ప్రతిష్టాత్మక ముంబై ఎయిర్ పోర్టు జివికె కంపెనీ చేతుల్లోంచి అదానీ చేతుల్లోకి మారడంలో ప్రధాని నరేంద్ర మోడి పాత్ర ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించిన విషయం తెలుసు. ఈ ఆరోపణల పూర్వాపరాలు ఏంటి? ఏ రకంగా ముంబై ఎయిర్ పోర్టు చేతులు మారింది?

జివికె అధినేత అయిన జివి కృష్ణారెడ్డి చేత బలవంతంగా ముంబై ఎయిర్ పోర్టుని గౌతం అదానికి అమ్మించారా? ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడి సహకారంతో కేంద్ర దర్యాప్తు సంస్థలని రంగంలోకి దించి, కృష్ణారెడ్డిని బెదిరించారా?

మన దేశంలో ప్రముఖ విమానాశ్రాయాలని కట్టి, నడుపుతున్న ఘనత తెలుగు వ్యాపారవేత్తలది. ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్ పోర్టులని జిఎంఆర్ – అంటే గ్రంధి మల్లిఖార్జునరావు – కంపెనీ నడుపుతోంది. ముంబై, బెంగుళూరు ఎయిర్ పోర్టులని జివికె – గునుపాటి వెంకట కృష్ణారెడ్డి – గ్రూప్ మెయింటైన్ చేస్తోంది. 

ప్రపంచంలో 10 ప్రముఖ ఎయిర్ పోర్టుల్లో ఒకటిగా చెప్పుకోదగ్గ ముంబై ఎయిర్ పోర్టుని 2006 లో జివికె గ్రూప్ ఆధునీకరించి, మెయింటైన్ చేస్తోంది. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎయిర్ పోర్టుని తమ అధీనంలోకి తెచ్చుకోవాలని అదానీ గ్రూపు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

2019 నాటికి దేశంలోని 6 ఎయిర్ పోర్టులని ప్రైవేటీకరణలో భాగంలో కేంద్రం అదానీ గ్రూపుకి కట్టబెట్టింది. ఈ ఆరు – అహ్మదాబాద్, లక్నో, మంగుళూరు, జైపూర్, గౌహతి, తిరువనంతపురం ఎయిర్ పోర్టులు. 

వీటిని అదానీ గ్రూప్ కి 50 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వడంలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అంతకుముందు విమానాశ్రయాలని నడపడంలో ఎటువంటి అనుభవం లేని అదానీ గ్రూప్ కి ఆరు ఎయిర్ పోర్టులని కట్టబెట్టడం నిబంధనలకు విరుద్ధమని కేంద్ర ప్రభుత్వ శాఖలే పేర్కొన్నాయి.

ఇక ఆ తర్వాత ముంబై ఎయిర్ పోర్టుని చేజిక్కించుకొనే పనిలో అదానీ గ్రూపు పడింది. 2019 మార్చిలో ముంబై ఎయిర్ పోర్టులో మైనారిటి షేర్ హోల్డర్ గా ఉన్న దక్షిణాఫ్రికాకి చెందిన బిడ్ వెస్ట్ (Bidvest) షేర్లని కొనుగోలు చేయటానికి ప్రయత్నిస్తే, జివికె అడ్డుకుంది.

ముంబై ఎయిర్ పోర్టుని టేకోవర్ చేయటానికి అదానీ చేస్తున్న ప్రయత్నాలు సాగనివ్వకుండా ఉండేందుకు, మైనారిటీ స్టేక్స్ ని తానే కొనుగోలు చేయాలని జివికె గ్రూపు సంకల్పించింది. ఇందుకోసం, పెట్టుబడుల సేకరణకు కూడా ఉపక్రమించింది.

అయితే 2020 ఆగస్టు నాటికి ఏమైందో తెలియదు, ఈ ప్రయత్నాలని విరమించుకుంటున్నట్టు, అదానీ టేకోవర్ ప్రయత్నానికి సహకరించాలని నిర్ణయించుకున్నట్టు జివికె గ్రూపు ప్రకటించింది.

హఠాత్తుగా జివికె గ్రూపు ఎందుకు మనసు మార్చుకుంది? దీనిమీద అనేక కథనాలు అప్పట్లో బయటకు వచ్చాయి.

అదేంటంటే, అదానీని అడ్డుకోవటం మొదలుపెట్టిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు – సిబిఐ, ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ – జివికె మీద దూకుడు పెంచాయని, వాటి తాకిడికి తట్టుకోలేక, జివి కృష్ణారెడ్డి అదానీకి తలొగ్గారని వార్తా కథనాలు వచ్చాయి.

ఎయిర్ పోర్టు నిర్వహణలో అవకతవకలకు పాల్పడ్డారని, 2020 జూన్ లో గునుపాటి వెంకట కృష్ణారెడ్డి, ఆయన కుమారుడు గునుపాటి వెంకట సంజయ్ రెడ్డి ల మీద సిబిఐ కేసు బుక్ చేసింది. ఆ తర్వాత మనీ లాండరింగ్ ఆరోపణల మీద జివికె గ్రూపు కంపెనీల మీద దేశవ్యాప్తంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ దాడులు నిర్వహించింది. 

ఇదిగో ఈ విషయాలనే పార్లమెంటులో తాజాగా రాహుల్ గాంధీ ప్రస్తావించింది. 

కేంద్ర దర్యాప్తు సంస్థలని దించి, ముంబై ఎయిర్ పోర్టుని జివికె గ్రూపు నుంచి అదానీకి మద్దతుగా కేంద్రం హైజాక్ చేసింది అని రాహుల్ ఆరోపించారు. అయితే, రాహుల్ ఆరోపణల్ని జివికె గ్రూప్ ఎండి జి వి సంజయ్ రెడ్డి ఖండించారు. తాము ముంబై ఎయిర్ పోర్టుని అమ్ముకోటానికి ఎటువంటి ఒత్తిళ్లు కారణం కాదని చెప్పారు. గమ్మత్తేంటంటే, ఆయన ఈ ఇంటర్వ్యూని ఎన్డీటీవీకి ఇచ్చారు.

ఈ ఎన్డీటీవీని కూడా అదానీ ఈ మధ్యే కొనేశారు.