వివేకానందరెడ్డి హత్యపై అన్ని ఆధారాలతో టీడీపీ విడుదల చేసిన జగనాసుర రక్తచరిత్ర పుస్తకం ద్వారా ప్రజలకు జగన్ క్రూరత్వం తెలిసిపోయిందని, అందుకే నిన్నటి నుంచి తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు.

ఆదివారం నాడు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు గురించి సవివరంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే..

“వివేకా హత్య కేసులో సూత్రధారి తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే, ప్రధాన పాత్రధారులు ఎంపీ అవినాష్ రెడ్డి, అతని కుటుంబసభ్యులని ప్రజలకు తెలిసిపోయింది. మేం విడుదల చేసిన జగనాసుర రక్త చరిత్ర పుస్తకం ద్వారా సాక్ష్యాధారాలతో సహా వివేకా హత్యలో జగన్, అవినాష్ రెడ్డిల క్రూరత్వం ప్రజలకు తెలిసిపోయింది. జగన్ ఇన్నాళ్లు ఆస్కార్ స్ధాయికి మించి నటించారు. ఇప్పుడు జనాలకు వాస్తవాలు తెలిసేసరికి తమ వాళ్లని మీడియా ముందుకు వదలి మాట్లాడిస్తున్నారు. ఎంత మందిని వదలినా, సాక్షిలో ఎన్ని తప్పుడు రాతలు రాసినా నిజాల్ని చెరపలేరు. పేర్ని నానికి తాడేపల్లి ప్యాలెస్ నాలుగు బిస్కెట్ల్ విసరగానే మచిలీపట్నం నుంచి తోక ఊపుకుంటూ వచ్చి వాళ్లిచ్చిన స్రిప్ట్ చదివి వెళ్లిపోతారు. 

“తీగ లాగితే డొంక కదిలినట్టు సీబీఐ అవినాష్ రెడ్డిని విచారించటంతో వివేకా హత్య కేసులో తాడేపల్లి గుట్టు అంతా బయటపడింది. కానీ అవినాష్ రెడ్డి అమాయకుడున్నట్టు జగన్ సాక్షిలో తప్పుడు రాతలు రాయించటం, వైసీపీ నేతల చేత అబద్దాలు మాట్లాడించటం సిగ్గుచేటు. అవినాష్ రెడ్డికి వివేకా హత్యతో సంబంధం లేకపోతే హత్యలో ప్రధాన నిందితులు శివశంకర్ రెడ్డి, ఈసీ సురేంద్రనాధ్ రెడ్డి, ఇతర వ్యక్తుల్ని వెంటబట్టి నాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ దగ్గరకు ఎందుకు వెళ్లాడు? నిందితుల్ని వెంటబెట్టుకుని అవినాష్ రెడ్డి డీజీపీని కలిసినట్టు సునీత సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొనలేదా? అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కర్ రెడ్డి నేడు ఎక్కడ దాక్కున్నాడు? గత నెల రోజులు కాలంలో విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు రెండు సార్లు పులివెందుల వెళ్తే వారికి ఎందుకు ముఖం చాటేశాడు?

