ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నిద్రలేకుండా చేస్తున్నారు.
వైసిపికి, జగన్ కి సంబంధించి ఎవరికీ తెలియని అంతర్గత విషయాలని రాధాకృష్ణ తన ‘కొత్త పలుకు’ కాలమ్ లో రాసి, బాంబులు పేలుస్తున్నాడు. ఈ విషయాలన్నీ రాధాకృష్ణకి ఎలా తెలుస్తున్నాయో అర్థం కాక జగన్ తో పాటు, ఆయనకి అత్యంత సన్నిహితులు కూడా జుట్టు పీక్కుంటున్నారట.
తాజాగా వివేకా హత్య కేసుకి సంబంధించి ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లాన్ని సిబిఐ ప్రశ్నించినట్టు ఆంధ్రజ్యోతి రాసింది. దీంతో జగన్ కి వివేకా హత్య వ్యవహారంలో ఏదో ఒక పాత్ర ఉందనే విషయంపై మరిన్ని అనుమానాలు రేకెత్తాయి. ఆ వెంటనే డ్యామేజి కంట్రోలు చేయటానికి, అజేయ కల్లం చేత ప్రెస్ మీట్ పెట్టించారు. సిబిఐ నాతో మాట్లాడింది ఎట్లా బయటికి వచ్చింది అంటూ, కల్లం అసలు విషయాన్ని పక్కదోవన పట్టించి, గోప్యత, విశ్వసనీయత వంటి విషయాలు గురించి మాట్లాడారు.
సరే, ఈ విషయాన్ని సిబిఐ వర్గాలు రాధాకృష్ణకి చెప్పాయి అని సరిపెట్టుకోవచ్చు. కాని అంతకుముందు, జగన్ తో వివేకా హత్య జరిగిన రోజు వేకువ జామున అజేయ కల్లం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దువ్వూరి కృష్ణ సమావేశమయ్యారని, ఈ సమావేశంలో వివేకా మరణం గురించి బయటి ప్రపంచానికి తెలియక ముందే వారికి జగన్ చెప్పారని ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఈ సమాచారం ఎలా బయటికి వచ్చింది అని జగన్ అండ్ కో మల్లగుల్లాలు పడుతున్నారట. ఈ సమాచారం తెలిసిన వాళ్లు ఆ పార్టీలో అతికొద్దిమంది మాత్రమే ఉంటారు. అంటే టాప్ సోర్స్ నుంచే రాధాకృష్ణకి ఈ సమాచారం వచ్చిందన్నమాట. ఎవరీ గూఢచారి? వెంటనే తవ్వితీయాలని జగన్ ఆదేశాలట.
అంతకుముందు జగన్ తో తగాదా పడ్డ వైఎస్ షర్మిల తెలంగాణలో వేరు కుంపటి పెట్టుకోబోతున్నదని కూడా రాధాకృష్ణే ముందు రాశారు. అప్పట్లో ఆయన్ని చాలామంది ఈ విషయంలో ట్రోల్ చేశారు కూడా. కాని చివరికి అదే నిజమైంది.
ఇలా అంత:పుర రహస్యాలన్నీ బయటికి రావడం మీద జగన్, ఆయన అనూయాయులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట. జగన్ సన్నిహితులందరూ ఒకరి మీద మరొకరు అనుమానపడుతున్నారట. అందుకే లోపలి విషయాలు బయటకి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.