కందుల రమేష్
(Investigation into Vundavalli Aruna Kumar’s fake and bogus fight against Margadarsi)
మార్గదర్శి డిపాజిటర్లని నిలువునా ముంచేందుకు ఉండవల్లి చేసిన కుట్ర ఇదీ!
మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో ప్రజాప్రయోజనాల కోసమే తాను 2006 నుంచి పోరాటం చేస్తున్నట్టు ఉండవల్లి అరుణ కుమార్ చెబుతుంటారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా 2006లో ఈ వివాదాన్ని ఆయన లేవనెత్తిన సంగతి తెలిసిందే.
మార్గదర్శి నష్టాల్లో ఉందని, రామోజీరావు దివాలా తీయబోతున్నారని, మార్గదర్శిలో డిపాజిట్లు చేసిన వారికి డబ్బులు తిరిగి వచ్చే అవకాశం లేదని ఆనాడు ఆయన చెప్పారు. రామోజీరావు కంపెనీలు కుప్పకూలటానికి రెడీగా ఉన్నాయని, డిపాజిటర్లకి రూపాయికి 13 పైసలు కూడా తిరిగి వచ్చే అవకాశం లేదని కూడా తేల్చిచెప్పారు.
అందువల్ల అర్జంటుగా రామోజీ మీద కేసులు పెట్టి, డిపాజిటర్ల ప్రయోజనాల దృష్ట్యా కంపెనీని స్వాధీనం చేసుకొవాల్సిన అవసరం ఉందని కూడా ఉండవల్లి ఉద్ఘాటించారు.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కార్యాలయంలో, బయటా తరచుగా పెట్టే పత్రికా సమావేశాలకి ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, వార్త, ఆంధ్రప్రభ (అప్పటికి ఇంకా సాక్షి పత్రిక మొదలు కాలేదు) మొదలైన పత్రికల్లో, టీవీ 9 చానెల్లో విపరీత ప్రచారం కల్పించారు.
నిజంగానే డిపాజిటర్ల డబ్బుకి ప్రమాదం ఉందనే concern తోనే మార్గదర్శిపై, రామోజీరావుపై ఉండవల్లి యుద్ధానికి సన్నద్ధమయ్యారా? రూపాయి రూపాయి కూడబెట్టుకొని మార్గదర్శిలో డిపాజిట్ చేసి ఆ వడ్డీతో జీవనం సాగించే మధ్యతరగతి కుటుంబాల సంక్షేమం కోసమే ఈ దాడిచేశారా?
కానే కాదని అనాడు జరిగిన పరిణామాల క్రమాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది.
తమ రాజకీయ, వ్యక్తిగత కక్షలతో రామోజీ, ఆయన కంపెనీల పతనాన్ని వైఎస్సార్ కోరిక మేరకు ఉండవల్లి కోరుకున్నారని, ఇందుకోసం తమ చేతిల్లో ఉన్న అధికారాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేయటానికి ఏ మాత్రం వెనకాడలేదని ఈ కథనం చదివితే తెలుస్తుంది.
వైఎస్సార్ రాజకీయ దురుద్దేశాల్ని గ్రహించిన రిజర్వు బ్యాంకు ఆప్ ఇండియా ఆనాడు మార్గదర్శికి ఒక సలహా ఇచ్చింది. 45 (ఎస్) నిబంధన వర్తిస్తుందా లేదా అనే విషయం వివాదంలో ఉన్న నేపధ్యంలో, మార్గదర్శి డిపాజిట్ల సేకరణని నిలిపివేసి, ఒక క్రమంలో డిపాజిటర్లందరికి వారి డబ్బులు చెల్లించాలని చెప్పింది.
