విశాఖపట్నానికి ప్రభుత్వం త్వరలో తరలిపోతోందంటూ ఇప్పటి దాకా మంత్రులే అవకాశమొచ్చినప్పుడల్లా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శంఖంలో తీర్థం పోశారు.

విశాఖపట్నం తొందర్లోనే రాజధాని కాబోతోంది అని అధికారికంగా ప్రకటించాడు.  దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్రకటన చేయడం విశేషం.

విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరగబోతోంది. దీనికి కర్టన్ రైజర్ గా ఢిల్లీలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది.  ఈ సందర్భంగా వివిధ దేశాలకు చెందిన దౌత్యవేత్తలు, పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు.

“మరికొద్ది రోజుల్లో రాజధాని కాబోతున్న విశాఖపట్నానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేను కూడా మరికొద్ది రోజుల్లో విశాఖపట్నానికి తరలిపోతున్నాను. అక్కడ కలుసుకుందాం,” అని ముఖ్యమంత్రి అన్నారు. విశాఖ కార్యనిర్వాహక (ఎగ్జిక్యూటివ్) రాజధాని అనే మాట కూడా జగన్ వాడలేదు. రాజధాని అని స్పష్టంగా చెప్పారు. వికేంద్రీకరణ అనేది ప్రజల్ని తప్పుదోవ పట్టించటానికే అనే విషయం మరోసారి విదితమైంది.

 

ఈ సమయంలో జగన్ ఈ ప్రకటన చేయవచ్చా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. వైసిపి ప్రభుత్వం గతంలో చేసిన మూడు రాజధానుల చట్టాన్ని తానే రద్దు చేసుకొంది.  రాష్ట్రానికి అమరావతే రాజధానిగా కొనసాగాలని, రాజధానిని మార్చే అధికారం రాష్ట్ర శాసనసభకు లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచి పోయినేడాది మార్చిలో తీర్పు చెప్పింది.  ఆ తీర్పు మీద దాదాపు ఆరునెలల తర్వాత జగన్ ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. ఆ కేసు ప్రస్తుతం సుప్రీం కోర్టు డివిజన్ బెంచి ఎదుట ఉంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సుప్రీం కోర్టు ఇవాళ ఒకవైపు ఈ కేసులో వాదనలు వింటూ ఉండగానే, మరో వైపు అదే ఢిల్లీలో ‘మా రాజధానిని విశాఖపట్నానికి మార్చేస్తున్నాం’ అని ఏ మాత్రం జంకు గొంకు లేకుండా జగన్ ప్రకటించారు.

సుప్రీం కోర్టులో రాజధాని కేసు విచారణలో ఉంది కాబట్టి, దీన్ని లీగల్ పరిభాషలో సబ్ జుడిస్ అంటారు. అంటే విచారణలో ఉన్న అంశం అని అర్థం. న్యాయస్థానం ముందు విచారణ జరుగుతున్న అంశాల మీద ఆయా పార్టీలు బయట మాట్లాడకూడదు అనేది నిబంధన. అయితే జగన్ ఈ అంశం మీద మాట్లాడటమే కాకుండా, సుప్రీం కోర్టు నిర్ణయం రాకుండానే, ఆ నిర్ణయంతో సంబంధం లేకుండానే తానే ఫైనల్ అన్నట్లు ప్రకటించారు.

అంటే, సుప్రీం కోర్టు ముందు విచారణ జరుగుతున్న అంశం మీద మాట్లాడటమే కాదు, కోర్టు నిర్ణయానికి ముందే తన నిర్ణయాన్ని జగన్ ప్రకటించారు. కోర్టు ఏం చెప్పబోతోందో ఆయనకి ముందే తెలుసా? లేక, కోర్టులతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకునే అధికారం ఉందనుకున్నారా? దీన్ని సుప్రీం కోర్టు ఎలా స్వీకరిస్తుంది? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి.

చాలాకాలం నుంచి రాష్ట్ర మంత్రులు విశాఖకు రేపో ఎల్లుండో వెళ్లిపోతున్నామని ప్రకటన చేస్తూనే ఉన్నారు. అయితే రాష్ట్ర హైకోర్టు ఈ అంశాన్ని – మనకి తెలియని కారణాల వల్ల – సీరియస్ గా తీసుకోలేదు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. మంత్రులే కాదు, ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే అధికారిక సమావేశంలో ఈ విషయం ప్రకటించారంటే సుప్రీం కోర్టును కూడా ఆయన పట్టించుకోలేదని అర్థం.

ఈ ధైర్యం ఆయనకు ఎక్కడ నుంచి వచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు హామీ ఇచ్చిందా? లేక సుప్రీం కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాబోతోందని రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలకు తెలుసా? 

మరోవైపు, జగన్ ఉద్దేశపూర్వకంగానే ఈ ప్రకటన చేశారని, అవినాష్ రెడ్డి వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి అధికార పార్టీ కావాలనే ఈ పని చేసిందని రాజకీయ వ్యాఖ్యానాలు అప్పుడే వినబడుతున్నాయి. ఈ అంశం మీద రాష్ట్రంలో చీలికలు తీసుకురాగలిగితే, ఎన్నికల్లో తమ పార్టీకి లబ్ధి చేకూరుతుందనే వ్యూహం కూడా అధికార పార్టీకి ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.