసి ఉంటే, హైకోర్టు బహుశా సోమవారం (నవంబరు 13) నాటికి తీర్పు కూడా ఇచ్చి ఉండేవారు. దాన్ని అడ్డుకోటానికే పొన్నవోలు కోర్టుకి హాజరు కాకుండా ఎగ్గొట్టారు.