కందుల రమేష్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ భయపడుతున్నదెవరికి? ప్రతిపక్షాలను చూసి కాదు, కేంద్రాన్ని చూసి కాదు, కోర్టులని చూసి కాదు. ఈనాడును చూసి, రామోజీరావుని చూసి.
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అన్నా లేని భయం ఈనాడు పత్రిక అంటే జగన్ కి ఎక్కువ ఉన్నదని చాలాకాలంగా ఆయన మాటలని, చేతలని చూసిన వారికెవరికైనా అర్థమవుతుంది.
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ఈనాడు ని తిట్టకుండా, రామోజీరావు పేరు తలుచుకోకుండా వైసిపి ప్రభుత్వానికి పూట కూడా గడవదనడంలో అతిశయోక్తి లేదు.
ఈనాడు పేపరు విశ్వసనీయతని ఏ రకంగా నైనా దెబ్బతీయాలని, ప్రభుత్వంలో తనకున్న అధికారాలతో రామోజీరావుని తన కాళ్ల దగ్గరకు తెచ్చుకోవాలని జగన్ ఈ నాలుగేళ్లలో చేయని ప్రయత్నం లేదు. ముఖ్యమంత్రి నుంచి ప్రేరణ పొందిన మంత్రులతో పాటు జగన్ తన ప్రభుత్వంలో రకరకాల పదవులిచ్చి పెట్టుకున్న వందిమాగధులు కూడా యధాశక్తి ఈనాడు మీద విషం కక్కుతూ వస్తున్నారు.
రామోజీరావు మీద వంకర కార్టూన్లతో, ఈనాడు మీద, ఈనాడు కథనాల మీదా చిల్లర రాతలతో తెలుగు రాష్ట్రాల్లో పాఠకుల్ని, వీక్షకుల్ని తనవైపు తిప్పుకోవటానికి అధికార పార్టీ యత్రాంగం పడిన, పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.
ఈ మధ్య కాలంలోనైతే ఈనాడు పత్రికలో వచ్చిన కథనాలను ఏరోజుకారోజు ఖండించడమనే ఏకైక కార్యక్రమానికి సాక్షి పేపరు అంకితమైపోయింది. ఏ రోజు పేపరు తీసినా, రామోజీరావు బొమ్మతో ఏదో ఒక ఈనాడు కథనం మీద ఉక్రోషాన్ని వెళ్లగక్కడమే పనిగా పెట్టుకుంది.
ఇంకోరకంగా చెప్పాలంటే, ఈనాడుని, రామోజీరావుని దాటి ఆలోచించలేని ఒక నిస్సహాయస్థితిలో అధికార పార్టీ మీడియా వ్యవస్థ అంతా కొట్టుమిట్టాడుతోంది.
గమ్మత్తేంటంటే, రామోజీరావు సంస్థల ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టడానికి వాళ్ల నాన్న వైఎస్ రాజశేఖరరెడ్డి లాగానే, జగన్ కూడా అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి అనేక రకాలుగా అకృత్యాలకి పాల్పడిన తర్వాత కూడా ఇదే పరిస్థితి.
ఈనాడుని, రామోజీరావుని ఏమీ చేయలేకపోతున్నామనే అసహనం.
ఇన్ని ఎదురుదాడులు చేసినా ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గకపోగా, రెట్టించిన ఉత్సాహంతో జగన్ ప్రభుత్వంలో లోపాల్ని, అక్రమాల్ని, అవకతవకల్ని ప్రతిరోజూ చీల్చిచెండాడుతున్నారు రామోజీరావు.
ఈ ఎదురుదాడి జగన్ కి మింగుడు పడటం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు.
మామూలుగా అయితే, ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టడం, తన చేతులో ఉన్న అధికారాన్ని ఆయుధంగా మలుచుకొని చట్టాన్ని ఏకపక్షంగా, ఇష్టారాజ్యంగా వినియోగించి అవతలి వాళ్లని ముప్పతిప్పులు పెట్టడం జగన్ కి వెన్నతో పెట్టిన విద్య.
అది అమరావతి కావచ్చు, అమరరాజా కావచ్చు, అయ్యన్న కావచ్చు, అచ్చెన్న కావచ్చు.
అదే విద్యని ఈనాడు మీద, రామోజీరావు మీద ప్రయోగించాడు జగన్.
రాజకీయ నిరుద్యోగి ఉండవల్లి అరుణ్ కుమార్ ని ఆసరాగా తీసుకొని, ఎప్పుడో ముగిసిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ అధ్యాయాన్ని మళ్లీ రేపాలని తొలుత ప్రయత్నించాడు.
అయితే అది సుప్రీం కోర్టులో ఉండటం వల్ల, ఆ కేసులో ఫలితం ఉండే అవకాశం లేనందువల్ల, బురదజల్లే కార్యక్రమాన్ని ఉండవల్లికి అప్పజెప్పి, తాను ఏం చేయాలో వెతికాడు.
రామోజీరావు వ్యాపారాల్లో ఆంధ్రప్రదేశ్ లో కార్యకలాపాలు సాగిస్తున్నది మార్గదర్శి చిట్ ఫండ్స్ కంపెనీ ఒక్కటే. అది చాలు జగన్ కి.
ఆ వెంటనే కావాల్సిన మనుషుల్ని కావాల్సిన స్థానాల్లో పెట్టాడు. మంచీచెడూ, చట్టం న్యాయం లాంటి ఛాందసాలు లేని అధికారుల్ని ఏరితెచ్చాడు. సోదాల పేరుతో పోయిన నవంబరులో మొదలుపెట్టి మార్గదర్శి చిట్ ఫండ్స్ మీద పెద్దఎత్తున దాడులు చేయిస్తూనే ఉన్నాడు.
ఎన్ని దాడులు చేసినా, ఎంతమందిని అరెస్టు చేసినా, ఉండవల్లి దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మ దాకా ఎంతమందిని రంగంలోకి దించి, బురద జల్లించినా రామోజీరావు చెక్కుచెదరలేదు.
ఎంత భయపెట్టినా, చందాదారులు కూడా భయపడకపోవడం, రామోజీ మీద అంతులేని విశ్వాసాన్ని కలిగిఉండటంతో ఏం చేయాలో తోచలేదు. ఒక్కరంటే ఒక్క చందాదారుడు కూడా ముందుకు వచ్చి ఏదో ఒక దొంగ ఫిర్యాదు ఇవ్వటానికి కూడా ముందుకురాకపోవడంతో దిక్కుతోచలేదు.
చివరకి మార్గదర్శి దగ్గరున్న 790 కోట్ల రూపాయల్ని ఏదో ఒక పేరు చెప్పి లాగేసుకుంటే, అప్పుడు గిలగిలలాడిపోతారని జగన్ పన్నాగం పన్నాడు. అందుకోసం జీవో ఇచ్చినా, మార్గదర్శి అలాగే నిలబడింది.
వ్యక్తిగతంగా రామోజీరావుని, ఆయన కోడలు శైలజా కిరణ్‌ని విచారణ పేరుతో వేధించినా, ఆయన గాని, ఆయన కంపెనీ గాని ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు.
తగ్గకపోగా, ఈనాడులో జగన్ ప్రభుత్వం మీద పరిశోధనాత్మక కథనాలు మరింత పదునెక్కాయి.
భాషలో వాడి, వేడి ఇంకా పెరిగింది.
సాక్షిలో రామోజీరావు మీద వ్యక్తిగతంగా ఎన్ని కథనాలు రాసుకున్నా, ఉండవల్లి లాంటి వాళ్ల చేత ఎన్ని అభూత కల్పనలు చెప్పించినా, వాటికి సమాధానం చెప్పడానికి కూడా ఈనాడు ఎన్నడూ ప్రయత్నించలేదు. వీధికుక్కలు మొరుగుతుంటే పట్టించుకోని గజరాజు లాగే వ్యవహరించింది.
