ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందు ముందు బిజెపి ఎటువైపు ఉండబోతోందనేది అనేది ప్రస్తుతానికి ఒక చిక్కు ప్రశ్నగా మిగిలింది.

తాజాగా జగన్ ప్రభుత్వం మీద బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా నిప్పులు చెరగడంతో ఈ విషయంలో మరింత గందరగోళం ఏర్పడింది.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో బిజెపి చేతులు కలిపిందని, అందుకే వైసిపి ప్రభుత్వానికి కేంద్రం అండగా నిలబడుతోందని ఇప్పటివరకు ఒక గట్టి అభిప్రాయం రాష్ట్రంలో ఉంది. ఇందుకు అనేక దృష్టాంతాలు ఉన్నాయి. జగన్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణని ఉల్లంఘించినా, ఎడాపెడా అప్పులు చేస్తున్నా, అనేకానేక కుంభకోణాలకి పాల్పడుతోందని, పాలనని నేరమయం చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్నా, కేంద్రంలోని బిజెపి ఎన్నడూ పల్లెత్తు మాట అనలేదు.

అనకపోగా, గడిచిన నాలుగేళ్లలో అనేక రకాలుగా జగన్ ప్రభుత్వానికి చేదోడుగా నిలబడింది. వివేకానందరెడ్డి హత్య విషయంలో కూడా కేంద్రం అండదండలతోనే జగన్ బయటపడే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా బలంగా ఉన్నాయి.

ఈ నేపధ్యంలో బిజెపి అధ్యక్షుడు శ్రీకాళహస్తిలో శనివారం జరిగిన బహిరంగ సభలో చేసిన ఘాటు విమర్శలు దేనికి సంకేతం అనే చర్చ మొదలైంది. తన ప్రసంగంలో నడ్డా నాలుగు కీలక అంశాల్లో జగన్ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేశారు.

రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తయారుచేశారన్న విమర్శ ఇందులో ప్రధానమైంది. మూడు రాజధానులకి కేంద్రం వత్తాసు కూడా ఉందని ఇప్పటివరకూ జగన్ చెబుతున్నారు. ఆ నేపధ్యంలో  అమరావతిని ఎందుకు అభివృద్ధి చేయలేదని నడ్డా ప్రశ్నించడం గమనార్హం. స్వయంగా ప్రధానమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన జరుపుకున్న రాజధానిని జగన్ ప్రభుత్వం ఎందుకు గాలికి వదిలేసిందని ఆయన విమర్శించారు. అమరావతిని బెంగుళూరుతో అనుసంధానిస్తూ హైవేని కేంద్రం చేపడితే రాష్ట్రం ముందుకు రాలేదన్నారు. అమరావతి రింగురోడ్డుని శాంక్షన్ చేస్తే, దాన్ని జగన్ ప్రభుత్వం చేపట్టలేదన్నారు.

జగన్ ప్రభుత్వంలో అవినీతి పెచ్చరిల్లిపోయిందని ధ్వజమెత్తారు. ఇంత అవినీతికి పాల్పడిన మరో ప్రభుత్వాన్ని తాము ఇంతవరకు చూడలేదని అన్నారు. వైసిపి ప్రభుత్వంలో కుంభకోణాలకి అంతేలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా మద్యపానం మీద నడిచే వ్యవస్థగా జగన్ ప్రభుత్వం మార్చిందని అన్నారు.

ఇక చివరగా ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల గురించి మాట్లాడాలంటేనే భయమేస్తోందని నడ్డా అన్నారు. 

బిజెపి అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ఇంత తీవ్రంగా జగన్ ప్రభుత్వం మీద మాట్లాడటం విశేషమనే చెప్పాలి. మరీ ముఖ్యంగా, అమరావతి అంశాన్ని లేవదీసి, ప్రధాని నరేంద్రమోడికి అమరావతి ప్రియమైనది అని చెప్పడం కూడా ముఖ్యమంత్రి జగన్ ఇప్పటిదాకా చేస్తున్న మూడు రాజధానుల ప్రచారానికి ఇబ్బందే. 

ఈ మధ్య తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి బిజెపి అగ్రనాయకులు అమిత్ షా, జెపి నడ్డాలని కలిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పొత్తులు, అవగాహనకి సంబంధించి ఎటువంటి నిర్ణయానికి రాలేదని సమాచారం. కాని మారుతున్న రాజకీయ పరిస్థితులని బట్టి, టిడిపితో చర్చలు కొనసాగుతాయనే సంకేతాన్ని బిజెపి ఇచ్చింది. 

ఈ నేపధ్యంలో తాము జగన్ వైపు పూర్తిగా లేము అనే సందేశాన్ని ఇవ్వడం కోసమే బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా ఇంత పరుషంగా వైసిపి ప్రభుత్వాన్ని విమర్శించారు అనేది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. బిజెపి మరో అగ్రనాయకుడు అమిత్ షా విశాఖపట్నంలో ఆదివారం జరగనున్న బహిరంగసభలో కూడా ఇదే రీతిలో మాట్లాడతారా లేదా అనేదాన్ని బట్టి బిజెపి ఆలోచనావిధానాన్ని అర్థం చేసుకోవచ్చు.