ఈ మేరకి తాము అప్పటివరకు సేకరించిన దాదాపు 2,500 కోట్ల రూపాయల్ని తిరిగి చెల్లించే కార్యక్రమానికి మార్గదర్శి పూనుకుంది. అయితే అంత లిక్విడిటీ ఏ కంపెనీకి ఉండదు. ఇందుకోసం రకరకాల మార్గాల ద్వారా డబ్బు సమకూర్చుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. 2007 జనవరిలో బ్లాక్ స్టోన్ అనే అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థతో రామోజీ కంపెనీ ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ కింద రామోజీకి చెందిన పలు కంపెనీలు ఉన్నాయి. ఆయన కంపెనీలో 26 శాతం వాటాని బ్లాక్ స్టోన్ కి ఇచ్చేట్టు, బదులుగా 275 మిలియన్ అమెరికన్ డాలర్లు ఇచ్చేట్టు ఒప్పందం కుదరింది.
భారత మీడియా రంగంలోకి వచ్చిన అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇదేనని ఆ రోజున దేశంలోని బిజినెస్ పత్రికలన్నీ పతాక శీర్షికల్లో ప్రచురించాయి.
ఆనాటి డాలర్ మారకం విలువ ప్రకారం, ఈ మొత్తం 1200-1300 కోట్ల రూపాయలు ఉంటుంది. మిగతా డబ్బుని స్థానికంగా బ్యాంకుల నుంచి సేకరించి, ఈ మొత్తాన్ని డిపాజిటర్లకి వడ్డీతో సహా చెల్లించాలని మార్గదర్శి సంకల్పించింది.
వైఎస్సార్ కి, ఉండవల్లికి నిజంగానే డిపాజిటర్ల మీద ప్రేమ ఉంటే, వారిచేతికి డబ్బు తిరిగి వచ్చే ప్రయత్నాల్ని హర్షించాలి. కాని జరిగింది అది కాదు. ఈ ఒప్పందాన్ని ఎలాగైనా భగ్నం చేయాలని, రామోజీ చేతులు కట్టేసి, డిపాజిటర్లకి నష్టం కలిగించాలని ఈ ద్వయం నిర్ణయించుకుంది.
ఈ మేరకి వైఎస్సార్, ఉండవల్లి రంగంలోకి దిగారు. మీడియా రంగంలో విదేశీ పెట్టుబడులు పెట్టటానికి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఫారిన్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు అనుమతి కావాలి. సర్వసాధారణంగా ఈ అనుమతికి ఇబ్బందులు ఉండవు.
అయితే, రామోజీరావు కాంగ్రెస్ వ్యతిరేకి అని, టిడిపి మద్దతుదారు అని, ఈ పెట్టుబడులకి అనుమతి ఇవ్వకపోతే ఆయన కంపెనీలని ఆర్థికంగా దెబ్బకొట్టవచ్చని కేంద్రంలోని పెద్దలకి వైఎస్సార్ నచ్చజెప్పారు. అలా అడ్డుకోవటం అంతర్జాతీయంగా పెట్టుబడి సంస్థలకి wrong signals పంపినట్టవుతుందని ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం లాంటి వారు వ్యతిరేకించారు. అయినా సోనియా గాంధీపై ఒత్తిడి తీసుకొచ్చి, ఎంతకీ ఈ అనుమతి రాకుండా చేయటంలో వైఎస్సార్ ద్వారా ఉండవల్లి విజయం సాధించారు.
నెల, రెణ్నెల్లు – అలా దాదాపు ఏడాది గడిచిపోయింది. భారత ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో బ్లాక్ స్టోన్ పునరాలోచనలో పడింది. మరోవైపు ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్లు, కేసులు, ఏపి సిఐడి దాడుల పేరుతో వైఎస్సార్, ఉండవల్లి చేయవలసిన డ్యామేజి చేస్తున్నారు. ఇక రామోజీ పని అయిపోయిందని, డిపాజిటర్లకి డబ్బులు మొత్తం చెల్లించే పరిస్థితిలో లేడని చంకలు గుద్దుకున్నారు.
