కందుల రమేష్

దక్కనీ సంస్కృతితో విలసిల్లిన హైదరాబాద్ కు తెలుగు సొబగులు అద్దిన ఘనత తెలుగుదేశం పార్టీ స్థాపకుడు నందమూరి తారక రామారావుకే చెందుతుంది. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినా, 1980వ దశకం వరకు హైదరాబాద్ లో తెలుగుకు ప్రాధాన్యం లేదు. ఆనాడు హైదరాబాదు రాష్ట్ర రాజధాని అయినా, రాజకీయంగా మాత్రమే రాజధాని. భాషాసంస్కృతుల్లో ఇబ్బందుల వల్ల ఆంధ్రులు మరో రెండు దశాబ్దాల పాటు హైదరాబాదుతో పూర్తిగా మమేకం కాలేదు. అంతకుముందు కొన్ని వందల ఏళ్లగా రాజభాషగా ఉన్న దక్కనీ ఉర్దు 1956 తర్వాత కూడా హైదరాబాదు జనజీవనంలో ప్రధాన భాషగా కొనసాగడం దీనికి ప్రధాన కారణం. నగరంలో తెలుగు మాట్లాడేవారిని చిన్నచూపు చూసేవారు. మరాఠీ భాషకి ఉన్న గౌరవం కూడా ఆనాటి హైదరాబాద్ లో తెలుగుకు ఉండేది కాదు. “తెలుగు రాష్ట్ర రాజధాని నడిబొడ్డులో తెలుగు పనిచేయక పోవడం ఒక విచిత్రం,” అని పంజాబు నుంచి హైదరాబాదుకు ఐఏఎస్ అధికారిగా వచ్చిన నరేంద్ర లూధర్ ఆ రోజుల గురించి వ్యాఖ్యానించారు. దక్కనీ సంస్కృతిలో మునిగితేలుతున్న నగర జీవనంలో రాజకీయ వ్యవస్థలో తప్ప మరెక్కడా తెలుగుదనం ఇమడని పరిస్థితి 1956లో కవి బాలగంగాధర్ తిలక్ హైదరాబాదు మీద రాసిన ఈ ప్రేమగీతంలో ప్రతిఫలిస్తుంది:

తెలుగువాళ్ల తెలివిలేనితనం ధోవతి కుచ్చెళ్లతోపాటు మోటుగా
యం. యల్. ఏ. క్వార్టర్స్ దగ్గర ఎబ్బెట్టుగా జీరాడుతుంది

ఆంధ్రులకు మద్రాసు స్థానంలో హైదరాబాదు మజిలీ కావడానికి అందుకే సమయం పట్టింది. 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడక ముందు హైదరాబాదు జనాభా 11.91 లక్షలు. 1957లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత అదనంగా 12 వేల జనాభా మాత్రమే పెరిగింది. 1960 వరకు కూడా జనాభా పెరుగుదల అతిస్వల్పం. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినా కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి హైదరాబాదుకు జనం తరలిరాలేదు.

1982లో తెలుగు దేశం పార్టీ ఏర్పాటు, ఎన్టీ రామారావు రాజకీయ ప్రవేశం తర్వాత హైదరాబాదు ముఖచిత్రం మారింది. తెలుగు ఆత్మగౌరవ నినాదం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని మూడు ప్రాంతాల ప్రజలను దగ్గర చేసింది. రాజధానిలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ఆయన ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఫలితంగా ఆంధ్రుల రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక నగరంగా హైదరాబాదు ఎదిగింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఆంధ్రులు రాజధాని హైదరాబాదుకి వలస రావడం ఎన్టీఆర్ కాలంలో ప్రారంభం కాగా, అది చంద్రబాబు హయాంలో మరింత వేగం పుంజుకుంది.

ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత, హైదరాబాదు నగరంతో తెలుగువారు, మరీ ముఖ్యంగా, కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారు మమేకమయ్యారు. ఈ కారణం చేతనే 80వ దశకంలో హైదరాబాదు జనాభా పెరుగుదల గణనీయంగా ఉంది. 1950వ దశకంలో హైదరాబాదు జనాభా పెరుగుదల ఏటేటా 1.07 శాతం మాత్రమే ఉండగా, 1980-1990 దశకంలో 5.50 శాతం ఏటేటా జనాభా పెరిగింది. ఆ తర్వాత నుంచి సగటున ప్రతి సంవత్సరం 2.90 శాతం జనాభా పెరుగుదల నమోదవుతోంది.

ఉపాధి, వ్యాపార అవకాశాలతో పాటు, విద్యావైద్య అవసరాలకు, కళాసాంస్కృతిక రంగాల్లో అభ్యాసానికి, ఆవిష్కరణలకు, అవకాశాలకు హైదరాబాదు నగరం తెలుగువారందరికి కేంద్రమైంది. మద్రాసు నుంచి సినిమా రంగానికి చెందిన వివిధ వృత్తులవారు, కళాకారులు, రచయితలు తరలివచ్చారు. అప్పటిదాకా పత్రికలకు, ప్రచురణలకు, కవులకు, ఆలోచనాపరులకు కేంద్రంగా ఉన్న విజయవాడ నుంచి వలసలు పెరిగాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు మొదలైన అనేక రంగాల్లో ఆంధ్రులు కాలుపెట్టారు. నగరంలో సేవారంగం బహుముఖంగా విస్తరించింది. తెలుగునాట నలుమూలల నుండి జీవితావవసరాల కోసం, తాము ఎంచుకున్న రంగాల్లో రాణింపు కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం తండోపతండాలుగా రాజధాని నగరానికి తరలివచ్చారు.

ఆ విధంగా ఎన్టీఆర్ రాకతోనే రాజధానికి తెలుగు కళ వచ్చింది. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమల్లో మారుమూల పల్లెవాసులు కూడా హైదరాబాద్ తో అనుబంధం పెంచుకున్నారు. నగరంలో తెలుగు భాషకు, తెలుగు సాంప్రదాయ కళలకు ఆదరం పెరిగింది.

హైదరాబాద్ కు ఒడ్డాణంలా ఉన్న హుస్సేన్ సాగర్ మీద ఉన్న ట్యాంక్ బండ్ ను విస్తరించి, తెలుగు వెలుగుల మూర్తి నిక్షిప్త కళాప్రాంగణం పేరుతో 1986లో ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు ఎన్టీఆర్ కృషివల్లే సాధ్యమైంది. ట్యాంక్ బండ్ ను సుందరీకరించి, ఒకవైపు కాకతీయ, మరోవైపు విజయనగర తోరణాలను ఏర్పాటు చేసి, మధ్యలో తెలుగు భాషా సంస్కృతుల కోసం పాటుబడిన 33 మంది విగ్రహాలను ప్రతిష్టించారు. వీటిని తన స్వీయపర్యవేక్షణలో ప్రముఖ శిల్పి గణపతి స్థపతి చేత చెక్కించారు. ప్రముఖ ఛాయాగ్రాహకులు మార్కస్ బార్ ట్లే, జైహింద్ సత్యం సాయంతో చారిత్రక పురుషుల రూపనిర్ణయం చేశారు. వీరిలో రాణి రుద్రమ నుంచి మొదలుకొని, మఖ్దూం మొహియుద్దీన్ వరకు వివిధ రంగాల్లో తెలుగు వారికి చేసిన సేవను ఎన్టీఆర్ కోరిక మేరకు ప్రముఖ కవి సి నారాయణరెడ్డి రెండు పంక్తుల్లో లిఖించారు. ఉదాహరణకు కవయిత్రి మొల్ల విగ్రహం మీద చెక్కిన పంక్తులివి:

