పరిశీలకుడు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ స్థాయిలో దిగజారాయో తెలుసుకోవటానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడినని చెప్పుకునే కె ఏ పాల్ విచిత్ర కార్యకలాపాలు, అతని ప్రెస్ మీట్లు ఒక కొలమానం. అతను ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, ఎవరికోసం మాట్లాడతాడో అర్థం కాక జనం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.

ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన పాల్, ఈ మధ్యకాలంలో ఏపిలో ప్రతిపక్షాల మీద, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల మీద పడ్డాడు. రకరకాల చిల్లర విమర్శలు చేస్తున్నాడు. ఏ ఉద్దేశంతో ఈ విమర్శలు చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు.

తాజాగా జరిపిన ప్రెస్ మీట్లో, పాల్ మాటలు చూడండి:

“జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసేంది వారాహి యాత్ర కాదు నారాహి యాత్ర.  పవన్ విశాఖలో నారాహి యాత్రను ఉపసంహరించుకోవాలి. పవన్ కళ్యాణ్ ను చూసి మోడీ మొహం చాటేశారు. పవన్ మీద ఏమైనా ఇల్లీగల్ కేసులు ఉన్నాయా?  విభజన హామీల కోసం కేంద్రాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు? దశావతారంలాగా పవన్ కళ్యాణ్ పది పార్టీలు మార్చారు.”

ఇంతవరకు బాగానే ఉంది. కాని చివరికి పాల్ ఏమన్నాడో చూడండి:

“పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలి. ప్రజాశాంతి పార్టీ తరపున సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రకటిస్తాను.”  

పవన్ మీద విమర్శలు గుప్పించి, మళ్లీ పవన్ నాతో చేరితో సిఎంని చేస్తానని అనడం ఏంటో అర్థం గాక జుట్టు పీక్కోవాల్సిందే. చంద్రబాబు మీద కూడా పాల్ విమర్శలు చేశాడు:

“వారాహి యాత్రకు వెళ్తే 500 ఇస్తున్నారు. చంద్రబాబు యాత్రకు వెళ్తే 1000 రూపాయలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ పెద్ద స్టార్ అయినా పవన్ సభలకు జనాలు రావడం లేదు. చంద్రబాబు పులివెందుల వెళ్లి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేను పులిని అని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు పులి కాదు పిల్లి. కేసీఆర్ తరిమేస్తే భయపడి అమరావతి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. లోకేష్ పప్పను సీఎం చేయడమే పవన్ కళ్యాణ్ లక్ష్యంగా పెట్టుకున్నాడు.” 

ఇంకా గమ్మత్తేంటంటే, పవన్ యాత్ర బొమ్మలు వేసి, ఆయన ‘పప్పుకే ఓటు’ అని లోకేష్ కోసం యాత్ర చేస్తున్నారని అర్థం వచ్చేలాగా ఫ్లెక్సీ పెట్టి మీడియా సమావేశాన్ని పాల్ నిర్వహించడం. ఇది చూడగానే వైసిపి ప్రోద్భలంతో పాల్ ఈ తమాషా చేస్తున్నాడని ఎవరైనా అనుకుంటారు.

ఇంతకీ జగన్ తరఫున, వైసిపి తరఫున పాల్ ఈ చిల్లర విమర్శలకి, దాడులకి పాల్పడుతున్నాడో లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. జగన్ బావ బ్రదర్ అనిల్ కుమార్ దూరం అయిన తర్వాత, పాల్ ని జగన్ ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. ఏది ఏమైనా పాల్ పిచ్చిప్రేలాపనల తర్వాత ఏ రాజకీయ పార్టీ అయినా అతన్ని దగ్గరికి తీయటానికి భయపడాల్సిందే. 

ఆ మధ్య కాలంలో మాజీ సిబిఐ అధికారి వివి లక్ష్మీనారాయణని పక్కన కూర్చోబెట్టుకొని, పాల్ మాట్లాడటం కూడా ఆశ్చర్యపరిచింది. పాల్ తో కలిసి ప్రెస్ మీట్లో కూర్చోటానికి లక్ష్మీనారాయణ ఎందుకు అంగీకరించారో తెలియదు.