అప్పుడు దేశీయంగా పెట్టుబడిదారు కోసం వెతికి, నిమేష్ కంపానీ అనే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకర్ ద్వారా పెట్టుబడి సేకరణకి ఉషోదయ కొత్త ఒప్పందం కుదుర్చుకుంది. ఆయన Equator Trading Enterprises అనే తన కంపెనీ ద్వారా ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ లో 21 శాతం వాటా తీసుకొని 1,421 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించాడు.
దీనికి బదులుగా రామోజీ దేశవ్యాప్తంగా తాను ప్రారంభించిన న్యూస్ చానెళ్లని ( ఈటీవీ ఉత్తర ప్రదేశ్, ఈటీవీ మధ్యప్రదేశ్, ఈటీవీ రాజస్థాన్, ఈటీవీ బీహార్, ఈటీవీ ఉర్దూ), ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లని (ఈటీవీ మరాఠీ, ఈటీవీ కన్నడ, ఈటీవీ బంగ్లా, ఈటీవీ గుజరాత్, ఈటీవీ ఒడియా) పూర్తిగాను, తనకి ఇష్టమైన ఈటీవీ న్యూస్, ఈటీవీ ఎంటర్ టైన్ మెంట్ చానెళ్లలో 49 శాతం వాటాను కంపానీకి అమ్మేశారు.
(ఆ తర్వాత ఈ చానెళ్లు న్యూస్ 18 కిందకి, ఆ న్యూస్ 18 కంపెనీ రిలయన్స్ కిందకి వెళ్లాయి. మొత్తంగా జాతీయ మీడియాలో అడుగుపెట్టిన ఒక తెలుగు మీడియా అధినేత చేతుల్లో నుంచి ఆ చానెళ్లు జారిపోయాయి, వైఎస్సార్-ఉండవల్లి పుణ్యమా అని!)
వైఎస్సార్-ఉండవల్లి ద్వయానికి కంపానీ పెట్టుబడులు పెట్టడం మింగుడు పడలేదు.
ఎవరీ నిమేష్ కంపానీ? మేం అడ్డుపడుతున్నా రామోజీ కంపెనీల్లో పెట్టుబడులకి ఎందుకు ముందుకొస్తున్నాడు అని ఆరా తీశారు. అతని మీద రాష్ట్ర ప్రభుత్వ యత్రాంగాన్ని ప్రయోగించి బెదిరించే మార్గం కనుక్కున్నారు.
నాగార్జున ఫైనాన్స్ అనే హైదరాబాద్ కంపెనీ చిక్కుల్లో పడింది. ఈ కంపెనీ మీద అంతకుముందు నుంచే విచారణ జరుగుతోంది. నాగార్జున కంపెనీలో కంపానీ గతంలో ఇండిపెండెంట్ డైరక్టర్ గా ఉన్నాడు. ఆ కంపెనీ 100 కోట్ల డిపాజిట్ల వ్యవహారంలో డిఫాల్ట్ అయింది. ఇంకేముంది, దారం దొరికింది. కంపానీ మీద నాగార్జున ఫైనాన్స్ కేసులో అరెస్టు వారెంటుని తమ కింద ఉన్న సిఐడి వారి చేత ఇప్పించారు. అతని కోసం గాలింపు మొదలుపెట్టారు. ఇంటర్ పోల్ నోటీసు ఇప్పించారు. నిజానికి నాగార్జున ఫైనాన్స్ డిఫాల్ట్ అవటానికి ముందే 1998లోనే కంపానీ డైరక్టర్ గా వైదొలిగారు. కానీ రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవేముంది?
