సినిమా రంగంలో గతి లేని పరిస్థితుల్లో రామ్ గోపాల్ వర్మ రాజకీయాల్ని నమ్ముకున్నాడు. రాజకీయాల్లో తన తెలివితేటల్ని ఉపయోగిస్తే ఇంకా బాగా గిట్టుబాటు అవుతుందని గ్రహించాడు. నెమ్మదిగా రాజకీయ విశ్లేషకుడిగా, వ్యాఖ్యాతగా అవతారం ఎత్తాడు.

తెలుగుదేశం, జనసేన సాఫ్ట్ టార్గెట్లు. వాళ్ల మీద ఏ కూతలు కూసినా నడిచిపోతుంది. అదే వైసిపి మీద గాని, జగన్ మోహన్ రెడ్డి మీద గాని ఇష్టారాజ్యంగా మాట్లాడితే గూబ గుయ్యమంటుందని వర్మకి బాగా తెలుసు.

దీనికి తోడు అధికారంలో ఉన్న వైసిపికి అనుకూలంగా మాట్లాడితే లాభాలు ఉంటాయని బాగా అర్థం చేసుకున్నాడు.

ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో చంద్రబాబు-పవన్ కళ్యాణ్ ల సమావేశం మీద అడ్డగోలు వ్యాఖ్యలు చేశాడు. ఈయన వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి ట్వీట్లను గుర్తుకుతెచ్చాయి.

ఇప్పుడు తాజాగా తెలుగుదేశం నాయకులు అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుళ్ల మీదకు పోలీసులను ఎగదోసే పనిపెట్టుకున్నాడు.

వీళ్లిద్దరూ ఈమధ్య పోలీసుల వ్యవహారశైలి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నాయకుల నోళ్ల నొక్కడానికి పోలీసుల్ని అధికార పార్టీ విచ్చలవిడిగా వినియోగిస్తోన్న మాట నిజం. అయితే, ఈ కారణంగా ప్రతిపక్ష నాయకులు కూడా కట్టుదప్పి, పోలీసుల మీద ఏదిబడితే అది మాట్లాడటం మంచిది కాదు.

అయితే, ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ లాంటి విలువలు లేని మనిషి కూడా ప్రవచనాలు వల్లించడమే విచిత్రం.

‘మీరెందుకు ఊరుకుంటున్నారు, వాళ్లని బొక్కలో తొయ్యాలి’ అన్నట్టు పోలీసుల్ని టిడిపి నాయకుల మీదకు వర్మ రెచ్చగొడుతున్నాడు. నిజానికి ఇతనికి ప్రజాస్వామ్యం మీద, హక్కుల మీద నమ్మకం ఉండి ఈ రెచ్చగొట్టుడు కార్యక్రమం చేయటం లేదు. ఇది జగన్ నో, విజయసాయిరెడ్డినో సంతోషపెట్టడానికి చేస్తున్న పని అని ఎవరికైనా తెలిసిపోతుంది.

ఎందుకంటే, నిజంగా ఇతనికి రాజకీయాల్లో సంస్కారం గురించి ఏమాత్రం బాధ ఉన్నా వైసిపి నాయకులు, మరీ ముఖ్యంగా విజయసాయి రెడ్డి లాంటి వాళ్లు వాడే భాషని ఖండించేవాడు. ఆ పని ఎన్నడూ చేయలేదు. ఎంపి రఘురామరాజుని అత్యంత దారుణంగా అరెస్టు చేసి, కొట్టినప్పుడు, అతని మీద పిచ్చిపిచ్చిగా కేసులు బనాయించినప్పుడూ వర్మ నోరు పెగల్లేదు. అచ్చెన్న, అయ్యన్నల మీద అడ్డగోలు కేసులు పెట్టి, గూండాల మాదిరిగా పోలీసులు ఎత్తుకెళ్లినప్పుడు వర్మ ఒక్క మాట మాట్లాడలేదు.

కాబట్టి, ఇప్పుడేదో టిడిపి నాయకులు పోలీసు డిపార్టుమెంటుని అవమానించారని, దీనివల్ల సమాజంలో ఎవరూ పోలీసుల్ని గౌరవించరని వర్మ ఒకటే వాపోవటం చూస్తే, ఏం ఆశించి ఈ పని చేస్తున్నాడని అనుమానించక తప్పదు. 

పోలీసుల గౌరవం గురించి మాట్లాడుతున్న వర్మ ఏనాడూ ప్రజల గౌరవం గురించి మాట్లాడిన పాపాన పోలేదు. వాస్తవానికి ప్రజల మీదే కాదు,  అతనికి పోలీసుల మీద కూడా ప్రేమ లేదు. ఈ డ్రామా అంతా ఎవరిని ప్రసన్నం చేసుకోటానికి చేస్తున్నాడో అర్థం కాని అమాయకులు కాదు జనం.