samaikyandhraప్రాంతీయ పిచ్చి ముదిరితే, అది తెలంగాణ అయినా సమైక్యాంధ్ర అయినా పెద్దగా తేడా ఉండదనడానికి ఇది తాజా ఉదాహరణ. చీఫ్ సెక్రెటరీగా ఒడిస్సా కి చెందిన పికె మహంతిని ప్రభుత్వం తక్షణం తొలగించాలంటూ విశాఖలో సమైక్యాంద్ర రాజకీయ ఐక్యవేదిక డిమాండ్ ఇలాంటిదే.

పోలవరం, వంశదార ప్రోజెక్టుల విషయంలో ఒడిస్సా సర్కారు అడ్డుతగులుతున్ననేపద్యంలో పొరుగురాష్ట్రానికి చెందిన మహంతిని కాంగ్రెస్ సర్కారు ప్రధానకార్యదర్శిగా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖపట్నం ప్రభుత్వ అతిధి గృహం ఎదుట ఇవాళ సమైక్యాంద్ర పొలిటికల్ జేఏసి ఆందోళన నిర్వహించింది.

మనరాష్ట్రానికి చెందిన ఎంతోమంది సీనియర్ ఐఎస్ అధికారులుండగా ఒడిస్సాకు చెందిన వ్యక్తిని ప్రధానకార్యదర్శిగా నియమిస్తే రాష్ట్ర పరిపాలనకు చెందిన రహస్యాలు బహిర్గతమవుతాయని ప్రభుత్వం తక్షణం మహంతిని తొలగించాలని జేఏసి ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ వాదనను ఒప్పుకుంటే, తెలంగాణవాదుల అనేక రకాల నియామకాల గురించి చేస్తున్న వాదనలను కూడా ఒప్పుకోవాల్సిందే. ఎవరి ఊళ్లోవాళ్లని వారు నియమించుకునేట్లయితే, ఇక ఆలిండియా సర్వీసులెందుకు?

ఇక ఒడిస్సాకు చెందిన వాడు కాబట్టి మహంతి రాష్ట్ర్ర  ప్రభుత్వ రహస్యాలను వెల్లడిస్తాడనడం ఎంత వితండమో చెప్పక్కర్లేదు. ఈ లెక్కన, ఆంధ్రా వాళ్లు ఎక్కడా సెక్రటరీలుగా, గవర్నర్లుగా ఉండకూడదు!