పరిశీలకుడు

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పదవిని పొంది, ఆ తర్వాత బయటికి వచ్చి, వైసిపి ప్రభుత్వ విధానాల మీద చర్చావేదికలు నిర్వహిస్తున్న కొద్దిమందిలో వి లక్ష్మణరెడ్డి ఒకరు.

ఈయన జనచైతన్య వేదిక స్థాపకుడిగా తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి పరిచయం. అనేక సమకాలీన అంశాల మీద ఈ సంస్థ వేదికగా ఆయన పలు సమావేశాలు నిర్వహించేవారు. కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు రెండింటి మీదా జనచైతన్య వేదిక సమావేశాలు జరిగేవి.

2019 లో ఈయన తెలుగుదేశం ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా అజేయ కల్లం వంటి వైసిపి మద్దతుదారులతో కలిసి అమరావతి నుంచి మొదలుకొని అనేక అంశాల మీద చర్చావేదికలు పెట్టారు. ఆ తర్వాత జగన్ అధికారంలోకి రాగానే, ఆయనకి మద్య నిషేధ కమిటి చైర్మన్ గా పదవి ఇచ్చారు. ఆ పదవిలో దాదాపు ఏడాది కాలం పాటు ఉన్నారు.

అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆయన పదవీకాలాన్ని పొడిగించారో లేదో తెలియదు. మరోవైపు మద్యాన్ని ప్రభుత్వమే ఏరులుగా పారిస్తుంటే, తాను మద్యనిషేధ కమిటి చైర్మన్ గా ఉండి ఏం చేయాలో కూడా ఆయనకి పాలుపోయినట్టు లేదు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ని కలవడానికి ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదట.

ఈ నేపధ్యంలో, తాను ఇంతకాలం తెచ్చుకున్న పేరు ప్రతిష్ట ఈ పదవితో మంటగలిసి పోయేలా ఉన్నాయని భావించారో ఏమో గాని, లక్ష్మణ రెడ్డి బయటకి వచ్చి, మళ్లీ జన చైతన్య వేదిక కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా వైసిపి ప్రభుత్వ విధానాల మీద చాలా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తాజాగా, జనచైతన్య వేదిక అధ్వర్యంలో విజయవాడ లోని దాసరి భవన్ లో ‘ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్కరణలు – ప్రజలపై భారాలు’ అనే అంశంపై రాష్ట్ర సదస్సుని నిర్వహించారు.  టిడిపి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎన్ తులసిరెడ్డి తదితరులు ఈ చర్చావేదికలో పాల్గొన్నారు.

మొత్తానికి జగన్ వంటి రాజకీయ నాయకుడితో తనకు పొసగదనే విషయం లక్ష్మణరెడ్డికి అర్థమైనట్టు ఉంది. ఇటువంటి వారు వైసిపి ప్రభుత్వంలో చాలామంది ఉన్నప్పటికీ, పదవి, డబ్బు, కులం మొదలైన అంశాల ప్రభావంతో బయటకి రాలేకపోతున్నారు.