Admin
ఎట్టకేలకి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన కోర్కె తీర్చుకున్నాడు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మీద హత్యాయత్నం కేసు పెట్టాడు.
అన్నమయ్య, చిత్తూరు జిల్లాల పర్యటన సందర్భంగా జరిగిన గొడవల్లో చంద్రబాబు నాయుడు మీద అన్నమయ్య జిల్లా పోలీసులు కేసులు పెట్టారు. హత్యాయత్నం కింద సెక్షన్ 307 తో పాటు, 120 బి, 147, 148, 153, 115, 109, 323, 324, r/w 149 కింద కేసులు పెట్టారు. అంటే జగన్ తనివితీరా పోలీసులు డజనుకి పైగా చంద్రబాబు మీద కేసులుపెట్టారు.
గతంలో ఎన్నడూ చంద్రబాబు నాయుడి మీద ఇంత సీరియస్ క్రిమినల్ కేసులు లేవు హత్యాయత్నం లాంటి కేసు అసలే లేదు. స్థానిక పోలీసుల మీద తాడేపల్లి పెద్దలు ఒత్తిడి తీసుకురావడం వల్లే ఇన్నిన్ని కేసులు పెట్టారని భావించాలి.
కురబలకోట మండలం ముదివీడు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డిని పేర్కొన్నారు. వారితో పాటు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, దమ్మాలపాటి రమేశ్, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు పెట్టారు.
పెద్దల ఆదేశాల మేరకు అన్నమయ్య పోలీసులు విలేకరుల సమావేశం నిర్వహించి, కేసులు నమోదుని సమర్థించుకోవటానికి ప్రయత్నించారు. ఉమాపతి రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మీద ఈ కేసులు పెట్టినట్టు అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు చెప్పారు. ఆయన చెప్పిన కారణం వింటే ఈ కేసుల్లో పస ఏంటో అర్థమవుతుంది.
ఈనెల నాలుగో తేదీన మదనపల్లెలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ చూసేందుకు చంద్రబాబు అనుమతి పొందారని.. అకస్మాత్తుగా ప్లాన్ మార్చుకొని ములకలచెరువు, అంగళ్లు మీదుగా చిత్తూరు జిల్లాలోకి వెళ్లేంఎదుకు ప్రయత్నించారని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. నాయనవారి చెరువు వద్ద స్థానిక ఎమ్మెల్యేను కించపరిచేలా చంద్రబాబు మాట్లాడారట. కించపరిచేలా మాట్లాడితే అది క్రిమినల్ కేసు ఎలా అవుతుందో తెలియదు.
కేసుకి ప్రాతిపదిక ఏంటో కూడా ఎస్పీ వివరించారు. ముదివేడు పరిధిలోని పిచ్చలవాండ్లపల్లి ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవద్దంటూ చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు అంగళ్లు మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఉమాపతి రెడ్డి, 40 మంది వైకాపా కార్యకర్తలతో రోడ్డుపైకి వచ్చారట. ముందస్తు ప్రణాళికతో భారీగా చేరుకున్న తెదేపా కార్యకర్తలు వారిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారట. ఈ దాడిలో వైకాపాకు చెందిన అర్జున్ రెడ్డి, మహేష్ (ఎంపీటీసీ), చంద్రశేఖర్ (జడ్పీటీసీ)తో పాటు ఓ రిపోర్టర్, రైతు గాయపడ్డారట. అదీ ఇన్ని కేసులు పెట్టడానికి ఎస్పీ గారు చెప్పిన కారణం.
‘‘నాపై హత్యాయత్నం చేసి.. తిరిగి నాపైనే హత్యాయత్నం కేసు పెట్టారు. ఇదెక్కడి దుర్మార్గమో నాకు అర్థం కావట్లేదు. ఎన్‌ఎస్‌జీ, మీడియా, ప్రజల సాక్షిగా నాపై దాడి జరిగింది. చాలాసార్లు నాపై దాడికి యత్నించారు. సైకో ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే, నన్ను ప్రజల మధ్య తిరగనీయకుండా చేయడానికే ఈ కేసులు పెడుతున్నారు”, అని చంద్రబాబు ఈ కేసుల మీద స్పందించారు.
మరోవైపు ములకలచెరువు పీఎస్‌లోనూ చంద్రబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు షోలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారంటూ వైకాపా కార్యకర్త చాంద్‌బాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలువురు తెదేపా నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు, చంద్రబాబును ఏ7గా పేర్కొన్నారు.