వివేకానందరెడ్డి శరీరంపై గొడ్డలితో నరికిన గాయాలు కన్పిస్తున్నా సెక్షన్ 302 పెట్టకుండా సెక్షన్ 174 కింద కేసు ఎందుకు నమోదు చేశారు? సీఐ శంకరయ్య పై ఒత్తిడి తెచ్చి సెక్షన్ 174 అనుమాస్పద మృతి కింద ఎఫ్.ఐ.ఆర్ రాయించింది అవినాష్ రెడ్డి కాదా? శివశంకర్ రెడ్డిని సీబీఐ తీసుకెళ్తుంటే సీబీఐ కోర్టులో హాజరు పరిచిన సంధర్బంలో అవినాష్ రెడ్డి ఎందుకు వెళ్లారు? సీబీఐ అధికారులపై ఎందుకు దౌర్జన్యం చేశారు? తనకు ఈ కేసుతో సంబందం లేకపోతే ఎందుకు బెదిరించారు. సిట్ అధికారి అబిషేక్ మహంతిపై తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒత్తిడి తీసుకొచ్చి తన ఆప్తమిత్రుడు ఉదయ్ కుమార్ రెడ్డిని విచారణ కోసం కడప తీసుకెళ్తున్న సంధర్బంలో మార్గమద్యంలో విడుదల చేయించింది నిజం కాదా? వివేకా హత్యతో అవినాష్ రెడ్డికి సంబందం లేకుంటే ఆపని చేయాల్సిన గత్యంతరం దేనికి? ఆ ఒత్తిడి కారణంగాణే అభిషేక్ మహంతి లాంగ్ లీవ్ లో వెళ్లింది నిజం కాదా? ఈ ప్రశ్నలకు అవినాష్ రెడ్డి, వైసీపీ నేతలు సమాధానం చెప్పగలరా?

“వివేకానందరెడ్డి బామ్మర్ది ఉదయం 6.25 నిమిషాలకు ఫోన్ చేసి చెబితేనే వివేకానందరెడ్డి చనిపోయినట్టు తనకు తెలిసిందని అవినాష్ రెడ్డి పిట్ట కధలు చెబుతున్నారు. కానీ అవినాష్ రెడ్డి ఆప్తమిత్రుడు ఉదయ్ కుమార్ రెడ్డికి తెల్లవారుజామున మూడు, మూడున్నర ప్రాంతంలో వివేకానందరెడ్డి చనిపోయినట్టు తెలిసింది వాస్తవం కాదా? అలా చెప్పి హడావుడిగా బయటకి వెళ్లిపోయింది నిజం కాదా? ఇదే విషయాన్ని ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి తన పొరుగు వారికి చెప్పలేదా? వివేకా చనిపోయినట్టు నీ ఆప్తమిత్రుడికి తెల్లవారు జామున 3.గం కే తెలిస్తే నీకు మాత్రం 6.25 వరకు తెలియలేదంటే ఎవరు నమ్ముతారు అవినాష్ రెడ్డి? నీకు వివేకా హత్యకు సంబందించి ప్రతి నిమిషం ఏం జరిగిందో తెలుసు. జరుగుతున్న ప్రతి ఘటనను నువ్వు ఎప్పటికప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కి నవీన్ ద్వారా చేరవేసింది కూడా నిజం. ఇదే విషయాన్ని జగనాసుర రక్త చరిత్ర పుస్తకంలో ప్రస్తావిస్తే నీకు ఉలుకెందుకు?

“వివేకానందరెడ్డి హత్య జరిగినపుడు టీడీపీ అధికారంలో ఉంది కదా చంద్రబాబు ఏం చేశారని వైసీపీ నేతలంటున్నారు. చంద్రబాబు నాయుడు నిజయితీగా వ్యవహరించారు కాబట్టే అడిషనల్ డీజీ అమిత్ గార్గ్ తో వెంటనే సిట్ వేసి పాదర్శకంగా ధర్యాప్తు చేయించారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నపుడు సీబీఐ విచారణ కోరిన జగన్ అధికారంలోకి వచ్చాక సీబీఐ ఎంక్వైరీ వేయకపోగా అడిషనల్ డీజీ స్ధాయి ఉన్న సిట్ ను దిగజార్చి కేవలం ఒక ఎస్పీ స్ధాయి అధికారికి అప్పగించటం వెనుక ఉన్న దురుద్దేశం ఏంటి? వివేకా హత్య కేసులో జగన్ వైఖరి గమనించే డా. సునీత సీబీఐ విచారణ కోరుతూ 24.01. 2020న హైకోర్టులో పిటిషన్ వేశారు. జగన్ ఈ కేసు పట్ల ఎలా నిర్లక్ష్యంగా వ్యహరించారో ఆమె సిట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. మా అన్న ముఖ్యమంత్రి అయ్యాక కూడా సీబీఐ విచారణ కోరకపోవటం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొంది. జగన్ సీఎం అయిన రెండు వారాలకే అడిషనల్ డీజీ స్ధాయి ఉన్న సిట్ మార్చి ఎస్పీ స్ధాయి అధికారికి అప్పగించారని పిటిషన్ లో చెప్పింది. సిట్ ను ఈ విధంగా మూడు సార్లు మార్చి ముఖ్యమంత్రి అయి 2020 జులై 20 నాడు సీబీఐ విచారణ ప్రారంభించేవరకు 415 రోజుల పాటు చార్జ్ షీట్ వేయకుండా ఎవర్ని కాపాడేందుకు కాలయాపన చేశారో జవాబు చెప్పే దైర్యం దిక్కుమాలిన సాక్షి మీడియాకు, వైసీపీ నేతలకు ఉందా?

