‘రాయలసీమ ప్రవాసుల సదస్సు’ పేరుతో అమెరికాలోని డల్లాస్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ వారి అధ్వర్యంలో జులై 1 వ తేదీన డల్లాస్ లో కార్యక్రమాన్ని ప్రకటించారు.
ఇందులో పెద్ద విశేషమేమీ లేదు. కాకపోతే ‘తీరాంధ్ర ప్రవాసుల సదస్సు’, ‘ఉత్తరాంధ్ర ప్రవాసుల సదస్సు’ పేరుతో అమెరికాలో ప్రాంతీయ అభివృద్ధి మీద సదస్సులు జరగడం గతంలో లేదు. అయినా తమ ప్రాంత అభివృద్ధి కోసం సదస్సు పెట్టి, చర్చించుకోవడాన్ని తప్పు పట్టడానికేమీ లేదు.
ఇందులో తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) కి పోటీగా పెట్టిన నాటా (నార్డ్ అమెరికా తెలుగు అసోసియేషన్) కి చెందిన వారే పాల్గొంటున్నారు. వాళ్ల పేర్లు వరసగా డాక్టర్ ప్రేమ్ సాగర్ రెడ్డి, డాక్టర్ ఆదిశేషారెడ్డి, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ రాఘవరెడ్డి, శ్రీహరి వేల్పూరు. అయిదుగురిలో నలుగురు రెడ్లే అవడానికి కారణం ఏంటీ అంటే నాటా అనేది వారి ఆధ్వర్యంలో నడుస్తోంది అని సరిపెట్టుకోవచ్చు.
కాని రాయలసీమ సమస్యల మీద చర్చించడానికి రాష్ట్రం నుంచి వారు పిలిచిన వక్తలు కూడా అదే వర్గం నుంచి ఉన్నారు. సదస్సుకు పిలిచిన వక్తలు ఎవరూ అంటే – అప్పిరెడ్డి హరినాధరెడ్డి, మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి, భూమన్ రెడ్డి, నరాల రామిరెడ్డి.
అటు నాటా వారు గాని, ఇటు రచయితలు, మేధావుల పేరుతో వెళుతున్న అతిధులు గాని, ఒకే కులం నుంచి మాత్రమే, అదీ అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి కులానికి చెందిన వారు మాత్రమే ఉండటాన్ని ఎట్లా సమర్థించుకుంటారో తెలియదు. రాయలసీమ అభివృద్ధి, సమస్యల గురించిన అవగాహన ఆ ప్రాంతంలో మిగతా సబ్బండ కులాల వారికి లేదని, వీరొక్కరికే ఉందని అనుకోవాలి.
రాయలసీమలో ఇటీవలి కాలంలో రెడ్లు కూడా జగన్ పాలనతో విసిగిపోయి ఉన్న నేపధ్యంలో, తమ సామాజిక వర్గం నుంచి ఎవరూ జారిపోకుండా ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఒక వాదనకు రాయలసీమ సదస్సు పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం బలం చేకూరుస్తోంది.