లోకేశ్ పాదయాత్రలో నడుస్తూ నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను పార్టీ శ్రేణులు స్థానిక ఆస్పత్రికి తరలించాయి. కుప్పం పిఇఎస్ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. తారకరత్న గుండెపోటుతో కుప్పకూలారని డాక్టర్లు చెప్పారు. ఆయన ఆరోగ్యం మెరుగైందని తెలిపారు. అయితే మెరుగైన చికిత్స కోసం బెంగుళూరు తరలిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్పాయి.  కుప్పం ఆస్పత్రిలో తారకరత్నను బాలకృష్ణ పరామర్శించారు. 

తారకరత్న గుండెలో బ్లాక్స్ ఉన్నట్లు గుర్తించారని టిడిపి నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. వెంటనే ఆయన స్థానిక ఆసుపత్రికి తరలించామని, డాక్టర్లు ఎంతగానో శ్రమించి తారకరత్న కు ప్రాథమిక వైద్య అందించారని చెప్పారు. తారకరత్న కు డాక్టర్లు యాంజియోగ్రామ్ చేశారు. వైద్యులు ఎంతగానో కృషి చేసి తారకరత్న ఆరోగ్య పరిస్థితిని నిలకడకు తీసుకొచ్చారని వివరించారు. 

గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్‌ అయ్యిందని, మిగతా అన్నీ రిపోర్టులు బాగున్నాయని, చంద్రబాబు ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని బాలకృష్ణ చెప్పారు.

కాగా, కర్ణాటక సీఎం బసవరాజుతో చంద్రబాబు నాయుడు మాట్లాడి, తారకరత్నను కుప్పం నుంచి బెంగళూరు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. బెంగళూరులో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రిని చంద్రబాబు కోరారు.  బెంగళూరు, కుప్పం వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు.