అమరావతిని అన్ని రకాలుగా సర్వనాశనం చేయాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారనడంలో రహస్యం ఏమీ లేదు. అయినా అమరావతి బతికే ఉంది. ఇప్పుడు అమృత విశ్వ విద్యాపీఠం తన కార్యకలాపాలని ప్రారంభించడానికి సిద్ధం కావడంతో రాజధాని నగరానికి కొత్త కళ వచ్చింది.

ఈ జులై నుంచి అకడమిక్ సెషన్ ప్రారంభిస్తున్నట్టుగా అమృత విద్యాపీఠం ప్రకటించింది. ఇక్కడ ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, సైన్సెస్, కల్చరల్ స్టడీస్ అందుబాటులో ఉంటాయి.

తెలుగుదేశం ప్రభుత్వం చొరవతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన దాదాపు 130 సంస్థలు అమరావతిలో తమ సంస్థలను, కార్యాలయాలను నెలకొల్పడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. ఒక అంతర్జాతీయ స్థాయి నరంలో ఎలాంటి వసతులు అందుబాటులో ఉండాలో అటువంటి వాటిని అమరావతికి రప్పించడానికి, కొత్త రాజధానికి తరలివచ్చే ప్రజాబాహుళ్యానికి అవసరమైన సేవలు, సౌకర్యాలు అందించడానికి గత ప్రభుత్వంలో ఎంత కృషి జరిగిందో ఈ జాబితా చూస్తే వెల్లడవుతుంది. 

ఇలా ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల్లో కొన్ని డబ్బు చెల్లించి భూమి స్వాధీనం చేసుకుంటే, మరికొన్ని నిర్మాణాలను కూడా మొదలుపెట్టాయి. వీటిలో ఎస్ ఆర్ ఎమ్ యూనివర్శిటి, విఐటి యూనివర్శిటీలు అమరావతిలో తమ కార్యకలాపాల్ని గత ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించాయి. వేలాది మంది విద్యార్థులు ఈ రెండు యూనివర్శిటీల్లో ఈనాడు చదువుకుంటున్నారు. 

అయితే 2019లో ప్రభుత్వం మారడంతో రావాల్సిన మిగతా సంస్థలు వేచిచూసే ధోరణిని ప్రదర్శించాయి. అమరావతి పట్ల జగన్ ప్రభుత్వ నిరాసక్త ధోరణిని గమనించాయి. ఆ తర్వాత మూడు రాజధానులంటూ కొత్త ప్రతిపాదన తీసుకురావడంతో వైసిపి ప్రభుత్వానికి అమరావతిలో రాజధాని ఏర్పడటం ఇష్టం లేదని బహిరంగమైంది. ప్రభుత్వ వైఖరి మారడంతో వందకు పైగా రావాల్సిన ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు అమరావతిలో తమ కార్యాలయాలకు సంబంధించిన నిర్ణయాలని నిలిపేశాయి. 

రాజధాని మీద స్పష్టత లేనందువల్లే తాము అమరావతిలో స్థలం తీసుకున్నప్పటికీ తమ కార్యాలయాన్ని ఇంకా నెలకొల్పలేదని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గతంలో తెలిపింది. 

ఈ నేపధ్యంలో అమృత విశ్వ విద్యాపీఠం తన కార్యకలాపాలను అమరావతిలో ప్రారంభించడాన్ని హర్షించాలి.

అమరావతిని వైసిపి ప్రభుత్వం రాజధానిగా కొనసాగించివుంటే ఎన్నో జాతీయ సంస్థలు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేవి. ఇవన్నీ అయిదు నుంచి పదేళ్లలో రూపుదిద్దుకునేవి. కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ విధంగా రాకుండా పోయాయి. ఆంధ్ర యువత సరికొత్త విద్యానైపుణ్యాలను అందిపుచ్చుకునే అవకాశాన్ని కోల్పోయింది.