modi, babuబిజెపితో తెలుగు దేశం పొత్తుకు మార్గం దాదాపుగా సుగమమైంది. రాష్ట్ర్ర బిజెపి వైఖరి ఏదైనా, చంద్రబాబు, నరేంద్ర మోడిల మధ్య పెరుగుతున్న స్నేహం రెండు పార్టీల మధ్య అవగాహన దిశగా వెళుతోంది. ఇవాళ ఢిల్లీలో సిటిజన్స్ ఫర్ ఎకౌంట్ బుల్ గవర్ నెన్స్ ఆధ్వర్యంలో ముఖ్య అతిధులుగా మోడి, చంద్రబాబు హాజరు కావడం కాకతాళీమేమీ కాదు. చంద్రబాబు ప్రారంభ ఉపన్యాసాన్ని మోడి సావధానంగా విన్నారు.

తాను ఏపి సిఎంగా ఉన్నప్పుడు దేశమంతా ఆ రాష్ట్ర్రం గురించే మాట్లాడుకుందని, ఇప్పుడు మోడి సిఎం గా ఉన్న గుజరాత్ గురించే మాట్లాడుతోందని చంద్రబాబు తన ప్రసంగంలో అన్నారు. గాంధీ, మోడిలిద్దరూ గుజరాత్ లోనే పుట్టారని కూడా అన్నారు. ఎన్డీయే హయాంలో దేశం బాగా అభివృద్ది చెందిందని, అప్పుడే  తమ టిడిపి ప్రభుత్వం కూడా హైదరాబాద్ ను, ఏపిని వేగంగా అభివృద్ది వైపు నడిపించిందని చెప్పుకొచ్చారు.

సైబరబాద్ ను నిర్మించింది తానేనని, తమ ప్రభుత్వం చేపట్టిన విమానాశ్రయం, అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్, అవుటర్ రింగ్ రోడ్డు ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకున్నాయని వివరించారు. బాబు మాట్లాడుతున్నంత సేపూ  సభికులు కరతాళ ధ్వనులతో స్పందించారు.

అధికారికంగా బిజెపి, టిడిపి ల మధ్య బంధం గురించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన లేకపోయినా, పొత్తు కుదిరిపోయినట్టేనని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. ఇప్పుడు దేశంలో మోడి హవా పెద్ద ఎత్తున నడుస్తోందని, ఆయనతో కలిసి పోటీలోకి దిగడం టిడిపి కి లాభిస్తుందని దేశం నాయకులు కూడా నమ్ముతున్నారు.

నరేంద్ర మోడి నాయకత్వంలో బిజెపి తొలి పొత్తుల మిత్రుడిగా చంద్రబాబు అవతరించనున్నారని ఇప్పటికే ఢిల్లీలో హాట్  న్యూస్. చంద్రబాబుని ఎన్జీయే కన్వీనర్ గా నియమించాలని కూడా యోచిస్తున్నారని తెలుస్తోంది.