వివేకా హత్య కేసుకు సంబంధించి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసిన కథనం నిజమేనని సిఎం జగన్ కార్యాలయంలో ముఖ్య సలహాదారుగా ఉన్న అజేయ కల్లం ఒప్పుకున్నారు.
వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా సిబిఐ దర్యాప్తు బృందం తనతో మాట్లాడిన మాట నిజమేనని అజేయ కల్లం చెప్పారు. అయితే, సిబిఐ వాళ్లు తనను పిలవలేదని, వారే తన ఇంటికి వచ్చి మాట్లాడారని ఆయన వివరించారు.
వివేక హత్య జరిగిన రోజు వేకువ జామున జగన్ ని అజేయ కల్లం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దువ్వూరి కృష్ణ కలిశారని, సమావేశం జరుగుతుండగా జగన్ మధ్యలో బయటకి వెళ్లి ఫోన్ మాట్లాడారని, వెనక్కి వచ్చి ‘బాబాయ్ (వివేకానందరెడ్డి) ఇక లేరు’ అని చెప్పారని ఆంధ్రజ్యోతి రాసింది. ఈ కథనం ప్రచురణ అయిన తర్వాత, సిబిఐ అధికారులు అజేయ కల్లంతో మాట్లాడారని, ఆయన ధృవీకరించారని కూడా ఆంధ్రజ్యోతి రాసింది.
ఇదంతా నిజమేనని చెబుతూ, సిబిఐ మీద, ఆంధ్రజ్యోతి మీద అజేయ కల్లం విమర్శలు గుప్పించారు. విచారణలో భాగంగా దర్యాప్తు సంస్థలు సేకరించే వివరాలను కోర్టుకు సమర్పించే వరకు గోప్యంగా ఉంచాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని, కోర్టుకు కూడా ఇవ్వని వివరాలు బయటకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. ఇలాంటి పరిణామాలపై సిబిఐ సమాధానం చెప్పాలన్నారు. సిబిఐ ఎస్పీ తమ ఇంటికి వచ్చి కాసేపు మాట్లాడారని, తన నుంచి లిఖిత పూర్వకంగా ఎలాంటి వివరాలు సేకరించలేదని, తాను స్వచ్ఛందంగానే ఆయనతో మాట్లాడానని చెప్పారు.
వివేకా చనిపోయిన రోజు యాధృచ్చికంగా తాము అక్కడ ఉన్నామని, ఆ రోజు జరిగిన ఘటనకు తమ సమావేశానికి సంబంధం ఏమిటని, సమావేశం జరిగిన తర్వాత ప్రతి నిమిషం, ఏ నిమిషం ఏమి జరిగిందో తమకు ఎలా గుర్తుంటుందని, దానిని భూతద్దంలో చూపించి, మొదటి పేజీలో ఫోటోలు వేసి కథనాలు ప్రచురించడాన్ని తప్పు పట్టారు.
పత్రికల్లో వస్తున్న కథనాలకు సిబిఐ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, దర్యాప్తు ముగిసే వరకు ఈ తరహా కథనాలు రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం సిబిఐ మీద ఉందన్నారు. తాను చెప్పని వివరాలను కూడా అసత్యాలతో కూడిన కథనాల్లో ప్రచురించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక్కడ చెప్పుకోవాల్సినదేంటంటే, తాను సిబిఐతో మాట్లాడిన విషయం బయటకి ఎలా పొక్కిందని గింజుకుంటున్న అజేయ కల్లం, మరి ఇటీవల రామోజీరావుని ఏపి సిఐడి అధికారులు ప్రశ్నించినప్పుడు, ఆయన ఇంటరాగేషన్ ని వీడియో తీసి, వాటిని వైసిపి సోషల్ మీడియాలో, రామ్ గోపాల్ వర్మ లాంటి మద్దతుదారుల ద్వారా లీక్ చేసినప్పుడు ఎందుకు మాట్లాడలేదో తెలియదు.
సిఐడి ఇలా చేయడం అనైతికం అని, సిఐడి విశ్వసనీయత, ప్రభుత్వం విశ్వసనీయత దెబ్బతింటాయని అజేయ కల్లానికి అప్పుడు అర్థం కాలేదా అని అనుమానం వస్తుంది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణని కథలు, కథలుగా రాయడం మంచిది కాదని అజేయ కల్లాం సుద్దులు చెప్పడం, దాన్ని సాక్షి పెద్ద బాక్స్ కట్టి రాయడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయన్న సామెత పాతబడి పోయిందని అర్థమవుతుంది.