నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకి వివిధ రాజకీయ పార్టీల వాళ్లు, అట్లాగే చాలామంది సినిమా నటులు హాజరయ్యారు.
హాజరు కాని వారిలో ప్రముఖుడు జూనియర్ ఎన్టీఆర్.
ఇంటికి వెళ్లి మరీ అతనికి సావనీర్ కమిటి వాళ్లు ఈ సభలో పాల్గొనాలని ఆహ్వానాన్ని అందించారు. అయినా జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదు.
హైదరాబాద్లో కేపీహెచ్బీ కాలనీ-మూసాపేట ప్రాంతాల మధ్య ఉన్న కైత్లాపూర్ మైదానంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగాయి. పదెకరాల స్థలంలో 200 అడుగుల స్టేజి నిర్మించి, భారీ ఎత్తున ఈ సభని నిర్వహించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ రంగ ప్రముఖులు, రాజకీయ నేతలు ఈ సభకి హాజరయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు హాజరు కాలేదు? ముందస్తు కార్యక్రమాల వల్ల గైర్హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. అదే రోజున తన బర్త డే ఉందని, ఫ్యామిలీతో గడపాలని, అందుకే హజరు కాలేనని కారణం చెప్పాడు.
ఈ కారణంలో వాస్తవం ఎంత అనేది మనకి తెలీదు. ఎందుకంటే, వంద సంవత్సరాలకి వచ్చే శత జయంతిలో పాల్గొనటానికి తన బర్త్ డే అడ్డొచ్చిందని చెప్పడం అంత కన్విన్సింగ్ గా లేదు. ఈ సభ నిర్వహణ వెనక తెలుగు దేశం పార్టీ ఉంది కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ హాజరు కాలేదా అనే అనుమానం వస్తుంది.
అతను ఈ మధ్య కాలంలో తెలుగుదేశానికి, చంద్రబాబు నాయకత్వానికి దూరంగా మెసలుతున్నాడు. అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాడు. అప్పుడు 2009 ఎన్నికల ప్రచారంలో తెలుగు దేశం తరఫున యాక్టివ్ గా పాల్గొన్నాడు. ఖాకీ డ్రెస్ వేసుకుని చైతన్యరథం ఎక్కి ఆయన చేసిన క్యాంపెయిన్’తాత ఎన్టీఆర్’ స్టయిల్లో జరిగింది. వందల సభల్లో మాట్లాడాడు. రాజకీయ ప్రసంగాలు కూడా బాగా చేశాడని చాలామంది అనుకున్నారు.
ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా మళ్లీ ఆ పార్టీకి దూరమయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ కూడా అప్పట్లో దూరమై, మళ్లీ 2014 ఎన్నికల నాటికి పార్టీ సమావేశాల్లో పాల్గొనడం ప్రారంభించాడు.
జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటికీ దూరంగానే ఉన్నాడు. కాదు, తెలుగుదేశమే ఆయన్ని దూరం పెట్టిందని కూడా అంటారు. కుటుంబ పార్టీగా తెలుగుదేశంలో ఎప్పటికీ తనకు సరైన స్థానం ఉండదనే ఉద్దేశంతోనే జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నాడని కొంత మంది చెబుతారు.
ఇప్పుడు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి కూడా హాజరు కాకపోవడంతోటి ఇక తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోవడం అతనికి ఇష్టం లేదని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే, ఈ సభల్ని తెలుగుదేశం పార్టీ తరఫున నిర్వహించినా, పార్టీలకి అతీతంగా బిజెపి నాయకుడు బండారు దత్తాత్రేయ, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి, సిపిఐ నాయకుడు రాజా, సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరి వంటి వాళ్లు హజరయ్యారు. అలాగే సినీ రంగం నుంచి వెంకటేష్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ వంటివాళ్లు హజరయ్యారు.
ఆ నేపధ్యంలో, ముందే పనులున్నాయన్న వంకతో జూనియర్ ఎన్టీఆర్ ఎగ్గొట్టడం అంటే ఉద్దేశపూర్వకమే అనుకోవాలి.
తనకి రాజకీయాల పట్ల ఆసక్తి లేదని జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ చెప్పలేదు. రాజకీయాల్లోకి ఎన్నడూ రానని కూడా అనలేదు. అంటే ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ కాకుండా, భవిష్యత్తులో రాజకీయ ప్రవేశం చేయాలన్న ఆలోచన ఉందనేది స్పష్టం. అందుకే అతను ఈ దూరాన్ని మెయింటైన్ చేస్తున్నాడు అనేది పరిశీలకులకి అర్థమయ్యే విషయం. ఈ విషయంలో అతనికి వేరే పార్టీల్లో ఉన్న కొంతమంది నాయకుల మద్దతు కూడా ఉందనేది ఒక రూమరు.
2024 ఎన్నికల్లో తెలుగుదేశం భవిష్యత్తు ఎలా ఉంటుందనే దాన్ని బట్టి, జూనియర్ ఎన్టీఆర్ పావులు కదుపుతాడు అనే భావన ఉంది. ఎందుకంటే, ఇప్పటి వరకు అతని వ్యవహార శైలి చూస్తే, జూనియర్ ఎన్టీఆర్ చాలా కాలిక్యులేటెడ్ అని అర్థం అవుతుంది.
రాజకీయాలు ఎలా ఉన్నా, తాత తాత అని ఎన్టీఆర్ ని ఓన్ చేసుకోవటానికి ప్రయత్నించే జూనియర్ ఎన్టీఆర్, ఏ కారణాలతోనైనా ఆయన శతజయంతి ఉత్సవాలకి హాజరు కాకపోవడం దురదృష్టం అని చెప్పాలి.