వివేకా హత్య కేసుని ఫాలో అవుతున్న వారికి భారత దేశంలో మీడియా ఎంత రాజీ పడిపోయిందో అర్థమవుతుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు బాధ్యులెవరో, వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టకుండా ఎవరు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి కాపాడుతున్నారో ఆంధ్రప్రదేశ్ లో తెలియనివారు లేరు.

అయినా జాతీయ స్థాయి మీడియా ఈ విషయంలో పూర్తిగా కళ్లుమూసుకున్నట్టు వ్యవహరిస్తోంది. తెలుగు మీడియా యాజమాన్యాలు ఎలాగూ పార్టీలవారీగా విడిపోయాయి కాబట్టి, వివేకా హత్య కేసు లోతుపాతుల గురించి కొన్ని పేపర్లు, టీవీ చానెళ్లు మాత్రమే మాట్లాడతాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రచురితమయ్యే ఇంగ్లీషు పత్రికలు గాని, దేశంలోని ఇంగ్లీషు చానెళ్లు గాని వివేకా హత్య కేసులో పెద్దతలకాయల హస్తం ఉన్న విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ అంశంలో జాతీయ స్థాయిలో మీడియాని కూడా జగన్ ప్రభుత్వం మేనేజ్ చేయగలగడం విశేషమనే చెప్పుకోవాలి.

ఈ నేపధ్యంలో వివేకా హత్య కేసు నడుస్తున్న తీరుతెన్నులను, దోషులను రక్షిస్తున్న విధానాన్ని, చివరకి తమ రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయాన్ని, చట్టాన్ని పరిహాసం చేయటానికి ప్రధాని నరేంద్ర మోడి సైతం సిద్ధపడటాన్ని జమీన్ రైతు తన ఎడిటోరియల్ కడిగిపారేసింది.

ఎంతో చరిత్ర కలిగి, నెల్లూరు నుంచి ప్రచురితమయ్యే ఈ రాజకీయ పత్రిక పట్టపగలే అందరి కళ్లముందే జరుగుతున్న దారుణాన్ని ధైర్యంగా ప్రశ్నించింది. 

Click to expand

“గదిలోకి వెళ్లి గొడ్డలితో కసిదీరా నరికి, గడప వద్దకు వచ్చి, అయ్యో, మా బాబాయి గుండెపోటుతో చనిపోయాడని కళ్ల నీళ్లు తుడుచుకునే సంస్కృతి మన రాష్ట్రంలో ప్రబలి పోవడం, ప్రధాని మోడి వంటి జాతీయ నేతలు తమ రాజకీయ అవసరాల కోసం ఆ ఘోరాలకు రక్షణ కవచంగా నిలవడం చూస్తుంటే బాధ కలుగుతున్నది,” అని రాసింది.

ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని కూడా బాబాయి హత్య నేరం కాదా అని శీర్షికతో రాసిన ఈ సంపాదకీయంలో జమీన్ రైతు ఎండగట్టింది.

ఈ ఆటవిక రాజకీయ పోకడలను, వాటిని అవలంబిస్తున్న అధికార పార్టీ నేతలు, వారి ఆదేశాలను గుడ్డిగా అమలు చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు తమ వికృత చర్యల ద్వారా సమాజ భవిష్యత్తుకు చేటు కలిగిస్తున్నారని వ్యాఖ్యానించింది.  మీడియా తన కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవాలను బయటపెట్టలేని దయనీయ పరిస్థితుల్లో ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన జమీన్ రైతు పత్రికను అభినందించాలి.