ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డికి భయం పట్టుకుంది. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఈ సారి అరెస్టు తప్పేట్టు లేదని. ఇన్నాళ్లూ కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు వేసుకొని, ఏదో రకంగా నెట్టుకొచ్చాడు సిబిఐకి దొరకకుండా. ఇప్పుడా పప్పులేమీ ఉడికేట్టు లేవు. అందుకే ‘మా అమ్మకి బాగాలే’దని పులివెందుల పారిపోతున్నాడని సమాచారం.
అవినాష్ రెడ్డిని ప్రశ్నించేందుకు తమ ఎదుట హైదరాబాద్ లో హాజరు కావాలని సిబిఐ ఆయనను మే 16 న పిలిచింది. ఎప్పటిలాగా తనకు అత్యవసర పనులున్నాయని, కొద్ది రోజుల తర్వాత వస్తానని అవినాష్ రెడ్డి లేఖ రాశాడు. దాని మీద, ఎట్టి పరిస్థితుల్లో మే నెల 19, అంటే ఇవాళ, తమ ముందు హాజరు కావాల్సిందేనని సిబిఐ సమాచారం ఇచ్చింది.
ఇవాళ తన అరెస్టు తప్పదని అనుకున్నాడో ఏమో గాని, అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి చల్లగా జారుకున్నాడు. తన తల్లికి బాగా లేదని , అందుకే హుటాహుటిన పులివెందుల వెళుతున్నానని చెప్పాడు. తాజా వార్తల ప్రకారం, సిబిఐ కూడా పులివెందుల బయలుదేరింది.
అవినాష్ రెడ్డి ఉదంతం అప్పటికి, ఇప్పటికీ వివాదాస్పదంగానే సాగుతోంది. అటు సిబిఐ, ఇటు కోర్టులు కూడా ఆయన కావాలనుకున్నట్టే వ్యవహరిస్తున్నాయనే విమర్శ ఉంది. సిబిఐ నోటీసు ఇవ్వడం, తనకు తీరిక లేదని అవినాష్ రెడ్డి చెప్పడం. సిబిఐ మరో డేట్ ఇస్తే, ఈ లోగా అవినాష్ కోర్టుకు వెళ్లడం, వెంటనే అరెస్టు చేయోద్దని కోర్టు ఆదేశించడం – ఈ రకంగా అవినాష్ సీరియల్ కథ కొన్నాళ్లగా సాగుతోంది.
చివరికి, సుప్రీం కోర్టు ఒక దశలో అవినాష్ ని సిబిఐ ప్రశ్నించడానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ‘దారుణం (atrocious order)’ అని వ్యాఖ్యానించింది.
ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, 87 సంవత్సరాల రామోజీరావు, మార్గదర్శి లాంటి పసలేని కేసులో ఏపి సిఐడి ప్రశ్నిస్తామనగానే ఆరోగ్యం సహకరించకపోయినా రమ్మని చెప్పాడు. వాళ్లు పొద్దున నుంచి సాయంత్రం దాకా, మంచం మీద పడుకొని ఉన్న వ్యక్తిని పనికిమాలిన ప్రశ్నలతో హింసించినా, అన్నీ ఓర్చుకొని సమాధానాలు ఇచ్చాడు. ఆయన వయసు, ఆరోగ్య పరిస్థితి రీత్యా, ఏ కోర్టయినా వాయిదా కోరుకుంటే ఇస్తుంది. కాని అలా చేస్తే భయపడి విచారణకి సిద్ధపడలేదని అనుకుంటారని రామోజీరావు భావించి, సిఐడికి సహకరించారు.
అదే ఇప్పుడు 38 ఏళ్ల అవినాష్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉంది? సిబిఐ విచారణని ఎలా తప్పించుకుందామా అనే ప్రయత్నమే ఎప్పడూ. నేరస్తులకి, నిజాయితీపరులకి ఉండే తేడా ఇదే. వివేకా కూతురు డాక్టర్ సునీత వెంటపడటం వల్ల గాని, లేకపోతే ఈ పాటికి వ్యవస్థలన్నిటిని మేనేజ్ చేసి, జగన్ సహకారంతో అవినాష్ రెడ్డి తప్పించుకునేవాడే.
ఇక ఇప్పుడు సిబిఐ ఎలా వ్యవహరిస్తుందో చూడాలి.