మార్గదర్శి మీద జగన్ ప్రభుత్వం నిరంతర దాడులు చేస్తోంది. రోజుకో కొత్త కేసు పెడుతూ, వేధించడంలో కొంత పుంతలు తొక్కుతూ ముందుకు వెళుతోంది. కోర్టులు ఎప్పటికప్పుడు ప్రభుత్వ చర్యలని వేలెత్తి చూపుతున్నాయి. అయినా, జగన్ కసితో అడ్డగోలు చర్యలకి పాల్పడుతూనే ఉన్నాడు.
ఈ మధ్య మార్గదర్శి చందాదారులకి బహిరంగ నోటీసు పేరుతో అన్ని పేపర్లలో ప్రభుత్వ డబ్బుతో జగన్ ప్రభుత్వం యాడ్లు ఇచ్చింది. దాని మీద తాజాగా ఏపి హైకోర్టు స్టే ఇచ్చింది. చందాదారుల నుంచి అభ్యంతరాలు కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన నోటీసును హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చిట్స్ రిజిస్ట్రార్ నోటీసు ఆధారంగా తీసుకోబోయే తదుపరి చర్యలను హైకోర్టు నిలిపివేసింది. చందాదారులు ఇప్పటికే వేసిన పిటిషన్లపై మధ్యతర ఉత్తర్వులు ఇచ్చామని హైకోర్టు పేర్కొంది. చందాదారుల పిటిషన్లు, మార్గదర్శి పిటిషన్లు కలిపి విచారించాల్సిన అవసరం ఉందని హైకోర్టు భావించింది.
ఈలోగా జగన్ ప్రభుత్వం మరో చర్య చేపట్టింది. మార్గదర్శి చైర్మన్ రామోజీరావు, ఎండి శైలజా కిరణ్ లకు సీఐడీ నోటీసులు ఇచ్చింది. ఆగస్టు 16, 17 తేదీల్లో విజయవాడలో విచారణకి హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఈసారి హాజరుకాకపోతే న్యాయపరంగా కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని పేపర్లకి లీకులు కూడా ఇచ్చారు.
గతంలో ఒకసారి ఇటువంటి నోటీసుని సిఐడి ఇచ్చింది. జులై 5న ఏపీలో విచారణకుహాజరు కావాలని నోటీసు ఇచ్చింది. అయితే రామోజీరావు హాజరు కాలేదు. బహుశా ఈ సారి కూడా సిఐడికి లేఖ రాయవచ్చు. లేదా, వేధింపు కోసమే నోటీసులు ఇస్తున్నారని కోర్టుకు వెళ్లవచ్చు.
మొత్తానికి, ప్రభుత్వ యత్రాంగాన్ని, చట్టాల్ని దుర్వినియోగం చేసి, తన ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్లని, రాజకీయ ప్రత్యర్థుల్ని వేధించడంలో జగన్ కొత్త రికార్డులు సృష్టించాడు.