ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయటానికి రెడీ అవుతున్నాయి. అయితే, బిజెపి-జనసేన పొత్తు సంగతేంటి? తెలుగుదేశంతో కలిసిపోటీ చేయటానికి బిజెపి సిద్ధపడుతుందా? ఈ ప్రశ్నలకి సమాధానం కోసం పరిశీలకులు కూడా వెతుకుతున్నారు.
తాజా సమాచారం ఏంటంటే, తెలంగాణలో టిడిపితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నందున, ఆంధ్రలో కూడా ఈ పొత్తుని మళ్లీ బిజెపి పునరుద్ధరించే అవకాశం ఉన్నదని.
బిజెపి మీద తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ యుద్ధం ప్రకటించాడు. నరేంద్రమోడిని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నాడు. జాతీయ స్థాయిలో బిజెపిని ఎదుర్కోటానికి భారత రాష్ట్ర సమితిని పెట్టాడు. ఇవన్నీ బిజెపి అగ్రనాయకత్వాన్ని ఆగ్రహోదగ్రులని చేస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ఈసారి తెలంగాణలో కెసిఆర్ ని ఎలాగైనా ఓడించాలని అమిత్ షా కృతనిశ్చయంతో ఉన్నారు. ముక్కోణపు పోటీలో మళ్లీ కెసిఆర్ గెలిచే అవకాశం ఉందని, అందుకని టిడిపికి తెలంగాణలో ఉన్న మద్దతుని బిజెపికి కూడగట్టగలిగితే విజయం సాధించవచ్చని బండి సంజయ్ వర్గం భావిస్తున్నదట. బిజెపి నాయకుడు, తెలంగాణ ఇన్ చార్జిగా ఉన్న బి ఎల్ సంతోష్ జీ కూడా ఇదే అభిప్రాయానికి వచ్చారట.
తెలంగాణలో టిడిపికి ఇంకా మిగిలి ఉన్న ఓట్లని బిజెపికి బదలాయించాలని, ఇందుకోసం ఆ పార్టీతో పొత్తు బిజెపికి రానున్న ఎన్నికల్లో ఎంతో ఉపయోగపడుతుందని అమిత్ షాకి సంతోష్ జీ చెప్పారట.
అయితే తెలుగుదేశంలో పొత్తుకి నరేంద్ర మోడి ఇంకా సుముఖంగా లేరు. ఎందుకంటే, జగన్ మోహన్ రెడ్డి ఎంతో వినయవిధేయతలతో బిజెపి నాయకత్వంతో మసలుకుంటున్నప్పుడు, ఆంధ్రలో వేరేవాళ్లతో పొత్తు అవసరం ఏమిటని ఆయన భావన. తాజాగా కెసిఆర్ భారాస పెట్టిన తర్వాత ఆయనతో దూరదూరంగా ఉండటానికే జగన్ ప్రయత్నిస్తున్నాడు. తాను దూరంగా ఉన్నానన్న సందేశాన్ని కూడా ఢిల్లీకి అందజేస్తున్నాడు.
అయితే తెలంగాణను ఈ సారి ఎట్టిపరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో అమిత్ షా ఉన్నారు. అందుకే తెలంగాణలో టిడిపి పొత్తుకి మోడిని ఒప్పించారని చెబుతున్నారు. అయితే ఆంధ్రలో పొత్తు ఉంటేనే, తెలంగాణలో కూడా పొత్తు అని చంద్రబాబు నాయుడు పట్టుబడతారనేది నిస్సందేహం. ఈ నేపధ్యంలోనే ఆంధ్రలో కూడా టిడిపితో పొత్తుకి బిజెపి రెడీ అవుతోందని అంటున్నారు.
జనసేన ఎలాగూ టిడిపితోనే ఈ సారి వెళ్లే అవకాశాలు ఎక్కువ కాబట్టి, బిజెపికి ఆ రకంగా కూడా కొత్త పొత్తులు తప్పవు.
తెలంగాణలో తమకున్న బలం ఎక్కడికీ పోలేదని నిరూపించుకోటానికి తెలుగుదేశం పార్టీ ఖమ్మం బహిరంగసభ ద్వారా చేసిన ప్రయత్నం కూడా చాలావరకు ఫలించింది. కెసిఆర్ పార్టీ నాయకులు ఈ సభ మీద స్పందించిన తీరే ఇందుకు నిదర్శనం. కాసాని జ్జానేశ్వర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణ టిడిపిలో కొంత కదలిక మొదలైంది. త్వరలో నిజామాబాద్ లో, తర్వాత హైదరాబాద్ లో కూడా సమావేశాలు నిర్వహిస్తామని కాసాని ప్రకటించారు. ఇదంతా కూడా ఆంధ్రలో బిజెపి పొత్తు కోసమేనని ఇప్పటికే భారాస నాయకులు విమర్శించిన విషయం కూడా తెలిసిందే.