తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం ఉన్న జడ్ ప్లస్ క్యాటగిరి భద్రత గురించి అధికార వైసిపి నేతలు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నారు. ఆయనకి కేంద్రం ఇచ్చిన భద్రతని తొలగించాలని పదేపదే అంటున్నారు. దీని వెనక మర్మం ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

స్పీకర్ తమ్మినేని సీతారామ్ మొదట ఈ విషయాన్ని ఎత్తారు. ఇప్పుడు తాజాగా ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి కూడా ఇదే పల్లవి ఎత్తుకున్నారు.

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు భద్రతగా ఉన్న బ్లాక్‌ క్యాట్‌ కమాండోలను తీసివేయాలని, తీసివేస్తే ఆయన ఫినిష్‌ అయిపోతారని తమ్మినేని అప్పట్లో వ్యాఖ్యానించారు.  ఆయన మాటల వెనక అర్థం ఏంటి అనేది చాలామందికి అవగతం కాలేదు. అంటే మాజీ ముఖ్యమంత్రికి భద్రత తీసివేస్తే, ఆయన మీద దాడి చేయడం సులువు అవుతుందని భావిస్తున్నారా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ప్రస్తుతం ఆయనకు భద్రత ఉంది కాబట్టి దాడి చేయడం వీలు కావడం లేదని సీతారామ్ మాటల వెనక ఉద్దేశ్యమా అనేది తెలియదు.

కమెండోలు ఉన్నారన్న ధైర్యంతో ఆయన మాట్లాడుతున్నారని, ఎవరిని ఉద్ధరించడానికి ఆయనకు ఈ బ్లాక్‌ క్యాట్‌ కమాండోల భద్రత అని సీతారామ్ ప్రశ్నించారు.  ఎవరినో ఉద్దరించాలని బ్లాక్ క్యాట్ కమెండోలని ఇవ్వరని, వాళ్ల స్థాయిని బట్టి, వారి భద్రతకి పొంచి ఉన్న ప్రమాదాన్ని అంచనా వేసి దాని ప్రకారం భద్రత కల్పిస్తారని సీతారామ్ కి తెలియకపోదు.

అయినా ఆయన ఉద్దేశ్యపూర్వకంగా ఈ ధోరణిలో మాట్లాడారు. రాష్ట్ర శాసన సభాపతిగా ఈ భద్రతను ఉపసంహరించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తానని కూడా చెప్పారు. 

ఇప్పుడు మళ్లీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి కూడా అదే మాట అంటున్నారు. చంద్రబాబుకి జడ్ ప్లస్ క్యాటగిరి భద్రత అవసరం లేదని రాష్ట్రంలో మెజారిటి ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఆయన తిరుమలలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. 

జడ్ ప్లస్ క్యాటగిరి భద్రతని కేంద్ర ప్రభుత్వంలోని హోంశాఖ ఇస్తుంది. దేశంలో చాలా తక్కువ మందికి మాత్రమే జడ్ ప్లస్ క్యాటగిరి భద్రత ఉంది. చంద్రబాబు భద్రతకి ఉన్న ముప్పు దృష్ట్యా ఆయనకి 24 మంది నేషనల్ సెక్యూరిటి గార్డ్స్ కమెండోలతో పాటు దాదాపు వంద మంది పోలీసులతో భద్రత కల్పించారు. 2003 అక్టోబరు 1 న అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మీద పీపుల్స్ వార్ నక్సలైట్లు క్లే మోర్ మైన్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఆయన అదృష్టవశాత్తూ తప్పించుకున్నారు. ఆనాటి నుంచి ఆయనకి భద్రతావ్యవస్థ పెరిగింది.

ఈ నేపధ్యంలో వైసిపి నేతల మాటలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. హింసాత్మక రాజకీయాల్ని ప్రోత్సహించడానికి ఏ మాత్రం వెనకాడని రాజకీయాన్ని ఇప్పుడు వైసిపి నాయకత్వం చేస్తోంది. ఈ నేపధ్యంలో వారి ప్రకటనలు అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో చంద్రబాబు రాష్ట్రంలో పర్యటించిన సందర్భాల్లో కూడా వైసిపి నాయకుల అండదండలతో అల్లరి మూకలు దాడులకి ప్రయత్నించిన విషయాన్ని టిడిపి నాయకులు గుర్తుచేస్తున్నారు.

ఈ నేపధ్యంలోనే, చంద్రబాబు జడ్‍ప్లస్ భద్రతపై వైసీపీ రెచ్చగొట్టే ప్రకటనల గురించి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబుపై కుట్ర చేయాలని చూస్తున్నారని, చంద్రబాబు, లోకేశ్‍కు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని ఆయన అన్నారు.