అమరావతి నిర్మాణం పేరుతో తీసుకున్న అప్పు చెల్లించాలంటూ ఫిబ్రవరి 10న ఏపీ సీఆర్డీఏ కార్యాలయంలో అధికారుల్ని బ్యాంకర్లు నిలదీశారని వార్త. ఇంత పరువుతక్కువ వ్యవహారం జరిగిని జగన్ ప్రభుత్వలో ఎవరూ వివరణ కూడా ఇవ్వలేదు.

2019-20కి సంబంధించి క్యాగ్ (Comptroller And Auditor General Of India) విడుదల చేసిన ఆర్థిక నివేదిక ప్రకారం, సీఆర్డీఏ రూ.3,013.60 కోట్ల రుణం తీసుకుంది. గమ్మత్తేంటంటే, అధికారంలోకి వచ్చాక డిసెంబర్ 2019లో రాష్ట్రానికి ఇకపై మూడురాజధానులు ఉంటాయని, ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలిస్తున్నాని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించాడు.   అదేసమయంలో, అమరావతి నిర్మాణం పేరుతో పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంకుల నుంచి  రూ.3,013కోట్ల రుణం తీసుకోవడం విచిత్రం.

తీసుకున్న రుణానికి మూడు నెలలకోసారి వడ్డీ కట్టాలి. అటు అమరావతిలో ఏ పనీ పూర్తి చేయలేదు, ఇటు రెగ్యులర్ గా కట్టాల్సిన వడ్డీని కొంతకాలంగా కట్టలేదు. వడ్డీ కట్టలేదని కొందరు బ్యాంకర్లు సీఆర్డీఏ కార్యాలయానికి వెళ్తే, వారికేం చెప్పాలో తెలియక సీఆర్డీఏ కమిషనర్ ముఖం చాటేశారని పత్రికల్లో రాశారు.  

ముఖ్యమంత్రి రాష్ట్ర పరువుప్రతిష్టల్ని మంటగలుపుతున్నాడని, చంద్రబాబు హాయాంలో ఏ బ్యాంకుసిబ్బంది అయినా అప్పుకట్టాలని ప్రభుత్వాధికారు ల్ని అడిగిన దాఖలాలు ఉన్నాయా అని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ప్రశ్నించారు.

రేటింగ్ సంస్థ క్రిసిల్ (CRISIL) గతంలో సిఆర్డీఏకి A(+) రేటింగ్ ఇచ్చింది. అదే క్రిసిల్ సంస్థ ఆగస్ట్ 18, 2022న  సీఆర్డీఏ రేటింగ్ ని A(-) కు తగ్గించింది. వడ్డీచెల్లింపులకు కూడా ప్రభుత్వ అకౌంట్లలో కనీసబ్యాలెన్స్ ని జగన్ ప్రభుత్వం మెయింటెన్ చేయడంలేదని, దానివల్లనే ఏపీ సీఆర్డీఏ రేటింగ్ తగ్గిస్తున్నట్టు ఆనాడు క్రిసిల్ స్పష్టంచేసింది.

ఈ వడ్డీయే కట్టకపోతే, అమరావతి బాండ్ల (Amaravati Bonds) వడ్డీని ముందు ముందు ఎలా కడతారనే అనుమానం రాకమానదు.  చంద్రబాబు ప్రభుత్వం 2018లో  బొంబాయి స్టాక్ ఎక్చేంజ్ లో అమరావతి బాండ్లని అమ్మకానికి పెట్టి రూ. 2,000 కోట్ల రూపాయలను సేకరించింది. ఒక నగర నిర్మాణం కోసం ఇంత పెద్ద ఎత్తున ఇండియాలో బాండ్లను విజయవంతంగా మార్కెట్లో పెట్టలేదని, ఇది ఒక రికార్డు అని పత్రికలు ప్రశంసించాయి. 

ఆ బాండ్లపై 2023-24 ఏప్రిల్ నుంచి సంవత్సరానికి రూ.400 కోట్ల అసలుచెల్లించాలి. బ్యాంకులకు కనీసం వడ్డీకూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్న వైసిపి ప్రభుత్వం అమరావతి బాండ్ల అసలు మొత్తాన్ని ఏరకంగా చెల్లిస్తుందో వేచిచూడాలి.