ఈ విషయం తెలిసిన కంపానీ బెయిల్ కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత దుబాయ్ లోనే చాలా కాలం గడిపారు. కొన్ని నెలల తర్వాత గాని ఆయనకి బెయిల్ దొరకలేదు. ఆయన బేరానికి వస్తే, ఏం జరిగేదో తెలియదు. కాని రామోజీ కంపెనీతో ఒప్పందాన్ని కంపానీ రద్దు చేసుకోలేదు. (కంపానీకి, రిలయన్స్ ముకేష్ అంబానీకి సంబంధాలు ఉన్నాయని, అంబానీల కోరిక మేరకే కంపానీ ఈ పెట్టుబడులు పెట్టారని అంటారు.)
కంపానీ అరెస్టు అక్రమమని, పూర్తిగా రాజకీయ కారణాలతోనే ఆయన్ని వేధిస్తున్నారని బిజినెస్ మీడియా కూడా రాసింది. భారత పారిశ్రామిక వర్గాలు కూడా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయాయి. అయితే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్సార్ కి కేంద్రంలో అపారమైన పలుకుబడి ఉండటంతో ఎవ్వరూ మాట్లాడలేకపోయారు.
ఏది ఏమైనా, తమ చేతుల్లో ఉన్న ప్రభుత్వ యత్రాంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసి, రామోజీతో పాటు, ఆయన సంస్థల్లో పెట్టుబడులు పెట్టటానికి వచ్చిన అంతర్జాతీయ, జాతీయ కంపెనీలని కూడా వెంటాడి, వేధించిన ఘనత వైఎస్సార్ కి, అతని వెనక శకునిలాగా సలహాలిచ్చిన ఉండవల్లికి దక్కుతుంది.
“ఆ రోజున గనుక పెట్టుబడులు రాకపోతే రామోజీ డిఫాల్ట్ అయ్యేవాడు, అప్పుడు యాక్షన్ తీసుకునే వాళ్లం,” అని ఈ మధ్య జరిగిన ప్రెస్ మీట్లో కూడా ఉండవల్లి అన్నారు. ‘ఎంత చాన్స్ మిస్సయ్యాం’ అనే దుష్ట చింతనే తప్ప, డిపాజిటర్లకి నష్టం జరగలేదు అనే ఊసే ఉండవల్లి మాటల్లో గాని, ఆలోచనల్లో గాని లేదని మరోసారి విదితమైంది.
రామోజీరావు మీద రకరకాలుగా ఒత్తిడి తీసుకొచ్చి, ఆయన డిపాజిటర్లకి తిరిగి డబ్బులు చెల్లించలేని పరిస్థితులు కల్పించాలని ఉండవల్లి ప్రయత్నించారు. ఆ పరిస్థితులు కల్పించటానికి అత్యుత్సాహంతో అధికార దుర్వినియోగం చేశారు. రామోజీరావు కంపెనీల్ని దివాలా తీయించటానికి విశ్వప్రయత్నం చేశారు.
ఆయన్ని ఏదో రకంగా జైలుకి పంపటానికి మాత్రమే ఉండవల్లి కుట్ర చేశారని, ఆయనకి డిపాజిటర్లకి తిరిగి డబ్బులు రావాలన్న కోరిక అణుమాత్రం కూడా లేదని, డిపాజిటర్ల సంక్షేమం ఆయన ఎజెండాలో లేదని ఇది చదివిన వారికి అవగతమవుతుంది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఇచ్చిన మాట ప్రకారం, ఆనాటికి వారు చెల్లించాల్సిన 2,541 కోట్ల రూపాయలని వడ్డీతో సహా మొత్తం 2,596 కోట్ల రూపాయల్ని డిపాజిటర్లందరికి తిరిగి ఇచ్చారు.
ఇప్పుడు చెప్పండి, డిపాజిటర్ల చేతికి డబ్బులు అందకూడదని, రామోజీ డిఫాల్ట్ కావాలని కోరుకున్న ఉండవల్లి, మార్గదర్శి మీద అప్పటికీ, ఇప్పటికీ చేస్తున్నది ధర్మ యుద్ధమా, అధర్మ యుద్ధమా?