అమరావతి విషయంలో అధికార పార్టీ అగచాట్లు మామూలుగా లేవు, పాపం. మూడేళ్ల నుంచి నానా తిప్పలూ పడ్డా మళ్లీ విషయం మొదటికే వచ్చింది.
వైసిపి ఎంపి వి విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకి బుధవారం నాడు కేంద్రం ఇచ్చిన సమాధానంతో మరోసారి వైసిపి ప్రభుత్వానికి గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఏపి విభజన చట్టం ప్రకారమే అమరావతి ఏర్పడిందని, 3 రాజధానుల వ్యవహారం గురించి రాష్ట్రం తమను సంప్రదించలేదని కేంద్రం స్పష్టం చేసింది.
రాజధానులని మార్చుకునే హక్కు రాష్ట్రాలకు ఉంటుందని కేంద్రం చెబుతుందని ఆశించిన విజయసాయి రెడ్డికి ఆశాభంగమే మిగిలింది.
రాజధానిని మార్చడం చిటికెలో పని అని అనుకున్నాడు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిననాడు. అసెంబ్లీలో మందబలం ఉంది, ఇక మనకి తిరుగేం ఉంటుంది అని అనుకున్నాడు.
ఆ ప్రకారం 2020 జూన్ లో – అంటే 2 సంవత్సరాల 7 నెలల క్రితం – మూడు రాజధానుల చట్టం చేశాడు. ఆ చట్టాన్ని అడ్డదిడ్డంగా, శాసన మండలి ఆమోదం లేకుండానే పంపించినా, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కళ్లుమూసుకొని సంతకం పెట్టేశారు. ఇక వైజాగ్ వెళ్లిపోవటమే తరువాయి అని జగన్ సామాను సర్దుకోబోయాడు.
ఇంతలో హైకోర్టు స్టే ఇచ్చింది. చెప్పేవరకు రాజధాని ఆఫీసులేవీ మార్చడం కుదరదంది. జగన్ గారు తలపట్టుకున్నారు. ఆ విధంగా 15 నెలలు గడిచాయి.
ఇక ఇవాళో రేపో తీర్పు ఇస్తారనగా, జగన్ చెవిలో ఎవరో ఏదో ఊదారు. ఇప్పుడు చేసిన 3 రాజధానుల చట్టం న్యాయస్థానంలో నిలబడదు. అందుకని కోర్టు తీర్పు రాకముందే ఆ చట్టాన్ని రద్దు చేసుకుంటే మంచిది అని సలహా ఇచ్చారు. క్షణం ఆలస్యం చేయకుండా, హడావుడిగా 3 రాజధానుల చట్టాన్ని జగన్ రద్దు చేశారు.
మేం రద్దు చేశాం, కాబట్టి మీరు ఈ కేసులో ఇక తీర్పు ఇవ్వద్దు అని కోర్టుకి చెప్పారు. అయినా హైకోర్టు వినలేదు. అసలు రాజధానిని మార్చే అధికారం మీకు లేదు. చెప్పిన ప్రకారం, రాజధాని నిర్మాణాన్ని అమరావతిలో పూర్తి చేయాల్సిందే అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పింది.
మళ్లీ తెల్లముఖం వెయ్యడం జగన్ వంతయింది.
ఇది అన్యాయం, అక్రమం అని అసెంబ్లీలో అధికార పక్షం ఒక్కళ్లే కూర్చొని తిట్టుకున్నారు. అంతకుమించి ఏం చేయాలో తోచలేదు. ఆర్నెల్లు గడిచాయి. అమరావతిలో నిర్మాణాలు ఒక కొలిక్కి తీసుకురాకపోతే కోర్టు ధిక్కారం వచ్చేట్టుంది. అప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్లారు అప్పీలుతో. అర్జంటుగా మా కేసు వినండి. మేం విశాఖ వెళ్లిపోవాలి అని వేడుకున్నారు.అంత తొందరేం లేదు, మేం నెమ్మదిగానే వింటాం ఈ కేసుని అని సుప్రీం చెప్పింది.
వ్యవహారం మళ్లీ మొదటికే వచ్చింది.
Centre’s statement on Amaravati
అయినా అధికార పార్టీ నాయకులు పట్టువదలని విక్రమార్కులు. ఇదిగో మేం వెళ్లిపోతున్నాం విశాఖ, అని చెప్పి మూడేళ్లయింది. అప్పటి నుంచి క్రమం తప్పకుండా ముఖ్యమంత్రీ, ఆయన అనూయాయులు విసుగు విరామం లేకుండా ఇదిగో వెళ్తున్నాం, అదిగో వెళ్తున్నాం అని బెదిరిస్తూనే ఉన్నారు.
ఈ బ్యాండు మేళం పని బొత్స, గుడివాడ అమర్నాధ్, ధర్మాన ప్రసాదరావులకి అప్పగించారు. ఎందుకంటే పాపం, రాయలసీమ వైసిపి నాయకులు రోజూ వైజాగ్, వైజాగ్ అంటే అక్కడి జనానికి నచ్చకపోవచ్చు గదా..
ఉత్తరాంధ్ర అధికార పార్టీ నాయకులు ఈ డ్యూటిని బాగానే చేస్తున్నారు. ఒకసారి కోర్టులతో సంబంధం లేదు అంటారు. మరోసారి, సుప్రీం కోర్టులో మాకు అనుకూలంగా తీర్పు రాబోతోంది అంటారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో చెప్పేశారు, ఇక మేం వెళ్లిపోతున్నాం అంటారు.
మరోవైపు విజయసాయిరెడ్డిగారు పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెడతారు. అసలు రాష్ట్ర రాజధాని విషయంలో కేంద్రానికి అధికారం లేదని ఒక సారి వాదిస్తారు. అవసరమైతే పార్లమెంటులో బిల్లు ఆమోదం చేయించుకుంటాం అని ఇంకోసారి చెబుతారు.
రుషికొండలో ఆఫీసు రెడీ అవుతోందని ఒకసారి లీకులిస్తారు. బీచ్ రోడ్డులో సిఎం ఇంటి కోసం వెతుకుతున్నాం అని చెబుతారు. సిఎం ఎక్కడుంటే అదే రాజధాని అని మధ్యమధ్యలో ప్రకటిస్తారు.
రాజధానిని నిర్ణయించుకునే హక్కు రాష్ట్రానికి లేకపోవడం అన్యాయం అని అదే విజయసాయిరెడ్డి మళ్లీ పార్లమెంటులో ఆక్రోశిస్తారు.
ఇంతకీ రాజధానిని మార్చే అధికారం తమకు ఉందనే భావంతో వైసిపి ప్రభుత్వం ఉందా? ఉంటే, మరి కోర్టుల చుట్టూ తిరగడమెందుకు? పార్లమెంటులో ప్రశ్నలెందుకు?
బేతాళ కథల్లో లాగా, తల వెయ్యి వక్కలైనా, ఇందులో నిజమేదో వైసిపిలో ఎవరూ తెలిసీ చెప్పరు.