“సీబీఐ విచారణలో అవినాష్ రెడ్డి నోటి వెంట కృష్టమోహన్ రెడ్డి, నవీన్ పేర్లు రాకుంటే సీబీఐ వారికి నోటిసులు ఎందుకు ఇస్తుంది? గతంలో నవీన్ ఎవరో బయట ప్రపంచానికి తెలుసా? అన్ని తెలిసి కూడా ఇంకా వైసీపీ నేతలు ఎందుకు బుకాయిస్తారు? కడప ఎంపీ సీటు తనకు గానీ లేదా షర్మిల, విజయమ్మకు ఇవ్వాలి తప్ప అవినాష్ రెడ్డికి ఇవ్వొద్దని వివేకానందరెడ్డి పట్టుబట్టినట్టు ప్రజలకు తెలుసు. కానీ అవినాష్ రెడ్డి అప్పటికే కడప ఎంపీగా వివేకాందరెడ్డిని జమ్మలమడుగు ఇన్ చార్జిగా జగన్ ప్రకటించారని సాక్షిలో రాశారు. కానీ కింద మరో పేరాలో మాత్రం కడప లోక్ సభ నియోజకవర్గ ఇన్ చార్జ్ వివేకానందరెడ్డి అని రాశారు. పొంతలేని అబద్దాలు చెబుతూ బుకాయించటం దివాళుకోరుతనం. వివేకా హత్య 15వ తేదీ జరిగితే 16 వ తేదీ సాయంత్రం అవినాష్ రెడ్డిని ఎంపీ అభ్యర్దిగా ప్రకటించారు. ఈ విషయం పలు జాతీయ పత్రికల్లో సైతం వచ్చింది. ఇది నిజం కాదని చెప్పే ధైర్యం ఉందా?

“వివేకానందరెడ్డిని చంపి అడ్డు తొలగించుకుని ఎంపీగా ప్రకటించుకున్నది వాస్తవం కాదా? ఇంకా ఏమీ ఎరుగనట్టు నటిస్తారా? వివేకా పేరుతో రాసిన లేఖ ముందే బహిర్గతం అయ్యింటే మృతదేహం దగ్గరకు ఎవరూ వెళ్లేవారు కాదు కదా అని రాశారు. కళ్లెదుట వివేకానంద రెడ్డి శరీరంపై గొడ్డలి పోట్లు, గాయాలు కన్సిస్తుంటే సిగ్గులేకుండా ముందే లెటర్ కనిపించ లేదు కాబట్టి గుండెపోటు అనుకున్నాం అని రాశారు. ఇలాంటి తప్పుడు రాతలు రాయటానికి సిగ్గుగా లేదా? ప్రజలు అమాయకుల్లా కన్పిస్తున్నారా? సీఐ శంకరయ్యకు మానవతావాధంతో సహజ న్యాయసూత్రాల ప్రకారం పోస్టింగ్ ఇచ్చారని చెబుతున్నారు. వాస్తవం ఏంటంటే హత్య జరిగిన ప్రదేశంలో అవినాష్ రెడ్డి అతని బందువులు సాక్ష్యాధారాలు ద్వంసం చేసిన విషయం సీబీఐకి 28.09.2021న సీఐ శంకరయ్య ఇచ్చిన వాంగ్మూలాన్ని 30.09.2021 న మేజిస్ట్రేట్ ముందు అంగీకరించేందుకు శంకరయ్య సిద్దపడ్డాడు.

