Admin

ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్నిఅధికార వైసిపి ప్రభుత్వం సేకరిస్తోందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ (సీఎఫ్‌డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆరోపించారు. బూత్‌ స్థాయిలో కీలకంగా వ్యవహరించే విపక్ష నేతలను కేసులతో బెదిరించే యత్నాలు జరుగుతున్నాయని  అన్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఓటర్ల సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల పాత్ర ఉండకూడదని, దీనివల్ల ఎన్నికల నిర్వహణలో పక్షపాతం చోటుచేసుకునే అవకాశం ఉందని సీఎఫ్‌డీ తరఫున నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే.

“ఐప్యాక్‌, రామ్‌ ఇన్ఫో వంటి సంస్థలు ఓటర్ల సమాచారం సేకరిస్తున్నాయి. రామ్‌ ఇన్ఫో సంస్థ గతంలో వాణిజ్య పన్నుల విభాగంలో సేవలు అందించింది. ఆ తర్వాత సంస్థ యాజమాన్యం చేతులు మారింది. అప్పటి నుంచి దాని పనితీరుపై ఆరోపణలు వస్తున్నాయి. సామాజికంగా ప్రభావితం చేయగలవారిని ఐప్యాక్‌, రామ్‌ ఇన్ఫో వంటి సంస్థలు గుర్తిస్తున్నాయి. ప్రభావితం చేసేవాళ్లను సామ, దాన, భేద, దండోపాయాలతో లొంగదీసుకుంటున్నారు. ఇటీవల ఎఫ్‌ఐఆర్‌లు అత్యధికంగా నమోదవుతున్నాయి. ఎఫ్ఐఆర్ లను బెదిరింపు అస్త్రంగా వాడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్‌ఐఆర్‌ల నమోదుపై ఓ కమిటీ వేయాలని సీఎఫ్‌డీ భావిస్తోంది. విశ్రాంత పోలీసు అధికారులతో ఎఫ్‌ఐఆర్‌ల నమోదుపై పరిశీలన చేయించే ఆలోచన ఉంది. కమిటీ విచారణలో తేలిన వాస్తవాలను హెచ్చార్సీ ముందు ఉంచుతాం,” అని రమేష్ కుమార్ వెల్లడించారు. 

ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ పేరుతో రామ్ ఇన్ఫో సంస్థని వాలంటీర్ల బాధ్యతలతో అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. రామ్ ఇన్ఫో ఉద్యోగులు, వైసిపికి పనిచేసే ఐప్యాక్ ఉద్యోగులు ఒకరేననే ఆరోపణలు కూడా ఉన్నాయి.

“అక్రమంగా కేసులు బనాయించే హక్కు పోలీసులకు లేదు. అలా చేస్తే ప్రజల హక్కులను హరించడమే అవుతుంది. రాష్ట్ర పోలీసులు విచక్షణతో వ్యవహరిస్తారని నమ్ముతున్నాం. అక్రమ కేసుల నమోదు మా దృష్టికి వస్తే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఎఫ్‌డీ కోరుతోంది. విపక్షాలపై ఎక్కువ కేసులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విశ్రాంత జడ్జిలతో కమిటీ వేసి అక్రమ కేసులపై అధ్యయనం చేయాలి. ఓటు హక్కు నమోదు చేయించుకోవడానికి నాకే మూడేళ్లు పట్టింది. స్థానికంగా నివాసం ఉండటం లేదనే కారణంతో ఓటు హక్కు కష్టమవుతోంది. పాత ఓటును సరెండర్ చేసి కొత్త ఓటును సులభంగా పొందవచ్చు. ఎన్నారైలు కూడా ఆధార్‌ కార్డు తీసుకుంటే ఓటు పొందవచ్చు. ఫామ్‌ 7 ద్వారా గరిష్ఠంగా ఐదుగురిపై ఫిర్యాదు చేయవచ్చు. తప్పుడు సమాచారం, దుర్బుద్ధితో ఫామ్‌ 7 దరఖాస్తు చేస్తే చట్టరీత్యా శిక్షార్హులవుతారు,” అని రమేశ్‌కుమార్‌ అన్నారు.