ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్లిన టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విశాఖ ఎయిర్ పోర్టులోనే పోలీసులు అరెస్టు చేశారు. గురువారం ఉదయం విశాఖ చేరుకున్నచంద్రబాబుని వైసిసి కార్యకర్తలు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. భద్రత కల్పించాల్సిన పోలీసులు కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, చోద్యం చూశారు. దీంతో, చంద్రబాబు, ఇతర టిడిపి నాయకులు విమానాశ్రయం బయటకి రావడానికి వీలు కాలేదు. చాలాసేపు కారులోనే కూర్చున్న చంద్రబాబు, తర్వాత బయటకి వచ్చి మండుటెండలో రోడ్డుమీదనే బైఠాయించారు. చివరకు, నాలుగు గంటల సమయంలో చంద్రబాబుని అదుపులోకి, తీసుకొని, సెక్షన్ 151 కింద నోటీసు ఇచ్చి, తరలిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.
విశాఖని ఆర్ధిక రాజధానిగా ఓకే అంటేనే వదులుతాం..
అంతకుముందు, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటుకు అంగీకరిస్తేనే చంద్రబాబును ఉత్తరాంధ్రతో తిరగిస్తామని అధికార వైసీపీ నేతలు చెప్పారు. ఆ మేరకు ప్రకటన చేస్తేనే కాన్వాయ్ కి దారిస్తామని, లేదంటే అడుగడుగునా చుక్కలు చూపెడతామని హెచ్చరించారు. అధికార పార్టీ కార్యకర్తల ఆగడాలపై టీడీపీ నేతలు భగ్గుమన్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నందునే ఇలాంటి పరిస్థితి నెలకొందని విమర్శించారు.
పోలీసులు చోద్యం చూస్తున్నారు: భరత్
పోలీసుల తీరుపై తెదేపా నేత భరత్ మండిపడ్డారు. ఉదయం నుంచి వైకాపా కార్యకర్తల వీరంగం సృష్టిస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప అడ్డుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కాన్వాయ్ వెళ్లకుండా అడ్డుకున్న వైకాపా శ్రేణులపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు.
రణరంగంగా ఎయిర్ పోర్టు..
మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు ఎయిర్ పోర్టు వైవునకు కదిలారు. అప్పటికే అక్కడ వేల మంది వైసీపీ శ్రేణులు మోహరించారు. చంద్రబాబు ఎయిర్ పోర్టు నుంచి బయటికి వచ్చేక్రమంలో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులు ఆయను చుట్టుముట్టాయి. కోడిగుడ్లు, చెప్పులతో దాడి జరిపాయి. కోడిగుడ్లు పోలీసులపై పడటంతో బాబు తృటిలో తప్పించుకున్నట్లయింది. దీంతో టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలతో బాహాబాహీకి దిగారు. తోపులాటలు, అరుపులతో ఎయిర్ పోర్టు ప్రాంతమంతా రణరంగంగా మారింది.
వెనక్కి తగ్గని మాజీ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు
ఎయిర్ పోర్టులో తన కాన్వాయ్ కి అడ్డంగా వైసీపీ కార్యకర్తలు బైఠాయించడంతో దాదాపు ఐదు గంటల పాటు చంద్రబాబు కారు లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. ఎయిర్ పోర్టు నుంచి బయటికి వచ్చే అన్ని మార్గాల్లోనూ వైసీపీ శ్రేణులు మోహరించిఉండటంతో ఆయన కారు దిగి, కాలినడకన బయటికొచ్చేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు వెంట అచ్చెంనాయుడు తో పాటు ఉత్తరాంధ్రకు చెందిన కీలకనేతలున్నారు.