ప్రభుత్వ ఉద్యోగుల్ని నియంత్రించడంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చూపిన తెగువని అభినందించాల్సిందే. ఏ ముఖ్యమంత్రి చేయలేని పనిని వైసిపి అధినేత చేయగలిగారు.
చెప్పినట్టు కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సిపిఎస్) ను రద్దు చేయకపోయినా, పే రివిజన్ కమిటీ చెప్పిన దానికంటే తక్కువగా జీతాలు పెంచినా, ఉద్యోగులు దాచుకున్న డబ్బుని వాడుకున్నారన్న ఆరోపణలు వచ్చినా ప్రభుత్వాన్ని ఎదిరించలేని పరిస్థితుల్ని జగన్ కల్పించగలిగారు.
కొత్తగా ప్రకటించిన గ్యారంటీడ్ పెన్షన్ స్కీము (జిపిఎస్) విషయంలో ఉద్యోగుల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ, ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం క్యూ కట్టి మరీ ఇవాళ ముఖ్యమంత్రిని కలిసి, ఆనందాశ్రువుల్ని కురిపించారు. చప్పట్లు కొట్టారు. జేజేలు పలికారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించినందుకు ఏపి ఎన్టీవో సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిలు తమ తమ అనుచరగణంతో ఇవాళ కలిసి ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు.
నిజానికి ఈ జిపిఎస్ కి సంబంధించి గత ప్రభుత్వంలోనే చర్చలు జరిగాయి. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగ సంఘాల్ని ఒప్పించి, ఈ స్కీముని ప్రవేశపెట్టాలని ప్రయత్నించింది. అయితే ఉద్యోగ సంఘాలు నాయకులు ఆనాడు ససేమిరా అన్నారు. విశేషమేంటంటే, ఇప్పుడు అదే జిపిఎస్ స్కీంని కొన్ని మార్పులతో జగన్ ప్రభుత్వం ఎవరితో సంప్రదింపులు లేకుండానే క్యాబినెట్ మీటింగులో ప్రకటించింది. అయినా తమ అసమ్మతిని బయటికి వ్యక్తం చేసే ధైర్యం ఉద్యోగులకి లేకుండా పోయింది. అంతేకాదు, తమ అభ్యంతరాలని పక్కనబెట్టి, తాము పూర్తిగా సంతృప్తిగా ఉన్నామని కూడా ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇటీవలే మరొక ఉద్యోగ సంఘం ఏపి ఎంప్లాయిూస్ యూనియన్ అధ్యక్షుడు కె ఆర్ సూర్యనారాయణ మీద ఏసిబి కేసు పెట్టి, అరెస్టుకు ప్రయత్నించడంతో ఆయన పరారీలో ఉండాల్సిన అగత్యం ఏర్పడింది. ఈ తాజా దెబ్బతో ఉద్యోగ నాయకుల్లో ప్రభుత్వం అంటే భయం పట్టుకుంది. దానికి తోడు తమతో కలిసివస్తే సరి, లేకపోతే ఏదో ఒక నెపంతో శంకరగిరి మాన్యాలు పట్టిస్తామనే సందేశాన్ని వైసిపి ప్రభుత్వం ఇవ్వగలిగింది.
అందుకే ఇటీవలి కాలంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా, ఉద్యోగులను, ఉద్యోగ సంఘాల నాయకులను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్న ఘనత జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుంది.
నిజానికి ఉద్యోగుల పెన్షన్ల భారం ఏటికేడాది ప్రభుత్వం మీద పెనుభారంగా మారుతోంది. ఇంకా కొంతకాలమైతే, జీతాల కంటే పెన్షన్లు ఎక్కువ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఉద్యోగుల్ని కాదని విధాన పరమైన నిర్ణయాలని తీసుకోవటానికి ప్రభుత్వాలు భయపడుతూ వస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే ఉద్యోగులకి ప్రతిపక్ష నాయకుడిగా జగన్ సిపిఎస్ విషయంలో హామీ ఇచ్చారు. సిపిఎస్ ని రద్దు చేసి, గతంలోని ఓల్డ్ పెన్షన్ స్కీముని అధికారంలోకి వచ్చిన రెండువారాల్లోగా ప్రకటిస్తానని ఆయన చెప్పిన మాటలకి ఉద్యోగులు ఆనందడోలికల్లో మునిగితేలారు.
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కి తత్వం బోధపడింది. పాత పెన్షన్ స్కీముని పునరుద్ధరిస్తే, తాను బటన్లు నొక్కడం అసాధ్యమవుతుందని అర్థమైంది. అందుకే ఉద్యోగుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా, సిపిఎస్ రద్దుకు సిద్దం కాలేదు. చివరకు జిపిఎస్ పేరుతో మధ్యేమార్గంలో స్కీముని ప్రకటించారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఉద్యోగులని ఆయన ప్రభుత్వం నియంత్రించినట్టుగా మరెవ్వరూ చేయలేకపోయారనేది వాస్తవం.