నరేంద్ర మోడి ప్రభుత్వం మళ్లీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఇవాళ ప్రకటించింది.  

మే నెల 23 నుంచి 2000 రూపాయల నోట్లు కలిగిన వారు బ్యాంకులకి వెళ్లి మార్చుకోవచ్చని చెప్పింది. అయితే, ఒక్కో విడత 20 వేల రూపాయల వరకే మార్చుకోవచ్చని తెలిపింది.

2016 నవంబరులో బిజెపి ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లని విత్ డ్రా చేసింది. అప్పుడు మార్కెట్లో నగదు మార్పిడికి ఇబ్బందులు రాకుండా ఉండేందుకోపం 2000 రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది. అయితే ఆ తర్వాత మిగతా డినామినేషన్ల నోట్లను పెద్ద ఎత్తున రిజర్వు బ్యాంకు ముద్రించడంతో నగదు మార్చుకోవటానికి ఇబ్బంది లేకుండా పోయిందని, అందుచేత 2018-19 నుంచే 2000 నోట్ల ముద్రణని నిలిపివేశామని రిజర్వు బ్యాంకు వెల్లడించింది.

  • తక్షణమే రెండు వేల నోట్లఉపసంహరణ
  • మే నెల 23 నుంచి 2000 నోట్లు మార్చుకోవచ్చు
  • సెప్టెంబరు 30 లోగా మార్చుకోవాలి
  • ఒకసారి 20 వేల రూపాయల వరకే మార్చుకోవాలి

రెండు వేల  నోట్లు ఉన్నవారు సెప్టెంబర్ 30 లోగా మార్చుకోవాలని రిజర్వు బ్యాంకు చెప్పింది.  అలాగే 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రెండు వేల నోట్లు మార్చుకునే సౌలభ్యం ఉంటుందని చెప్పింది. 

గతంలో లాగా ఈ సారి ఈ చర్య వల్ల సామాన్య ప్రజలు అంత ఇబ్బంది పడకపోవచ్చు. రెండు వేల నోట్లు వాడే సాధారణ, మధ్య తరగతి ప్రజలు చాలా తక్కువ. సామాన్యులంతా ఇప్పుడు డిజిటల్ చెల్లింపులకి అలవాటు పడ్డారు. అయితే రాజకీయ పార్టీలు, బ్లాక్ మార్కెటీర్లకి ఈ నిర్ణయం దెబ్బ కావచ్చు