పవన్, చంద్రబాబు మీటింగుతో వైసిపిలో గుబులు మొదలైంది అనే దాంట్లో సందేహం లేదు. ఆ పార్టీ నాయకులు, మంత్రుల రియాక్షన్ చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది.
ఇక ఆ పార్టీలో సకల శాఖా మంత్రిగా వెలుగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్రోశం మామూలుగా లేదు. ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక లేకుండా వీళ్లద్దరూ ఎలా ఏకం అవుతారు? అని ఆయన ఆవేదన చెందారు. రామకృష్ణారెడ్డి గారికి కొంత వామపక్ష నేపధ్యం ఉంది. అందుకని అలవాటు చొప్పున ఇలాంటి మాటలు వస్తున్నాయి.
అంతేకాని, ఉద్దేశపూర్వకంగా ఆయన ఈ మాటలు వాడుతున్నారని అనుకోటానికి లేదు.
ఎందుకంటే, వైఎస్ రాజశేఖరరెడ్డి ఏ సైద్ధాంతిక ప్రాతిపదిక మీద 2004లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్నాడు? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి అనుకూలంగా ఉండటం వల్లా? లేకపోతే, ఎలాగోలా చంద్రబాబుని గద్దె దించాలన్న ప్రయత్నంలో భాగంగా కెసిఆర్ తో చేతులు కలిపాడా?
కాంగ్రెస్ ని దించడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీచేసిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏ సైద్ధాంతిక ప్రాతిపదిక మీద రాజశేఖరరెడ్డి గారు తన పార్టీలో కలిపేసుకున్నాడు?
అసలు వైఎస్సార్ కాంగ్రెస్ సిద్ధాంతమేంటి?
వైసిపి వారు కమ్యూనిస్టులా? సోషలిస్టులా? కాపిటలిస్టులా? ఆర్థిక సంస్కరణలకి అనుకూలమా? వ్యతిరేకమా? అందరికీ తెలుసు, ఆ పార్టీ సిద్ధాంతం ఒకటే. ఎన్ని అడ్డదోవలైనా తొక్కి, అధికారాన్ని చేజిక్కించుకోవడం. పేదల పేరుతో జనాన్ని మాయచేయడం. ఆ అధికారాన్ని ఉపయోగించుకోని, దోచుకోవడం, కావాల్సిన వాళ్లకి దోచిపెట్టడం. అధికార యత్రాంగాన్ని, పోలీసుల్ని ఉపయోగించుకోని, ప్రత్యర్థుల్ని అణగదొక్కడం.
ఇంతకుమించి వైసిపికి ఏం సిద్ధాంతాలున్నాయి?
కాబట్టి, సజ్జల గారు సిద్ధాంతాల గురించి మాట్లాడటం గురివింద గింజ సామెతని గుర్తుచేస్తుంది.
సజ్జల గారు మరో మాట అన్నాడు. చంద్రబాబు, పవన్ రహస్య కలయిక రెండు కులాలను కలిపే ప్రయత్నంలా కన్పిస్తోంది. ఆ రెండు సామాజిక వర్గాల మధ్య పెద్దగా సఖ్యత లేదు కాబట్టి జగన్ గారిని కారణంగా చూపి కలిసే ప్రయత్నం చేశారట. ఒకవేళ ఆయన అన్నట్టు రెండు కులాల మధ్య అటువంటి సఖ్యత వస్తే, సమాజానికి మేలే కదా.
నిజానికి, ఆ రెండు సామాజిక వర్గాల మధ్య సఖ్యత లేకుండా చూడటానికి వైఎస్సార్ కాలం నుంచి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి టైం వరకు వీళ్లే సెగలు రాజేశారు. ఇప్పుడు వాళ్లిద్దరూ ఒకచోటకి రావటానికి దోహదం చేసింది మాత్రం సజ్జల చెప్పినట్టు జగన్ గారే.
ఆయన ఇంత అరాచకంగా పాలించకపోతే, ఇంత దారుణంగా రాజకీయ ప్రత్యర్థుల పట్ల వ్యవహరించకపోతే, జనసేన నాయకుడు, చంద్రబాబు ఇంటికి వెళ్లి ఉండేవాడు కాదు. నిజానికి జనసేన స్వతంత్రంగా, లేకపోతే బిజెపితో కలిసి ఎన్నికలకి వెళ్లాలని ఏడాది కిందటి వరకూ అనుకుంది.
కాని, జగన్ తన అణచివేత విధానాలతో తన రాజకీయ శత్రువులందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చాడు.
కాబట్టి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలవడానికి వందశాతం జగనే కారణం.
అవన్నీ వదిలిపెట్టి, వైసిపివారే నమ్మని సిద్దాంతాల గురించి మాట్లాడటం హిపోక్రసీ.