రాష్ట్రప్రభుత్వ అప్పులు, ఆర్థికపరిస్థితిపై వైసిపి ప్రభుత్వం అబద్ధాలతో బుకాయిస్తూనే ఉంది. ఇందుకోసం సలహాదారులు, ఉన్నతాధికారులని కూడా ఉపయోగించుకుంటోంది. తాజాగా ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ చేత విలేకరుల సమావేశం పెట్టించి, అదే తప్పుడు సమాచారాన్ని మళ్లీ చెప్పించింది. ఈ దువ్వూరి కృష్ణ అధికారి కాదు. ఆయన వైఎస్ కి సలహాదారుగా ఉన్న దివంగత డి. సోమయాజులు కొడుకు. ఈ కృష్ణ చార్టర్డ్ అకౌంటెంట్. అధికారంలోకి రాగానే జగన్ ఈయనకు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి పదవిని కట్టబెట్టాడు.

రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చాలా తక్కువని దువ్వూరి కృష్ణ చెబుతున్న లెక్కలని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీ.వీ.రెడ్డి చీల్చిచెండాడారు. టీడీపీప్రభుత్వం చేసిన అప్పుల్లో కార్పొరేషన్లు, బ్యాంకులరుణాలు, గ్యారంటీ-నాన్ గ్యారంటీ రుణాలు అన్నీకలిపిన జగన్ సర్కా ర్, తానుచేసిన అప్పుల్లోమాత్రం కేవలం ఆర్బీఐ అనుమతితో చేసిన అప్పుల్నే ఎలా చూపుతుందని జీ.వీ.రెడ్డి ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం చేసిన అప్పులు, చెబుతున్న అప్పుల గురించి పలు ప్రశ్నలు లేవనెత్తారు:

  • 2019 జూలైలో ఏపీప్రభుత్వం విడుదలచేసిన శ్వేతపత్రంలో 2019మార్చినాటికి (టీడీపీప్రభుత్వం దిగిపోయేనాటికి) రాష్ట్రఅప్పులు రూ.3,62,375 కోట్లని చెప్పింది.
  •  రూ.3,62,375 కోట్ల అప్పులో 2014 మార్చికి ముందున్న అప్పుతాలూకా సొమ్ముకూడా ఉంది. దానితో పాటు, 2014 నుంచి 2019 మార్చివరకు టీడీపీప్రభుత్వం చేసిన అప్పుని కూడా కలిపారు.
  • టీడీపీప్రభుత్వం ఆర్బీఐద్వారా తెచ్చినఅప్పులు, పవర్ సెక్టార్, సివిల్ సప్లైస్ విభాగానికి, కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన సొమ్ముని కూడా వైసీపీప్రభుత్వం శ్వేతపత్రంలో చూపింది.
  • టీడీపీప్రభుత్వం చేసిన అప్పుల్లో అన్నిరుణాలు కలిపిన వైసీపీప్రభుత్వం, ఇప్పుడు తాను చేసిన అప్పుల్లో మాత్రం కార్పొరేషన్ రుణాలతో తమకు సంబంధంలేదని ఎలా చెబుతుంది?
  • వైసీపీప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన డబ్బులు, పెండింగ్ బిల్లులు అప్పుల్లో కలపకూడదంటున్న ప్రభుత్వాధికారులు, టీడీపీప్రభుత్వానికి మాత్రం అవన్నీ ఎలా అంటగట్టారో సమాధానం చెప్పాలి.
  • సాక్షిమీడియా కేవలం ఆర్బీఐ ద్వారా చేసిన అప్పులే ప్రభుత్వ అప్పులుగా చూపుతూ, తప్పుడుప్రచారం చేస్తోంది.
  • ఆర్బీఐద్వారా టీడీపీప్రభుత్వం 2014-19 మధ్యన రూ.1,58,000కోట్లు అప్పులు తెస్తే, తమప్రభుత్వం మూడున్నరేళ్లలో కేవలం రూ.1,70,640 కోట్లు మాత్రమే తెచ్చినట్టు చెప్పుకొస్తున్నారు.
  • కానీ ఆర్బీఐ నివేదికలో మాత్రం వైసీపీప్రభుత్వం రూ.2,03,598కోట్లు అప్పులు తెచ్చినట్టు ఉంది. దువ్వూరికృష్ణ ఆర్బీఐ నివేదికను కూడా తొక్కిపెట్టి కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు.
  • కార్పొరేషన్లద్వారా రూ.94,928 కోట్లు అప్పులు తెచ్చిన జగన్ ప్రభుత్వం, వాటితో తమకు సంబంధంలేదని ఎలా చెబుతుంది? సంబంధంలేకుంటే ప్రభుత్వఆస్తుల్ని తాకట్టుపెట్టి, ప్రభుత్వగ్యారంటీతో అప్పులు ఎలా తెచ్చారు?
  • ఎఫ్.ఆర్.బీ.ఎం యాక్ట్ ప్రకారం ప్రభుత్వం తీసుకునేరుణాలన్నీ ప్రభుత్వ రుణాల కిందకే వస్తాయని దువ్వూరికి తెలియదా?
  • 2022-23 ఆర్థికసంవత్సరంలో మొదటి పదినెలల్లోనే ప్రభుత్వం రూ.81,900 కోట్ల అప్పుచేసింది. ఎఫ్.ఆర్.బీ.ఎం. పరిధిదాటి రూ.32 వేల కోట్ల అప్పుచేసింది.
  • ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి రూ.10 వేల కోట్లు, మారిటైమ్ బోర్డు నుంచి రూ.5 వేల కోట్లు, ప్రభుత్వం వివిధ సంస్థలకు పెండింగ్ పెట్టిన బకాయిలు రూ.27,384 కోట్లు, కాంట్రాక్టర్లకు, ఇతరత్రా సప్లయర్స్ కుచెల్లించాల్సింది రూ.80 వేల కోట్లు, సివిల్ సప్లయిస్ శాఖద్వారా రూ.31,500 కోట్లు, లిక్కర్ బాండ్లు తాకట్టుపెట్టి రూ.8,305 కోట్ల రుణాలు తీసుకున్నారు. ఇవన్నీ ప్రభుత్వ అప్పులుకావా? ఇవేవీ అప్పులలెక్కల్లో కలపకుండా కట్టుకథలు చెబుతారా?
  • వైసీపీప్రభుత్వం తమకు బకాయిలుఉందని, మూడేళ్లనుంచి రూపాయిఇవ్వడంలేదని బాధితులంతా 2 లక్షల 10 వేలకు పైగా రిట్ పిటిషన్లు హైకోర్టులో ఫైల్ చేశారు.
  • వాటిలో కొన్నింటిని విచారించిన న్యాయస్థానం బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తే, 11 వేల పిటిషన్లకు సంబంధించి జగన్ సర్కార్ కోర్టు ఆదేశాలను ధిక్కరించింది. న్యాయస్థానం డబ్బులివ్వమన్నా ఇవ్వకుండా కాంట్రాక్టర్లను వేధిస్తోంది.
  • ప్రభుత్వఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులకు చెల్లించాల్సిన బకాయిలు ఇంకా ఉన్నాయి. అవన్నీ దాదాపు రూ.27,150 కోట్లకు పైగా ఉన్నాయి.
  • ఎన్టీఆర్ ఆరోగ్యవిశ్వవిద్యాలయం, ఇతరసంస్థలనుంచి తీసుకున్న ఫిక్స్ డ్ డిపాజిట్ల సంగతేమిటి? వాటిని చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా?
  • కరోనాను బూచిగా చూపి, కేంద్రంనుంచి అదనంగా రూ.20 వేల కోట్లు అప్పుతెచ్చిన జగన్ సర్కార్ వాటిని కూడా కాజేసింది. ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎక్కువ గ్రాంట్లు పొందారు.
  • కరోనా వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం పావలా అయితే, కేంద్రం, ఇతరసంస్థల నుంచి రెండు రూపాయల లబ్ధిపొందింది. అవన్నీ చాలక ప్రజలపై విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ, చమురుధరలుపెంచి, ఇతరత్రా పన్నులతో మోయలేని భారం మోపారు.
  • ప్రభుత్వానికి ఆర్థికఇబ్బందులు లేకుంటే సకాలంలో జీతాలు ఎందుకు ఇవ్వడంలేదు? డీఏలు, టీఏలు, పింఛన్లు ఎందుకు ఇవ్వడంలేదు? సీ.పీ.ఎస్ ఎందుకు రద్దుచేయడంలేదు?
  • పొద్దునలేస్తే అప్పులకోసం బ్యాంకుల్ని, కేంద్రాన్ని, ఆర్థికసంస్థల్ని దేబిరిస్తూ, రాష్ట్రంలో అప్పులేలేవని, అప్పులన్నీ గతప్రభుత్వం చేసినవేనని కట్టుకథలు చెబుతారా?

రాష్ట్ర అప్పులు రూ.10 లక్షల కోట్లకు పైమాటేనని, తాముచెప్పే అంశాలు, అంకెలపై ప్రభుత్వానికి చిత్తశుధ్ధి ఉంటే తక్షణమే అప్పులపై వాస్తవాలతో బహిరంగచర్చకు రావాలని వైసిపి ప్రభుత్వానికి  జీ.వీ.రెడ్డి సవాల్ విసిరారు.