ప్రజలకి సంబంధించిన అంశాల మీద నుంచి తన దృష్టిని ఈనాడు ఒక్కరోజు కూడా మరలించలేదు. వ్యక్తిగత విమర్శలని తిప్పికొట్టడానికి ప్రయత్నించక పోవడమే గాదు, జగన్ కి సంబంధించిన వ్యక్తిగత విషయాల జోలికి కూడా ఎన్నడూ పోలేదు.
ఆ మానసిక స్థైర్యం, ఆ గుండె ధైర్యం, ఆ మొక్కవోని దీక్ష జగన్ అండ్ కోని భయకంపితుల్ని చేస్తున్నాయి.
చివరికి ఈనాడుకి ప్రకటనలు విషయంలో కూడా వైసిపి ప్రభుత్వం రకరకాలు విన్యాసాలు చేసింది. జగన్ కి ఇష్టం ఉన్నా లేకపోయినా నెంబర్ ఒన్ పత్రికగా ఈనాడుకి ప్రకటనలు ఇవ్వాల్సిందే. అయితే ఈ నిబంధనని తప్పించుకునేందుకు కుయుక్తులు పన్నారు. ప్రకటన ఫలానా పేజీలో, ఫలానా విధంగా, ఫలానా చోటే రావాలంటూ కావాలని అనేక రకాలుగా అసాధ్యం చేయాలని ప్రయత్నించారు. ఈ బ్లాక్ మెయిల్ కి లొంగడానికి ఇష్టపడని రామోజీరావు, ప్రభుత్వం నుంచే వచ్చే యాడ్లని వదులుకోటానికి సంసిద్ధులయ్యారు. ఇదేమీ తక్కువ మొత్తం కాదు. అయినా రాజీ పడటానికి ఆయన ఇష్టపడలేదు. అందుకే ప్రస్తుతం ఈనాడులో జగన్ ప్రభుత్వం ఇచ్చే యాడ్లు కనబడవు.
మానిప్యులేషన్‌లో సిద్దహస్తుడైన జగన్, ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి సాక్షి పత్రిక సర్క్యులేషన్ ని ఈనాడు కంటే పెంచి, నెంబర్ ఒన్ స్థానాన్ని కొట్టేయాలని కూడా చూస్తున్నాడు. ఇందుకోసం, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పేపరు కొనడానికి వీలుగా అలవెన్స్ కేటాయించి, సాక్షి ని కొనిపిస్తున్నాడు. దీని మీద ఈనాడు వేసిన కేసు ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టులో ఉంది.
ఇన్ని రకాలుగా వెంటాడి, వేధించినా, ఆర్థికంగా దెబ్బకొట్టినా, అక్రమ కేసులు బనాయించినా, అనుంగు మీడియా తోటి, అనుచరగణం తోటి వ్యక్తిత్వ హననం చేసినా, కులం అంటగట్టినా, కుటుంబాన్ని టార్గెట్ చేసినా, రామోజీరావు మడమ తిప్పలేదు. మాట మార్చలేదు. లక్ష్యాన్ని మరవలేదు.
ఎన్నికల దగ్గర పడేకొద్దీ ఈనాడు రాతల్లో ఇంకా పదును పెరుగుతుంది. ఎంత మసిపూసి మారేడుకాయ చేయాలని అనుకున్నా, ప్రజల కళ్లల్లో కారం చల్లి తన వైపు తిప్పుకోవాలని ప్రయత్నించినా, ఈనాడు అడ్డం వస్తోందని, తన ఆటల్ని చెల్లనీయడం లేదని జగన్ కి రగిలిపోతోంది.
అందుకనే ఈనాడు ఇవాళ జగన్ కి నెంబర్ వన్ శత్రువు.