జీవో నంబర్ ఒన్ మీద విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తన తోటి సహచరుల మీద విరుచుకుపడ్డారు. ఈ కేసు విచారణను అంతకుముందు వెకేషన్ బెంచి స్వీకరించి, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వెకేషన్ బెంచిలో జస్టిస్ బట్టు దేవానంద్ ఉన్నారు. ఈ కేసును సెలవు రోజుల్లో తీసుకోవడం హైకోర్టు సీజేను అవమానించడమేనని, ఇది తేలిగ్గా తీసుకొనే వ్యవహారం కాదని జస్టిస్ మిశ్రా వ్యాఖ్యానించారు.

ఈ వ్యవహారాన్ని చూస్తున్నవారికి రెండు అనుమానాలు వస్తాయి. ఇదంతా హైకోర్టులో అంతర్గత విభేదాల కారణంగా జరుగుతోందా? లేక ప్రభుత్వ అనుకూల, వ్యతిరేక భావజాలం మధ్య జరుగుతున్న యుద్ధమా?

సిజెఐ కోపానికి కారణం వెకేషన్ బెంచి అధికారాలకు సంబంధించిన సాంకేతిక పరిమితులను ఉల్లంఘించడమే కావచ్చు. కాని అసలు ఈ జీవోపై అత్యవసరంగా వెకేషన్ బెంచి విచారణ చేయాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నించడం ఆశ్చర్యకరం. అంత కొంపలేం మునిగిపోతున్నాయి అన్నట్టు సిజెఐ మాట్లాడారు. విచారణ కోసం వెకేషన్‌ బెంచ్‌ను కోరాల్సిన అవసరం ఏమొచ్చిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అశ్వినీ కుమార్‌ను కూడా ప్రశ్నించారు. కొంత సమయం వేచి చూస్తే ఆకాశమేం ఊడిపడదు కదా? అని కూడా అన్నారు.

అంటే రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలను అణగదొక్కుతూ ప్రభుత్వం జీవో తీసుకొస్తే, అది ఏ మాత్రం ప్రాధాన్యం లేని అంశంగా సిజెఐ పరిగణిస్తున్నారనేది అర్థమవుతోంది. ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమైన Right to Association అనే హక్కుకు భంగం కలిగినప్పుడు రాజకీయ పార్టీలు దీనిమీద న్యాయస్థానాల నుంచి తక్షణం రిలీఫ్ కావాలని కోరుకోవడాన్ని ఎలా తప్పుపడుతున్నారో అనూహ్యంగా ఉంది. 

ఈ అంశం మీద ప్రముఖ రాజకీయ విశ్లేషకులు టి లక్ష్మీనారాయణ ఇలా అన్నారు:

“ప్రజాస్వామ్యంలో భిన్న ఆలోచనలు, దృక్పథాలు సహజం. మెరుగైన సమాజ నిర్మాణానికి అవసరం కూడా. కానీ, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల్లో ఆంతరంగికంగా జరగాల్సిన వ్యవహారాలు బహిరంగ చర్చకు దారితీస్తే సమాజంపై దుష్ప్రభావం పడుతుంది. రాజ్యాంగంబద్ధ వ్యవస్థల పట్ల ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది. పాలక వర్గాలు ఈ పరిణామాన్ని కోరుకొంటుండవచ్చు. సమాజంలో చీలిక, రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్య ఘర్షణ, కడకు న్యాయ వ్యవస్థలో నెలకొన్న భిన్నాభిప్రాయాలు ప్రజల మధ్య చర్చనీయాంశంగా మారడం ఏ మాత్రం ఆహ్వానించదగ్గ పరిణామం కాదు.”

తోటి న్యాయమూర్తి మీద సిజెఐ బహిరంగంగా కోర్టు హాల్లో పదేపదే విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయటం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. ప్రధాన న్యాయమూర్తి ఈ కేసుని స్వీకరించిన విధానం మీద అభ్యంతరాలు ఉంటే, వాటిని అంతర్గతంగా వ్యక్తం చేయవచ్చు. కాని, జీవో 1 కేసులో మంచిచెడుల గురించి కాకుండా వెకేషన్ బెంచి ఈ కేసుని విచారణకి స్వీకరించడం మీదనే ప్రధాన న్యాయమూర్తి ఎక్కువ దృష్టి పెట్టారు.

జీవో నెంబరు ఒన్ మీద విచారణ పూర్తయింది. తీర్పుని ధర్మాసనం రిజర్వు చేసింది. ఈ వ్యాఖ్యల తర్వాత సిజెఐ నేతృత్వంలోని ధర్మాసనం ఏ రకమైన తీర్పు ఇస్తుందనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.