“కానీ తర్వాత తాడేపల్లి ప్యాలెస్ ప్రలోభాలకు లొంగి మేజిస్ట్రేట్ ముందుకు వెళ్లకుండా అతను ప్లేటు ఫిరాయించాడు. ప్లేటు ఫిరాయించిన వారానికే 2021 అక్టోబరు 6 న తిరిగి శంకరయ్యకు పోస్టింగ్ ఇచ్చారు. శంకరయ్య ప్లేటు పిరాయించేవరకు అతని కుటుంబ పోషణ, సహజ న్యాయసూత్రాలు జగన్ కి గుర్తుకు రాలేదా? చంద్రబాబు ప్రభుత్వంపై నమ్మకం లేకనే నాడు జగన్ సీబీఐ విచారణ కోరారని, తర్వాత తమ ప్రభుత్వం వచ్చాక పోలీసులపై నమ్మకంతోనే సీబీబీ విచారణ వద్దన్నారని, చంద్రబాబు రాష్ట్రంలో సీబీఐని నిషేధించారని చెబుతున్నారు. కానీ అసలు ఏ రాష్ట్రం కూడా సీబీఐని నిషేధించలేదు. కేవలం ఏదైనా కేసు విచారణ చేసే ముందు తమకు సమాచారం ఇవ్వండని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతాయి తప్ప సీబీఐని నిషేధించలేవు. మీరు సీబీఐకి సహకరిస్తే కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? సీబీఐకి సహకరించపోగా ఆ అధికారులపై తప్పుడు కేసులు పెట్టారు. ఇవన్నీ ప్రజలకు తెలియదా? ఈ హత్యలో జగన్ ముఠా పాత్ర లేకపోతే హత్య జరిగిన 15 రోజులకే దీనిపై పోలీసులు సహా ఎవరూ మాట్లాడకూదంటూ మార్చి 30న హైకోర్టు నుంచి జగన్ గ్యాగ్ ఆర్డర్ ఎందుకు తెచ్చారు?

“హత్య జరిగాక చంద్రబాబు 75 రోజులు అధికారంలో ఉన్నా చార్జ్ షీట్ ఎందుకు వేయలేకపోయారని అడుగుతున్నారు. మరి జగన్ ముఖ్యమంత్రి అయి 2020 జులై 20న సీబీఐ విచారణ ప్రారంభించేవరకు 415 రోజుల పాటు చార్జ్ షీట్ ఎందుకు వేయలేదు? మూడు సార్లు సిట్ ఎందుకు మార్చారు? ఈ పరిణామాలన్నీ గమనించే డా. సునీత 2020 జనవరి 1 న సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది. కానీ జగన్ మాత్రం ప్రతిపక్షంలో ఉన్నపుడు వేసిన సీబీఐ విచారణ అవసరం లేదని 2020 జులై 6 న వెనక్కి తీసుకున్నారు. అసలు అన్న స్దానంలో ఉన్న వ్యక్తి ఇలా చేస్తారా? వైసీపీ నేతలు సంస్కారం గురించి మాట్లాడుతున్నారు. మరి జగన్ ఒక మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా? నవీన్ భారతి రెడ్డి, జగన్ ల తో కలిసి ఉన్న ఫోటోను పుస్తకంలో ప్రచురిస్తే తప్పేముంది? మేం వైసీపీ నేతల్లా మహిళల్ని కించపరలేదు కదా? భువనేశ్వరి గారిని అసభ్యంగా మాట్లాడిన వారిని మాట్లాడించిన వారిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తేలేదు. వివేకా హత్య కేసులో అన్నీ వేళ్లు జగన్, అవినాష్ రెడ్డిల వైపే చూపిస్తున్నాయి. సీబీఐ విచారణలో ఇంకా అన్ని నిజాలు ప్రజలకు తెలుస్తాయని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు.