కందుల రమేష్

ఇన్నాల్టికి అసలు విషయాన్ని చెప్పేశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఉండవు. ఒక్కటే రాజధాని ఉంటుంది. అది విశాఖపట్నం. 

ఇప్పటికి వైసిపి ప్రభుత్వం ఈ మాట ఓపెన్ గా చెప్పింది. మూడు రాజధానుల డ్రామాకి అధికారికంగా తెరదించింది.  ఈ విషయాన్ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి స్వయంగా ప్రకటించారు.

వైసిపి వాళ్లు ఇన్నాళ్లూ ఈ డ్రామా ఎందుకు వేశారు? ఇప్పుడెందుకు అసలు విషయాన్ని బయటపెట్టారు? మొదటి నుంచి జగన్ ప్రభుత్వం అజెండా ఇదేనా? తప్పనిసరిపరిస్థితుల్లో ఇప్పుడు బయటపడ్డారా?

అవును. అదెలాగో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ ఒట్టిమాట, విశాఖపట్నమే మా బాట, అని స్పష్టం చేశారు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బెంగుళూరులో నిర్వహించిన రోడ్ షో లో బుగ్గన ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆయన ఏమన్నారో ఒక్కసారి వినండి.


ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులని miscommunicate అయిందట.
పరిపాలన అంతా విశాఖపట్నం నుంచే సాగుతుందట. ఎంత straight face తో, అమాయకంగా బుగ్గన నటిస్తున్నాడో చూడండి. మూడు రాజధానులని miscommunicate అయిందా? Miscommunicate అయిందా, లేక బుగ్గన గారు, ఆయన పార్టీ నాయకులు గడిచిన మూడేళ్ల నుంచి  కావాలని miscommunicate చేశారా?

వైసిపి చెబుతున్న మూడు రాజధానుల ప్రతిపాదన జనాన్ని mislead చేయటానికేనని, వాళ్ల అసలు ఉద్దేశం అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నానికి తరలించటానికేనని బయటప్రపంచానికి మొదటినుంచి స్పష్టంగా తెలుసు. వికేంద్రీకరణ అనేది మసిపూసి మారేడుకాయ చేయటానికి వారు చెప్పిన తియ్యని అబద్దమేనని కూడా ఆలోచనాపరులకి తెలుసు.

***

రెండేళ్ల కిందట ఆంధ్రజ్యోతిలో రాసిన ఒక వ్యాసంలో నేను ఈ విషయం చెప్పాను. ముచ్చటకే మూడు – అసలు విశాఖే శీర్షికతో 2020 ఫిబ్రవరిలో రాసిన ఆర్టికల్ లో ఇదే విషయాన్ని వివరించాను. అలాగే ఇటీవల నేను ప్రచురించిన అమరావతి వివాదాలు – వాస్తవాలు పుస్తకంలో ఇదే విషయాన్ని మరింత లోతుగా చర్చించాను. ఇందులో నేను తీవ్రంగా పరిశోధించి కనిపెట్టింది ఏమీ లేదు. మొదటినుంచి వాళ్ల ఆలోచన ఇదేనని అధికార పార్టీ వ్యవహార శైలిని పరిశీలిస్తున్నవారికి ఎవరికైనా అర్థమయ్యే విషయం ఇది.

ఏది ఏమైనా, జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ పార్టీ అంత గడసరి రాజకీయ పార్టీ మరొకటి ఉండదు. అమరావతే రాజధాని అని ఎన్నికల ముందు కృష్ణా, గుంటూరు జిల్లాల వాళ్లకి చెప్పి మోసగించారు. ఆ తర్వాత దక్షిణాప్రికా విధానంలో మూడు రాజధానులని, రాయలసీమకి కూడా రాజధాని ఉంటుందని చెప్పి అక్కడి ప్రజలకి అరచేతిలో స్వర్గం చూపించారు. విశాఖపట్నం మూడు రాజధానుల్లో ఒకటన్నారు. ఇప్పుడేమో,  కాదు, కాదు, విశాఖే పరిపాలనా కేంద్రం, కర్నూలులో ఒక్క హైకోర్టు మాత్రమే ఉంటుందని బుగ్గనే స్వయంగా చెబుతున్నాడు. అమరావతి అని పేరు కూడా ఎత్తకుండా, గుంటూరులో ఒక అసెంబ్లీ సెషన్ ఉంటుందని కూడా బుగ్గన అంటున్నాడు.

దీంతోటి వైసిపి ప్రభుత్వం అసలు రంగు బయటపడింది. వైసిపి రంగు ఒక్కటే కాదు. మేధావుల పేరుతోటి, వ్యాఖ్యాతల పేరుతోటి, ఎనలిస్టుల పేరుతోటి మూడు రాజధానుల ప్రతిపాదనతో అభివృద్ధి ఎట్లా పరుగులు తీస్తుందో ఉపన్యాసాలు ఇచ్చిన వైసిపి భజనపరుల అసలు రంగుకూడా దీంతో బయటపడింది.

ఇంతకీ ఇప్పటికిప్పుడు బుగ్గన ఎందుకని పూర్తిగా బయటపడాల్సి వచ్చింది? విశాఖలో మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ జరుగుతోంది. దీనికి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలని రప్పించాలని జగన్ ప్రభుత్వం తలపెట్టింది. అయితే అసలు మీ రాజధాని ఎక్కడ అని చాలామంది ఇండస్ట్రియలిస్టులు అడుగుతున్నారట. ఆ సందర్భంగానే ఇక తప్పదని భావించి, విశాఖే రాజధాని అని చెప్పేసేయండి అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంత్రులని ఆదేశించారు. ఆ విధంగా ఈ నాటకానికి తెరదించాల్సి వచ్చింది. వీలైతే మరికొద్దికాలం పాటు ఈ మూడు రాజధానుల డ్రామాని నడిపేవారేమో, కాని పరిస్థితులు ఇలా వచ్చాయి.

ఇప్పుడు గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌ ఫ్లాపయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోటానికి తప్పనిసరి పరిస్థితుల్లో మూడు రాజధానుల బుడగని బుగ్గనగారు ఊదేయాల్సి వచ్చింది.

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. విశాఖపట్నమే రాజధాని అని ఇంత స్పష్టంగా బుగ్గన గారు ప్రకటించిన  తర్వాత కూడా రాయలసీమ మేధావులెవరూ దీనిమీద భారీఎత్తున నిరసన తెలుపుతారని అనుకోవద్దు. ఎందుకంటే, అక్కడ మేధావుల్ని అమరావతిని వ్యతిరేకించటానికే పెట్టుకున్నారు. విశాఖే రాజధాని అంటే వాళ్లెవరూ ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడరు. అమరావతి మీద విషం చల్లుతారు గాని, విశాఖ రాజధాని అంటే రాయలసీమ మేధావుల ఫోరం పేరుతో మాట్లాడే మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి వంటివారు నోరు కుట్టేసుకుంటారు.

మొత్తానికి మూడు రాజధానులంటూ మూడేళ్ల పాటు అబద్ధాల చెప్పిన తర్వాత, అసలు విషయానికి వచ్చారు. రాష్ట్ర ప్రజలకి ఇప్పటికైనా అర్థం కావాలి, ఎందుకు అమరావతిని వద్దనుకుంటున్నారో, విశాఖ మీద ఎందుకు అంత అలవిమాలిన ప్రేమో. అమరావతిలో దోచుకోవటానికి ఏమీ లేదు, విశాఖలో భూములు, ప్రకృతి వనరులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. రాజధాని పేరుతో అక్కడ తిష్ట వేసి, యధేచ్చగా దోపిడి చేసుకోవచ్చనే దురుద్దేశం తప్ప విశాఖని, ఉత్తరాంధ్రని కూడా ఈ ప్రభుత్వం ఉద్ధరించేది ఏమీ లేదు.