ఆంధ్రప్రదేశ్ లో వినాశనమే తప్ప, ఒక నిర్మాణమూ చేపట్టే అలవాటు లేని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అమరావతి ఆర్ 5 జోన్ వ్యవహారంలో మాత్రం ఎక్కడలేని ఆత్రుత ప్రదర్శిస్తున్నాడు.

జగన్ ఆదేశాల మేరకు ఆర్-5 జోన్‌లో యుద్ధప్రాతిపదికన లేఅవుట్ అభివృద్ధిని సీఆర్డీఏ చేపట్టింది.  ఆర్-5 జోన్‌లో 51,392 మందికి ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం అనే పేరుతతో ఈ తతంగం నడిపిస్తున్నారు. 

నెక్కల్లు, నవులూరు, కృష్ణాయపాలెం, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, అనంతవరంలో ఈ ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు.  ఈ నాలుగేళ్లలో ఒక్క గుంతని కూడా పూడ్చని జగన్, ఇప్పుడు 1,402 ఎకరాల్లో 25 లేఅవుట్లని యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేస్తానంటున్నాడు. నిద్రాహారాలు లేకుండా ప్రభుత్వ యత్రాంగం ఈ లేఅవుట్లలో రోడ్లు, లెవలింగ్, గ్రావెలింగ్ పనులు, హద్దురాళ్లు వేయిస్తోంది. అమరావతిలో ఇంతవరకు ఒక్కపని కూడా చేయించని  సీఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ లేఅవుట్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.

తాజా సమాచారం ప్రకారం, ఆర్-5 జోన్‍లో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రానికి జగన్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందట. ఆర్-5 జోన్‍లో 47,017 ఇళ్ల నిర్మాణం కోసం కేంద్రానికి ఈ ప్రతిపాదనలు పంపించారని తెలుస్తోంది. షీర్‍వాల్ టెక్నాలజీతో ఇక్కడ ఇళ్లు కట్టాలని ప్రభుత్వం యోచిస్తోందట. గతంలో చంద్రబాబు ప్రభుత్వం షీర్ వాల్ టెక్నాలజీతో పేదలకి టిడ్కో ఇళ్లని నిర్మించింది. అమరావతిలో ఇలా కట్టిన 5 వేల ఇళ్లని లబ్ధిదారులకి ఇంతవరకూ జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు, అది వేరే కథ.

ప్రస్తుతం ఆర్ 5 జోన్లో లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చినప్పుడే మంజూరు పత్రాలూ ఇవ్వాలని నిర్ణయించారు. ఇళ్ల స్థలాల లేఅవుట్ల అభివృద్ధికి సీఆర్డీఏ రూ.50 కోట్లు కేటాయించింది. లేఅవుట్ల అభివృద్ధికి ఇప్పటికే రూ.20 కోట్లు ఖర్చు చేశారు.

ఒకవైపు సుప్రీం కోర్టు ఈ ఆర్ 5 జోన్ భూముల్లో థర్డ్ పార్టీ ఇంటరెస్టు, అంటే, మూడో వారికి ఎటువంటి హక్కులు కల్పించవద్దని ఆదేశాలు ఇచ్చింది. అయినా దానిని పట్టించుకోకుండా జగన్ ముందుకు వెళుతున్నాడు. అమరావతిని రచ్చరచ్చ చేసి, తగాదాలు పెట్టాలనేది అతని ఉద్దేశం. మరి కోర్టులు ఎలా స్పందిస్తాయో చూడాలి.