వీరసింహారెడ్డి సినిమా విజయెత్సవ సభలో బాలకృష్ణ మాటలు వివాదాస్పదమయ్యాయి. బాలకృష్ణ నిజానికి ఈ మాటల్ని కించపరిచే ఉద్దేశంతో అనకపోయినా, ఎస్వీ రంగారావు, అక్కినేని అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు ప్రస్తుతం ఆంధ్రలో సినిమాలు, కులాలు, రాజకీయాలు అన్నీ కలగలిపిన వాతావరణం ఉంది. ఏ అవకాశాన్నీ వదులుకోని వైసిపి ఐప్యాక్ ఇప్పటికే దీని మీద రగడ మొదలుపెట్టింది.
వీరసింహారెడ్డి సినిమా నిర్మాతలు, ఆర్టిస్టులను ప్రస్తావిస్తూ, అందులో ఒకరితో ‘నాన్నగారు, ఆ డైలాగులు, ఆ రంగారావు గారు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీగూడ మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం’ అని బాలకృష్ణ తన ప్రసంగంలో అన్నాడు. ఎస్వీఆర్ ని, అక్కినేనిని అవమానించాలన్న ఉద్దేశం గాని, సందర్భం గాని బాలకృష్ణ స్పీచ్ లో లేదు.
అయితే ఏ ఫ్లో లో మాట్లాడినా, ‘అక్కినేని, తొక్కినేని’ అనే మాటలు ఒక స్టేజి మీద బాలకృష్ణ మాట్లాడాల్సిన మాటలు కావు. దీనిమీద ఎస్వీ రంగారావు అభిమానులు కొందరు విరుచుకుపడితే, అక్కినేని అభిమానులు ఇది సభ్యత, సంస్కారం కాదంటూ నిరసన తెలిపారు. ‘నందమూరి తారక రామారావుగారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్.వి రంగారావు గారు.. వీరంతా తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడమంటే మనల్ని మనమే కించపరుచుకోవడం..’’ అని నాగచైతన్య ట్వీట్ చేశారు.
ఆంధ్రలో ప్రతిదానికీ రాజకీయ కోణం ఉంటుంది. నాగచైతన్య చేసిన ఈ ట్వీట్ కి మిలియన్లలో లైకులు, రీ ట్వీట్లు వచ్చాయి. అయన చేసిన మరే ట్వీటుకి ఈ స్థాయిలో స్పందన రాలేదని నాగచైతన్య టైమ్ లైన్ చూస్తే అర్థం అవుతుందని తెలుగుదేశం మద్దతుదారులు పాయింట్ అవుట్ చేశారు. అంటే కావాలనే వైసిపి ఐప్యాక్ టీమ్ వాళ్లు ఈ ట్వీట్ ని ఈ స్థాయిలో వైరల్ చేశారని అర్థం అన్నమాట.
నిజానికి బాలకృష్ణ ఈ సభలో తన నియోజకవర్గంలో కాపులు కృష్ణదేవరాయల విగ్రహం పెట్టడం గురించి ప్రస్తావించి, ఇది తనకెంతో సంతోషం కలిగించిందని చెప్పారు. కృష్ణదేవరాయలని ఆంధ్రలో పలు కులాలు తమ వాడని వాదిస్తుండగా, బాలకృష్ణ మాత్రం కృష్ణదేవరాయలు కాపు అన్నట్టుగానే ఈ సభలో మాట్లాడటం వారి వాదనను ఒకరకంగా బలపరచడమే.
అయితే కారణాలేమైనా బాలకృష్ణ విషయంలో ఎప్పుడూ ఆయన మాట లేక చేత దొర్లడమే వార్తల్లో వస్తుంటుంది గాని, ఆయన బోళాతనం, మంచితనం ప్రచారానికి నోచుకోవు.
ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా, బాలకృష్ణ చేతి దురుసు, మాట దురుసు ఆయన్ని వివాదాల్లోకి నెట్టడం ఇది మొదటిసారి కాదు. అటు రాజకీయాల్లో, ఇటు సినిమా రంగంలో సీనియర్ గా వెలుగొందాలనుకున్న వ్యక్తులు తమ మాటల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇంతకాలం తర్వాత కూడా బాలకృష్ణ ప్రజల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా వ్యవహరించలేకపోవడం ఆయన లోపమే.
బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే. ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడికి సన్నిహిత బంధువు. ఆయన అల్లుడు నారా లోకేష్ యువగళం పేరుతో ప్రతిష్టాత్మకంగా పాదయాత్ర తలపెట్టాడు. ఈ నేపధ్యంలో డైవర్ట్ చేయటానికి, తెలుగుదేశం పార్టీని బద్నాం చేయటానికి ఆయన మాటలు, చేష్టల్ని రాజకీయ ప్రత్యర్థులు ఉపయోగించుకుంటారనే స్పృహ బాలకృష్ణకు ఉండాలి. సహజంగానే వైసిపి సోషల్ మీడియా ఈ అంశాన్ని రచ్చచేసి, తెలుగుదేశం మీద వ్యతిరేకత పెంచడానికి ప్రయత్నం చేస్తోంది.
ఆహా ఓటిటిలో వస్తున్న Unstoppable టాక్ షో తో పాటు, ఇటీవలి సినిమాలు కూడా ఎంతో కొంత విజయవంతం కావడం బాలకృష్ణలో దురుసుతనం పెరగడానికి కారణమని కొందరు విమర్శకులు అంటున్నారు. అది నిజమైనా కాకపోయినా, తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఉన్నందువల్ల ఈ కీలక సమయంలో బాలకృష్ణ చిన్న పొరపాటు కూడా ఆ పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉంది. అందుకనే ఈ వివాదానికి స్వస్తి పలుకుతూ, బాలకృష్ణే వివరణ ఇవ్వడం సముచితమని పలువురు భావిస్తున్నారు.