దివంగత ఎన్. టి. రామారావు చిత్రంతో వంద రూపాయల వెండి నాణెం విడుదలకు రిజర్వు బ్యాంకు ఆమోదం తెలిపింది. దీనిమీద ఏపి బిజెపి నాయకుడు విష్టువర్థనరెడ్డి చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. “ఎన్టీఆర్ గారి శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు, జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రత్యేక విజ్నప్తి మేరకు వంద రూపాయల కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ ముద్రణకు భారత ప్రభుత్వ నిర్ణయం,” అని ఆయన ట్వీట్ చేశారు.
అన్ని పత్రికల్లో వచ్చిన వార్త ప్రకారం, బిజెపిలోనే ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి చొరవతో ఈ నిర్ణయం జరిగింది. ఎన్టీఆర్ చిత్రంతో నాణెంతో పాటు ఆయన జీవిత చరిత్రలోని ముఖ్యాంశాలను చిన్న పుస్తకంలా 4 పేజీల్లో ముద్రించి కొనుగోలుదారులకు అందజేయాలని కేంద్రం నిర్ణయించిందని, ఈ అంశంపై ఆర్బీఐ అధికారులు బుధవారం పురందేశ్వరిని కలిసి వివరాలు సేకరించాని కూడా వార్తలు వచ్చాయి. దీని తాలూకు ఫొటోలు కూడా వచ్చాయి.
అలాంటప్పుడు విష్టువర్థనరెడ్డి ఇలాంటి ట్వీట్ ఎందుకు చేసినట్టు? జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించినట్టు? క్రెడిట్ జూనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాలనే తాపత్రయం ఎందుకు? ఇలాంటి చాలా ప్రశ్నలు ఎవరికైనా వస్తాయి.
ఆంధ్ర బిజెపిలో సోము వీర్రాజు, విష్టువర్థనరెడ్డి, జివిఎల్ నరసింహారావులది ఒక గ్రూపు. వీళ్లంతా టిడిపికి వ్యతిరేకంగా, అధికార వైసిపికి అనుకూలంగా ఆంధ్ర బిజెపిని నడిపించడానికి శాయశక్తులా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇందుకు కేంద్ర బిజెపి ఆశీస్సులు ఉన్నాయా లేవా అనే అంశం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఏది ఏమైనా, ఎన్టీఆర్ నాణెం ముద్రణకి సంబంధించిన క్రెడిట్ ని పురందేశ్వరికి కాకుండా, జూనియర్ ఎన్టీఆర్ కి ఆపాదించాలనే విష్టువర్థనరెడ్డి ప్రయత్నం వల్ల ఒక విషయం మాత్రం అర్థమవుతోంది. అటు టిడిపికి, ఇటు దగ్గుబాటి కుటుంబానికి దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ని తమవైపు లాక్కోవాలనే ప్రయత్నం ఇందులో కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆ మధ్య అమిత్ షా తో కూడా జూనియర్ ఎన్టీఆర్ ని కలిపించారు.
జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇంతవరకు తన రాజకీయ ఆలోచనలకి సంబంధించి బయటపడలేదు.