ఆంధ్రప్రదేశ్ కి కొత్త గవర్నర్ వచ్చారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ అబ్దుల్ నజీర్ ఏపి కొత్త గవర్నర్ గా నియమితులయ్యారు.

ఎవరీ జస్టిస్ అబ్దుల్ నజీర్? ఇప్పటిదాకా గవర్నర్ గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ కి భిన్నంగా కొత్త గవర్నర్ వ్యవహరించే అవకాశం ఉందా?

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం బిశ్వభూషణ్ హరిచందన్ ని ఏపి గవర్నర్ గా నియమించింది. అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం గవర్నర్ నరసింహన్ ని మార్చమని ఎన్నిసార్లు కోరినా కేంద్రం మార్చలేదు.

బిశ్వభూషణ్ హరిచందన్ మూడేళ్ల 5 నెలల పాటు ఏపి గవర్నర్ గా ఉన్నారు. ఆయన గవర్నర్ గా ఉండగా జగన్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, చట్టాన్ని అతిక్రమించి చేసిన ఎన్నో పనులని ధృతరాష్ట్రుడి మాదిరిగా కళ్లుమూసుకొని చూశారు.

గవర్నర్ స్వతంత్రగా వ్యవహరించటానికి మన రాజ్యాంగం ప్రకారం వీలు కాని మాట వాస్తవం. అది ఫెడరల్ స్ఫూర్తికి, రాష్ట్రాల హక్కులకు విరుద్ధం కూడా.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చట్టపరంగా వ్యవహరించడం లేదని భావించినప్పుడు, తన అసంతృప్తిని తెలియజేయడానికి, ఒక ఫైలుని వెనక్కి పంపించటానికి, చర్య తీసుకోవాలని కోరటానికి అవకాశం ఉంది.

అయితే బిశ్వభూషణ్ హరిచందన్ తన పదవీకాలంలో పూర్తిగా రబ్బర్ స్టాంపులాగా వ్యవహరించారు. మూడు రాజధానుల బిల్లు శాసన మండలి ఆమోదం పొందకపోయినా, గుడ్డిగా సంతకం పెట్టారు. ప్రతిపక్షానికి చెందిన కార్యాలయం మీద అధికార పక్ష శ్రేణులు పట్టపగలే దాడి చేస్తే, మాటమాత్రం కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని మందలించలేదు.

బిజెపికి, వైసిపికి ఉన్న సంబంధాలని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇట్లా వ్యవహరించారని అనొచ్చు. అయితే, అవసరానికి మించి జగన్ ప్రభుత్వం చర్యలకి ఆయన సహకరించారని చెప్పకతప్పదు.

ఇక కొత్త గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కర్నాటకకి చెందిన వారు. ఆయన సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా లాస్ట్ మంత్ జనవరిలోనే రిటైరయ్యారు. వెంటనే ఆయనకి గవర్నర్ పదవి వచ్చిందంటే, దీనివెనక ఏదో ఉందని అనుకోక మానరు.

జస్టిస్ అబ్దుల్ నజీర్ అయోధ్య కేసుని విచారించిన సుప్రీం కోర్టు 5గురు సభ్యుల బెంచిలో ఒకరు. బాబరీ మసీదు స్థలంలో హిందూ దేవాలయ ఆనవాళ్లు ఉన్నాయన్న ఆర్కియాలాజికల్ సర్వే రిపోర్టుని అంగీకరిస్తూ తీర్పు చెప్పిన న్యాయమూర్తుల్లో ఆయన ఒకరు. తత్ఫలితంగానే ఇప్పుడు అయోధ్యలో రామాలయం నిర్మితమవుతోంది.

కేంద్రం కోరుకున్నట్టుగా ఈ తీర్పు రావడం వల్లే ఆయనకు వెంటనే పదవి దక్కిందనే విమర్శలు వచ్చే అవకాశం ఉంది.

అయితే సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన నేపధ్యం వల్ల ఏపి గవర్నర్ గా ఆయన చట్టపరంగా పాలన కొనసాగడంలో తన వంతు పాత్ర పోషిస్తారని ఆశిద్దాం.