Admin

  • తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఛైర్మన్ భూమన
  • మళ్లీ తన వారికే కీలక పదవి
  • ఆగస్టు 8 నాటికి ముగిసిన వైవి సుబ్బారెడ్డి పదవీ కాలం

కీలకమైన టిటిడి చైర్మన్ పదవిని మళ్లీ తన వాళ్లకే కట్టబెట్టారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి.

తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నియమించారు. ఇప్పుడున్న ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్థానంలో ఆయన నియామకం జరిగింది. ప్రస్తుత టిటిడి బోర్డు పదవీకాలం ఆగస్టు 8తో ముగియనుంది.

ముఖ్యమంత్రికి భూమన కరుణాకర్ రెడ్డి బంధువు.

భూమన అల్లుడు వైఎస్ తమ్ముడూ, జగన్ చిన్నాన్న అయిన రవీంద్ర రెడ్డి కొడుకు.  ఇప్పటిదాకా చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి కూడా జగన్ బంధువే. జగన్ చిన్నమ్మ భర్త సుబ్బారెడ్డి. 

ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా పనిచేశారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2006 నుండి 2008 వరకు భూమన టీటీడీ చైర్మన్‌గా ఉన్నారు.

వైఎస్సార్‌ జిల్లా, నందలూరు మండలం, ఈదరపల్లెలో జన్మించిన భూమన కరుణాకరరెడ్డి తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ చదివారు. 2012లో తిరుపతి నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సిపి అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019లో తిరుపతి నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జులై 2023లో భూమనను సభా హక్కుల కమిటీ ఛైర్మన్‍గా జగన్ నియమించారు.

తెలుగుదేశం నుంచి వైసిపిలో చేరిన సిద్ధా రాఘవరావుకి ఈ పదవిని ఇవ్వనున్నారని, అలాగే ఈ పదవిని బిసిలకి ఇవ్వాలనుకుంటున్నారని, అందులో భాగంగా జంగా కృష్ణమూర్తికి దక్కనుందని రకరకాల వార్తలు గతంలో వచ్చాయి.

కాని చివరికి, రాజకీయంగా బాగా పనికివచ్చే ఈ పదవిని తన సామాజికవర్గాన్ని కాదని, బయటవారికి ఇవ్వడం ముఖ్యమంత్రి జగన్ కి ఇష్టం లేదని ఈ నియామకంతో స్పష్టమైంది.

తెలుగుదేశం అధికారంలో ఉన్న 2014-2019 కాలంలో, చదలవాడ కృష్ణమూర్తి (బిసి), పుట్టా సుధాకర్ యాదవ్ (బిసి) లని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిటిడి చైర్మన్లుగా నియమించారు.