కవితలల్లిన తొలి తెలుగు విదుషీమణి
రామాయణ కావ్యరచనా రసధుని

ట్యాంక్ బండ్ లో తెలుగువారి విగ్రహాలు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. పక్కనే హుస్సేన్ సాగర్ లో ఎత్తైన బుద్ధ విగ్రహ స్థాపన కూడా తెలుగువారి సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తుచేస్తుంది. తీరాంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఒకనాడు బౌద్ధం వర్ధిల్లింది. చరిత్రలో వివిధ కాలాల్లో బుద్ధుని బోధనలు తెలుగువారిని ప్రభావితం చేశాయి. అమరావతిలోను, ఉత్తరాంధ్రలో పలుప్రాంతాల్లో లభించిన అవశేషాలు తెలుగువారికి బౌద్ధంతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తాయి. నాగార్జునసాగర్ లో లభ్యమైన బుద్ధుని విగ్రహం ప్రపంచ ప్రసిద్ధమైంది. ఈ ఆంధ్ర బౌద్ధ శిల్పకళారీతే శ్రీలంక, థాయలాండ్, జపాన్ వంటి దేశాలకు పాకింది. ఈ వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ హుస్సేన్ సాగర్ లో 17 మీటర్ల పొడవైన బుద్ధుని ఏకశిలా విగ్రహాన్ని ఎన్టీఆర్ ప్రతిష్టించారు.

అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా 1986లో హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో తెలుగు లలిత కళాతోరణం నిర్మాణం వల్ల తెలుగు శాస్త్రీయ, జానపద కళాప్రదర్శనలకు ప్రోత్సాహం లభించింది. తెలుగు భాష, సాహిత్యం, కళారూపాల పరిశోధనలకు తోడ్పడిన తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు కూడా ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను తెలుగు నగరంగా మార్చడంలో పాత్ర వహించింది. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ తెలుగు భాషకి పాలన వ్యవస్థలో ఇచ్చిన ప్రాధాన్యం వల్ల నగరంలో తెలుగుదనం వికసించింది. ఉగాది తదితర పండుగల సందర్భంగానే కాకుండా, పాలనాపరమైన సమావేశాల్లోనూ తెలుగులో ఆయన చేసిన ప్రసంగాలు ఉత్తేజపూరితంగా ఉండేవి. హైదరాబాద్ లోని ప్రభుత్వ సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే భవనానికి ఎన్టీఆర్ ‘సమత’ అనే పేరు పెట్టుకున్నారు. అలాగే, పార్టీపరంగా ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో నిర్వహించిన మహానాడు సభలు తెలుగు సంస్కృతికి, సాంప్రదాయ కళలకు పెద్ద పీట వేశాయి.

రాజకీయంగా ఆ తర్వాత ఎన్నో మార్పులు వచ్చినా, ఘనమైన దక్కనీ చరిత్ర గల తెలుగు నగరంగా ఇవాళ హైదరాబాద్ భాసిస్తోంది. “ఆధునిక, పురోగామి తెలుగు సంస్కృతికి కేంద్రంగా ఈనాడు హైదరాబాద్ విలసిల్లుతోంది. నగరంలో ముందు ముందు మరింత ఊపందుకోనున్న ఈ తెలుగు సాంస్కృతిక పురోగమనాన్ని పరిశోధకులు అక్షరబద్ధం చేస్తారు,” అని అమెరికన్ పరిశోధకురాలు క్యారెన్ ఇసాక్సెన్ లియోనార్డ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ తెలుగు నగరంగా రూపాంతరం చెందటంలోను, తెలుగు సంస్కృతికి కేంద్రంగా విరాజిల్లడంలోను ఎన్టీ రామారావు వహించిన పాత్ర అసామాన్యం.

(కందుల రమేష్ సీనియర్ జర్నలిస్టు. వివిధ ఇంగ్లీషు, తెలుగు పత్రికల్లోనూ, టీవీ చానెళ్లలోనూ పనిచేశారు. ఆయన రాసిన Maverick Messiah – A Political Biography of N.T. Rama Rao పుస్తకాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ సంస్థ ప్రచురించింది.)